iDreamPost

ముఖ్యమైన అంశంపై బీజేపీ మౌనమేల..?

ముఖ్యమైన అంశంపై బీజేపీ మౌనమేల..?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది. దాన్ని మేము భర్తీ చేస్తాం. 2024లో బీజేపీ–జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది.. అంటూ భారీ లక్ష్యాలను నిర్థేశించుకున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతలు అందుకు తగినట్లుగా రాజకీయాలు చేయడంలేదన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. ప్రజలకు సంబంధించిన అంశాలపై తమ వైఖరిని స్పష్టంగా చెబుతూ. సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేసిన పార్టీ ఎన్నటికైనా ప్రజల మన్ననలను అందుకుంటుంది. అయితే బీజేపీ మాత్రం ఆ దిశగా పని చేయడం లేదన్నది ఇప్పుడు అందిరి నోటా వినిపిస్తోంది.

ఎంపీడీవోలకు ప్రమోషన్లు, ఆన్‌లైన్‌ జూదం నిషేధం.. తమ వల్లే సాధ్యం అయ్యాయని ప్రకటించుకున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. వ్యవసాయానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన విద్యుత్‌ అంశంపై నెలకొన్న వివాదంపై మాత్రం నోరుమెదపడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్‌ చట్టం(సవరణ) 2020 అనేక సంస్కరణలకు నాంధి పలికింది. సదరు సంస్కరణలు అమలు చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.

కేంద్రం చేసిన చట్టం మేరకు వ్యవసాయ పంపు సెట్లకు రాష్ట్ర ప్రభుత్వం మీటర్లను అమర్చాలని నిర్ణయించింది. రైతుపై రూపాయి భారం పడకుండా మీటర్లు అమర్చుతామని, ఉచిత విద్యుత్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ అవరోథం లేకుండా చేస్తామని ప్రభుత్వ పెద్దలు స్పష్టత ఇస్తున్నారు. అయితే ఉచిత విద్యుత్‌ పథకాన్ని ఎత్తివేయడానికే రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు అమర్చుతోందంటూ ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేస్తోంది. ప్రభుత్వం స్పష్టత ఇచ్చినా టీడీపీ విమర్శలు చేయడం ఆపలేదు. చట్టంలో సవరణలు చేసి సంస్కరణలకు కారణమైన కేంద్ర ప్రభుత్వం గురించి, బీజేపీ నేతల గురించి టీడీపీ పల్లెత్తుమాట కూడా మాట్లాడకుండా ఆ చట్టాన్ని అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై మాత్రం విమర్శలకు దిగడం అంతా గమనిస్తున్నారు.

ఉచిత విద్యుత్‌పై అధికార, ప్రతిపక్ష పార్టీలు చేసుకుంటున్న విమర్శలు, ప్రతివిమర్శల కారణంగా రైతుల్లో ఓకింత ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో రైతులు, రాష్ట్ర ప్రజల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌పై నెలకొన్న అనుమానాలను తీర్చాల్సిన బాథ్యత బీజేపీపై ఉంది. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్నే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందనిగానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధంలేదని గానీ చెప్పాల్సిన బాధ్యత బీజేపీదే. కానీ బీజేపీ నేతలు మాత్రం తమకు ఏమీ పట్టనట్లుగా గోడ మీద పిల్లి మాదిరిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ మౌనం కొనసాగుతుందా..? లేక వీడుతుందా..? వేచి చూడాలి.

Read Also ; ఆ పథకాన్ని ప్రజలు అలా ఉపయోగిస్తున్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి