iDreamPost

ఢిల్లీలో రైతు ఉద్యమ ఫలితం .. ఏపీ రైతులకు ఉపసమనం..!

ఢిల్లీలో రైతు ఉద్యమ ఫలితం .. ఏపీ రైతులకు ఉపసమనం..!

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గత 36 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమం చేస్తున్నారు. శాంతియతంగా సాగుతున్న ఈ ఉద్యమంలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఆరో విడత చర్చలు సాగాయి. మునుపటి చర్చల కన్నా.. ఈ దఫా చర్చలు కొద్దిమేర ఫలవంతం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం మెట్టుదిగింది. రైతులు కేంద్ర ప్రభుత్వం ముందు నాలుగు డిమాండ్లు పెట్టాగా అందులో విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు ఉపసంహరణ, ఢిల్లీ కాలుష్య నియంత్రణ ఆర్డినెన్స్‌ నుంచి పంట వ్యర్థాలు కాల్చే రైతులకు మినహాయింపు ఇచ్చేందుకు మంత్రులు అంగీకరించారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత అంశాలపై అవగాహన కుదరలేదు. ఈ రెండింటిపై మరో సారి చర్చించేందుకు ఈ నెల 4వ తేదీన ఇరు పక్షాలు సమావేశం కాబోతున్నాయి.

విద్యుత్‌ చట్టసవరణ బిల్లు రద్దుతో ప్రయోజనం..

కేంద్రం అంగీకరించిన రెండు డిమాండ్లలో ఒకటి ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రైతులకు మేలు చేసేది కాగా రెండోది విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు ఉపసంహరణ.. దేశం యావత్‌ అన్నదాతలకు ప్రయోజనం కలిగించేది కావడం విశేషం. విద్యుత్‌ చట్టసవరణ బిల్లు వల్ల ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విద్యుత్‌ విధానం.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లింది. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి ఇస్తున్న విద్యుత్‌ రాయితీలపై ప్రభావం పడబోతోంది. దీని ప్రభావం ఇప్పటికే ఆయా రాష్ట్రాలో కనిపిస్తోంది. ప్రతి వ్యవసాయ పంపు సెట్టుకు మీటర్‌ ఏర్పాటు చేయాలని చట్టంలో ఉంది. దీని వల్ల ఉచిత విద్యుత్‌ అందుకుంటున్న ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల రైతుల్లో అనేక ఆనుమానాలు, ఆందోళనలను నెలకొన్నాయి.

ఏపీ రైతులకు ఉపసమనం..

కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్‌ చట్టసవరణ బిల్లును ఏపీ ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రైతులకు నష్టం లేకుండా. ఉచిత విద్యుత్‌కు ఇబ్బంది కలగకుండా.. రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. రైతుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసింది. మీటర్లను కూడా ప్రభుత్వమే ఉచితంగా అమర్చబోతోంది. ఈ మేరకు పంపుసెట్ల నంబర్లు, రైతుల వివరాలు సేకరించే పనిలో యంత్రాంగం నిమగ్నమై ఉంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మొదటి సారిగా 2004లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అందించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన విధానం వల్ల ఉచితం పోయి.. రైతులు బిల్లులు కట్టాల్సి వస్తుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఉద్యమం చేస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం సదరు విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఏపీలోని రైతుల్లోని అనుమానాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. అదే సమయంలో పంపుసెట్లకు ఏర్పాటు చేసే మీటర్లను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడానికి యత్నిస్తున్న పార్టీలకు ఆ అవకాశం లేకుండా పోతుంది.

ఏడాదికి 9 వేల కోట్లు..

ఏపీలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 9 వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. తన తండ్రి ప్రారంభించిన ఉచిత విద్యుత్‌ను సీఎం వైఎస్‌ జగన్‌.. మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. అదే సమయంలో తన తండ్రి హామీని అమలు చేస్తున్నారు. 2004 నుంచి 2009 వరకు వ్యవసాయానికి 7 గంటలే విద్యుత్‌ సరఫరా ఇచ్చేవారు. 2009 ఎన్నికల్లో ఏడు గంటలను 9 గంటలకు పెంచుతామని వైఎస్‌ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. ప్రజల విశ్వాసాన్ని పొంది రెండో సారి సీఎం అయిన కొద్ది నెలలకే ఆయన పరమపదించారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆ హామీని గాలికొదిలేశారు. చంద్రబాబు ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. అయితే సీఎం వైఎస్‌ జగన్‌.. 9 గంటల విద్యుత్‌ను పగటి పూటే ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. దాదాపు 1700 కోట్ల రూపాయలతో ఫీడర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏపీలో పగటిపూటే 9 గంటల విద్యుత్‌ రైతులకు అందుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి