iDreamPost

విశాఖ మేయర్ ఆయనేనా?

విశాఖ మేయర్ ఆయనేనా?

రాష్ట్రంలో అతి పెద్ద నగరమైన గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ పాలనపగ్గాలను తొలిసారి చేపట్టనున్న వైస్సార్సీపీ మేయర్ అభ్యర్థిని నిర్ణయించడంపై కసరత్తు ప్రారంభించింది. 98 వార్డులున్న జీవీఎంసీలో 58 వార్డులను కైవసం చేసుకొని అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఆ పార్టీకే మేయర్ పీఠం దక్కడం ఖాయమైంది.

వంశీకృష్ణ వైపే మొగ్గు

వైస్సార్సీపీ మేయర్ అభ్యర్థిగా పార్టీ నగర అధ్యక్షుడు చెన్నూబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేరు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2009 ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు చేతిలో సుమారు 6వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడం, దాదాపు అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఏర్పాటు కాగా.. వంశీకృష్ణ వైస్సారసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి విశాఖ తూర్పులో మళ్ళీ పోటీ చేసిన విజయం వరించలేదు. అయినా కుంగిపోకుండా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. జగన్ నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్రలో విశాఖ నగరంలో విజయవంతం కావడంతో కీలక పాత్ర పోషించారు. 2019లో మరోసారి తూర్పు నియోజకవర్గంలో పోటీచేసి ఎలాగైనా గెలుపు తీరం చేరాలన్న పట్టుదలతో పనిచేసిన వంశీకి టికెట్ దక్కలేదు. పార్టీలో చేరిన అవంతి శ్రీనివాసుకు భీమిలో చోటు కల్పించడం కోసం ఆక్కడి అభ్యర్థి అక్కరమాని నిర్మలను విశాఖ తూర్పునకు మార్చాల్సి వచ్చింది. ఈ సర్దుబాట్లలో వంశీకృష్ణ పోటీకి దూరమయ్యారు. ఈ పరిణామాలతో నిరాశ చెందిన ఆయన్ను విశాఖ మేయర్ గా అవకాశం కల్పిస్తామని అప్పట్లోనే పార్టీ నాయకత్వం హామీ ఇచ్చింది.

మహిళ పేరు పరిశీలన?

అప్పటి నుంచి పార్టీ నగర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న వంశీని మున్సిపల్ ఎన్నికల్లో 21వ డివిజన్ నుంచి వైస్సార్సీపీ అభ్యర్థి గా నిలిపారు. 1800 పైచిలుకు ఓట్లతో ఆయన గెలవడంతో పాటు.. పార్టీ కూడా అత్యధిక వార్డులు చేజిక్కించుకోవడంతో వంశీకృష్ణకు ఇచ్చిన మాట ప్రకారం మేయర్ అభ్యర్థిగా ఖరారు చేస్తారని భావిస్తున్నారు. అయితే పార్టీ నాయకత్వం మదిలో రెండో ఆలోచన ఉన్నట్లు తాజాగా తెలిసింది. సగానికి పైగా వార్డుల్లో మహిళలు గెలిచినందున.. మహిళను మేయర్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన పార్టీ అగ్రనేతల్లో కొందరు చేస్తున్నట్లు సమాచారం. అయితే రెండేళ్లనాడే వంశీకృష్ణకు మాట ఇచ్చామని.. ఇప్పుడు అతన్ని పక్కనపెడితే.. మాట తప్పినట్లు అవుతుంది.. పార్టీ శ్రేణులకు వేరే సంకేతం వెళుతుందని భావిస్తున్న నాయకత్వం.. వంశీకృష్ణ వైపే మొగ్గుతున్నట్లు తెలిసింది. 18న మేయర్ ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశమే ఆసక్తి రేపుతోంది.

పీలా ఆశలు గల్లంతు

విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న పట్టును, ఎమ్మెల్యేల బలం ఆధారంగా జీవీఎంసీ ని గెలుచుకుని.. రాష్ట్రంలో మళ్లీ తలెత్తుకోవాలని ఆఆశించిన టీడీపీ చతికిలపడటఎంతో ఆ పార్టీ మేయర్ అభ్యర్థిగా ఖరారైన పీలా శ్రీనివాస్ ఆశలు కూడా గల్లంతయ్యాయి. పెందుర్తి మాజీ ఎంపీపీ పీలా మహాలక్ష్మి చిన్న కుమారుడు, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సోదరుడైన శ్రీనివాస్ కార్పొరేటర్ గా భారీ మెజారిటీతో గెలిచిన ప్రయోజనం లేకపోయింది.

Also Read : రాజ‌ధానికే విశాఖ ఓటు – జీవీఎంసీపై వైస్సార్‌సీపీ జెండా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి