iDreamPost

ఎవరీ సునీల్ డియొధర్ ?

ఎవరీ సునీల్ డియొధర్ ?

గత సంవత్సరంగా దేశంలో ఏ మూల ఎన్నికలు జరిగినా బీజేపీ తరుపున వినిపించే పేరు “సునీల్ డియొధర్”. బీజేపీ తరుపున విజయవంతమైన ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ డియొధర్ పేరు సంపాదించారు.గత వారం బి.జే.పి తో జనసేన పొత్తు కుదుర్చుకోవటంలో కీలక పాత్ర పోషించటంతో రాష్ట్రంలో కూడా సునీల్ డియొధర్ పై చర్చ నడుస్తుంది.

1985లో ఆర్.యస్.యస్ లో కార్యకర్తగా మొదలై 1991లో మేఘాలయకు ప్రచారక్ గా బాధ్యతలు చేపట్టిన సునీల్ డియొధర్ కి బలమైన ఆర్.యస్.యస్ భావజాలం కలిగిన వ్యక్తిగా ముద్ర ఏర్పర్చుకున్నారు. ప్రచారక్ నేపధ్యం నుండి వచ్చిన సునిల్ డియొధర్ 2005 నుండి భారతీయ జనతా పార్టీలో కీలక వ్యక్తిగా ఎదుగుతూ వచ్చారు. మేఘాలయ లాంటి ఈశాన్య ప్రాంతాల్లో ఆర్.యస్.యస్ ప్రచారకర్త బాధ్యతలు చేపట్టడంతో పాటు “మై హోం ఇండియా” అనే ఎన్.జి.ఓ సంస్థ ద్వారా ఈశాన్య రాష్ట్రాల నుంచి ఏర్పాటువాద దాడుల్లో నష్టపొయి అనాధలుగా మారి శరణార్ధులుగా వచ్చిన చిన్న పిల్లకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయటంతో అక్కడ రాజకీయ వ్యవహారలపై పట్టు సాధించారు.

సునీల్ డియొధర్ కు భారతీయ జనతా పార్టీలో పోల్ మేనేజ్మెంట్ వ్యుహకర్తగా మంచి పేరు ఉండటంతో 2013 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు బలమున్న దొహాద్ లోక్ సభ పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్ల భాధ్యతలు నరేంద్ర మోడీ డియొధర్ కు ఇచ్చారు. 2014 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్ధిగా రాబోతున్న మోడికి ఆ ఎన్నికలు కీలకం కావటంతో అందరి చూపు డియొధర్ బాధ్యతలు చేపట్టిన నియొజక వర్గాలపై పడింది. అనుకునట్టుగానే ఆ ఎన్నికల్లో డియొధర్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి తన ప్రచార మాయజాలంతో బీజేపీ మూడు స్థానాలలో గెలిపించారు,అంతకు ముందు ఎన్నికల్లో బీజేపీ అక్కడ ఒకే ఒక సీట్ గెలిచింది.

దీంతో బి.జే.పి నాయకత్వం డియొధర్ ను 2013 డిల్లీ ఎన్నికలకు పంపింది. దక్షిణ డిల్లీలొని 10 అసెంబ్లీ సెగ్మెంట్లకు ప్రచార వ్యుహకర్తగా నియమించింది. బీ.జే.పి నాయకత్వ నమ్మకాన్ని నిలబెట్టుకుంటు సునీల్ డియొధర్ 10లో 7 స్థానాలు బి.జె.పి కి కట్టబెట్టాడు. అరవింద్ కేజ్రివాల్ హావా లో కూడా సాధించిన ఈ విజయంతో మోడి దృష్టిని ఆకర్షించాడు. దీంతో మోడీ 2014 ఎన్నికల్లో తాను ఎంచుకున్న వారణాసి సీటు ప్రచార బాధ్యతలు అప్పచెప్పారు. నరెంద్ర మోడి నమ్మకాన్ని నిలబెట్టుకుంటు ఆ ఎన్నికల్లో వారణాసిలో నరెంద్ర మోడి తన ప్రత్యర్ధి అరవింద్ కేజ్రీవాల్ పై 3,71,784 ఒట్ల మెజారిటి సాధించటంలో కీలక పాత్ర పోషించారు.

ఈ వరస విజయాలతో అమిత్ షా దృష్టిని సైతం ఆకర్షించిన సునీల్ డియొధర్ కు మహరాష్ట్ర లోనే భారతీయ జనతా పార్టికి అత్యంత క్లిష్టమైన పాలెఘర్ నియోజకవర్గ భాద్యతలు అప్పచెప్పారు. తన సమర్ధమంతమైన వ్యుహ రచనతో సి.పి.యం కోటగా ఉన్న ఏకైక నియోజక వర్గం కూడా భారతీయ జనతా పార్టి ఖాతాలోకి వచ్చేలా పావులు కదిపి విజయం సాధించారు. ఈ విజయంతో సునీల్ డియొధర్ వ్యూహాలపై అపారమైన నమ్మకం ఏర్పర్చుకున్న భి.జే.పి అధిష్టానం పార్టికి ఉత్తర బారతదేశంలోనే అత్యంత దీన స్థితిలో ఉన్న త్రిపుర రాష్ట్రం కి ఇంచార్జ్ గా సునీల్ డియొధర్ ను నియమించారు.

2013 ఎన్నికల్లో త్రిపుర రాష్ట్రంలో కేవలం 1.5% ఓట్లతొ ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా గెలుచుకోలేక అత్యంత పేలవమైన ప్రదర్శన చేసి, డిపాజిట్లు సాధింటానికే అష్ట కష్టాలు పడిన భారతీయ జనతా పార్టిని 2018 ఎన్నికలకు వచ్చేసరికి ఇన్ ఛార్జ్ గా వెళ్ళిన సునిల్ డియొధర్ కేవలం 2 సంవత్సరాలలోనే తన పొల్ మ్యానేజ్మెంట్ వ్యుహ రచనతొ “మోడి దూత్ యోజన” అనే ప్రచార నినాదంతో మాణిక్ సర్కార ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళి బొరొక్ తెగకు చెందిన “కొకొబొరోక్” భాషను నేర్చుకుని త్రిపుర రాష్ట్రంలో 31% ఉన్న వీరికి దగ్గరయ్యారు. ఇండీజినియస్ పీపుల్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర పార్టితో పొత్తు కుదుర్చుకున్నారు. 2018 ఎన్నికలు వచ్చెసరికి సర్వ శక్తులు ఒడ్డి బలమైన మాణిక్ సర్కార్ని కూలదోసి 43% తొ 36 సీట్లు గెలిచి త్రిపురలో అధికారం దక్కించుకుని యావత్ దేశం తనవైపు చూసేలా చేసుకున్నారు.

మోడీ అమిత్ షా ద్వయం ఏర్పడిన తరువాత భారతీయ జనతాపార్టి దృష్టి దక్షిణ భారతదేశం మీద పడిందనేది నిర్వివాద అంశం. కర్నాటకలో అధికారం దక్కించుకోవటానికి చేసిన ప్రయత్నం తమిళనాడులో ఏర్పడిన రాజకీయ అనిచ్చితిని అనుకూలంగా మల్చుకునే తీవ్ర ప్రయత్నం చేసిన భారతీయ జనతాపార్టీ కి ఆశించిన ఫలితం దక్కలేదు. రెండవ సారి మరింత బలమైన శక్తిగా ఎదిగి గతంలో కన్నా అధికంగా సీట్లు సాధించిన భారతీయ జనతాపార్టికి గడిచిన ఏడాదిలొనే ఉత్తర భారత దేశంలోనే అవలంబిస్తున్న విధానాల వలన ఒకొక్క రాష్ట్రంలో పట్టు కోల్పోతూ వస్తుంది.

ఓటు బ్యాంకు తయారు చేసుకోవటంపై మరింత దృష్టి సారించిన భారతీయజనతా పార్టి దృష్టి ఆంధ్ర ప్రదేశ్ పై పడింది. 2019 ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన కనపరచిన రాష్ట్ర బి.జే.పి పార్టిని గాడిలో పెట్టేందుకు 2024 ఎన్నికలు లక్ష్యంగా వ్యుహ రచనతో ముందుకు వెళ్లాలని భావించిన బి.జే.పి అధిష్టానం వరస విజయాలతొ తనదైన ముద్ర వేసుకున్న సునీల్ డియొధర్ ను ఆంధ్ర ప్రదేశ్ సహాయక ఇంచార్జ్ గా నియమించారు.గత ఎన్నికల్లో తీవ్రపరాజయం పాలైన జన సేన బీజేపీ తో పొత్తుకోసం ప్రయత్నం చెయ్యటం,ఆంధ్రాలో బీజేపీ కి అనుకూలంగా “సోషల్ ఇంజినీరింగ్” చేసే ఆలోచనలో ఉన్న సునీల్ డియొధర్ వెరసి బీజేపీ జన సేన రాజకీయంగా దగ్గరయ్యాయి.

ఉత్తర భారత్ దేశంలో వరస విజయాలు సాధించిన సునిల్ డియొధర్ తన వ్యూహాలతో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ని బలోపేతం చేస్తాడా?చూడాలి…

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి