iDreamPost

ఆయన కోసం ఏకంగా బ్రిటన్‌ ప్రధాని వచ్చాడు.. ఇంతకీ ఎవరీ మొరారీ బాపు?

ఆయన కోసం ఏకంగా బ్రిటన్‌ ప్రధాని వచ్చాడు.. ఇంతకీ ఎవరీ మొరారీ బాపు?

ఆగస్టు 15న బ్రిటన్‌లో ‘ రామ కథ ’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని భారత దేశానికి చెందిన ఆధ్యాత్మిక వేత్త మొరారీ బాపు నిర్వహించారు. బ్రిటన్‌లోని హిందువులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొన్నారు. కేంబ్రిడ్జ్‌లోని జీసస్‌ కాలేజ్‌, యూనివర్శిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌లో జరిగిన ఆ వేడుకల్లో బ్రిటన్‌ ప్రధాని రిషీ సునఖ్‌ కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో హిందువులను ఉద్దేశిస్తూ ప్రసంగం కూడా చేశారు. ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందు ‘జై సియ రామ్‌ ’ అన్న నినాదం చేశారు. ఆయన మాట్లాడుతూ..‘‘ బాపు.. నేను బ్రిటన్‌ ప్రధానిగా ఇక్కడికి రాలేదు. ఓ హిందువుగా ఇక్కడికి వచ్చాను. నా దృష్టిలో మత నమ్మకం అన్నది చాలా వ్యక్తి గతమైనది.

అది నన్ను ప్రతీ విషయంలో గైడ్‌ చేస్తూ ఉంటుంది. ప్రధానిగా ఉండటం గొప్ప గౌరవమే కానీ.. అది అంత ఈజీ పని కాదు. కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవటానికి చాలా ఆలోచించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో నమ్మకమే మనకు దారి చూపుతుంది. శక్తిని కూడా ఇస్తుంది. దేశం కోసం గొప్ప పనులు చేసేలా చేస్తుంది’ అని అన్నారు. ఏకంగా బ్రిటన్‌ ప్రధాని పాల్గొనటంతో ‘రామ కథ’ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అంతేకాదు! కార్యక్రమాన్ని నిర్వహించిన ఆధ్యాత్మిక వేత్త మొరారీ బాపు పేరు మీడియాలో హెడ్‌ లైన్స్‌గా మారింది. ఆ వ్యక్తి ఎవరా అన్న చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరీ మొరారీ బాపు.. ఆయన కార్యక్రమానికి ఏకంగా బ్రిటన్‌ ప్రధాని వచ్చాడంటే.. అంత ప్రత్యేకత ఏంటి?

ఇంతకీ ఎవరీ మొరారీ బాపు?

మొరారీ బాపు 1946లో గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో జన్మించారు. చిన్నప్పటినుంచి ఆయనకు హిందూ గ్రంధాలంటే ఇష్టం  ఉండేది. ఆ ఇష్టంతోనే 12 ఏళ్ల వయసులో రామ చరిత మానస్‌ను కంఠస్తం చేశారు. ఆ తర్వాత 14 ఏళ్ల వయసులో రామ కథను కంఠస్తం చేశారు. తన గ్రామస్తులకు రామ చరిత మానస్‌, రామ కథను చెప్పి వినిపించేవారు. చిన్న గ్రామం నుంచి మొదలైన ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం అంచెలంచెలుగా ఎదిగింది. భారత్‌లోని ప్రధాన నగరాల్లో ఆయన తన ప్రసంగాన్ని వినిపించారు.

కేవలం భారత్‌లోనే కాదు.. అమెరికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాల్లో కూడా ఆయన తన ప్రసంగం చేశారు. మొరారీ బాపు సెక్స్‌ వర్కర్లు, ట్రాన్స్‌జెండర్లకు కూడా రామ కథను వినిపించే కార్యక్రమాన్ని చేపట్టారు. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు.. సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన తన దైన ముద్ర వేసుకున్నారు. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌లో ఆయన చేపట్టిన 9 రోజుల ‘రామ కథ’ కార్యక్రమం గత శనివారం ప్రారంభం అయింది.  మరి, బ్రిటన్‌ ప్రధాని మెచ్చిన ఆధ్యాత్మిక వేత్త మొరారీ బాపుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి