iDreamPost

వాట్సాప్​లో మరో కొత్త ఫీచర్.. ఇకపై షాపింగ్, ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు!

  • Author singhj Published - 04:11 PM, Fri - 22 September 23
  • Author singhj Published - 04:11 PM, Fri - 22 September 23
వాట్సాప్​లో మరో కొత్త ఫీచర్.. ఇకపై షాపింగ్, ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు!

ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్​ ఇటీవల పలు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఛానెల్స్​ ఫీచర్​తో పాటు నచ్చిన ప్రముఖులను, సంస్థలను అనుసరిస్తూ అప్​డేట్స్ తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే ఇప్పుడు మరో కొత్త ఫీచర్​ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది వాట్సాప్. దీని ద్వారా మెసేజ్ పంపినంత సులభంగా ఆన్​లైన్ ఆర్డర్లు, పేమెంట్లు చేసుకోవచ్చు. వినియోగదారులకు షాపింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు ‘ఫ్లో’ అనే కొత్త ఫీచర్​ను తీసుకురానుంది.

ఫ్లో ఫీచర్ ద్వారా వ్యాపారులతో పాటు యూజర్లు మల్టీ సర్వీసులను ఒకేచోట పొందనున్నారు. ఫ్యూచర్​లో బిజినెస్ అకౌంట్ యూజర్ల కోసం ఇలాంటి అనేక కొత్త ఆప్షన్లను యాడ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లో ఫీచర్ ప్రయోజనాల విషయానికొస్తే.. మీ వాట్సాప్ యాప్ నుంచి షాపింగ్ చేసుకోవచ్చు, ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు, అపాయింట్​మెంట్ బుకింగ్ లాంటి సేవల్ని సులభంగా చేసుకోవచ్చు. వాట్సాప్​లో బిజినెస్ అకౌంట్లను కలిగి ఉన్నవారి కోసం నిర్దిష్ట క్యాలెండర్లతో పాటు మరెన్నో ఆప్షన్లు రానున్నట్లు సమాచారం.

ఫ్లో ఫీచర్ కోసం వాట్సాప్ ఒక సపోర్ట్ పేజీని క్రియేట్ చేస్తుంది. అందులో అపాయింట్​మెంట్, ఫారం ఫిల్లింగ్, ప్రాడక్ట్ కస్టమైజేషన్ లాంటి ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. వాట్సాప్ యూజర్లకు ఈ ఆప్షన్లన్నీ అతి త్వరలో అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. ఫ్లో ఫీచర్ అందుబాటులోకి వస్తే థర్డ్ పార్టీ యాప్​లతో అవసరం లేకుండా పోతుంది. ఇప్పటికే మన దేశంలోని అనేక వ్యాపార సంస్థలతో ఈ ఫ్లో ఫీచర్​ను వాట్సాప్ టెస్ట్ చేసింది. రెడ్ బస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు పలు ఈ-కామర్స్ యాప్స్​లో పొందే ఆప్షన్లన్నీ ఇక మీదట వాట్సాప్​లోనే అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ స్పష్టం చేసింది.

షాపింగ్, ఫుడ్ ఆర్డర్, టికెట్ బుకింగ్​తో పాటు ఈ-మెసేజింగ్ యాప్​ ఫెసిలిటీని కూడా తీసుకురానున్నామని వాట్సాప్ తెలిపింది. అయితే ఈ సేవల కోసం బిజినెస్ అకౌంట్ యూజర్ల నుంచి ఎంతమేరకు వసూలు చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు పేమెంట్స్ కోసం రాజర్​పే, పేయూతో వాట్సాప్ ఒప్పందం కుదుర్చుకుంది. వీటి ద్వారా వినియోగదారులు క్షణాల్లో లావాదేవీలను పూర్తి చేయొచ్చు. ఇప్పటిదాకా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసేందుకు యూజర్లు వాట్సాప్​ను వాడేవారు. ఇక నుంచి ఇతర యూపీఐలు, క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించిన చెల్లింపులు కూడా యాప్​లోనే చేయొచ్చని వాట్సాప్ ప్రకటించింది.

ఇదీ చదవండి: చంద్రబాబుకు షాక్.. కస్టడీకి గ్రీన్ సిగ్నల్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి