iDreamPost

వాళ్ళు లెంపలేసుకుంటున్నారు.. వీళ్ళేం చేస్తారో

వాళ్ళు లెంపలేసుకుంటున్నారు.. వీళ్ళేం చేస్తారో

పవన్‌ కళ్యాణ్‌తో పొత్తు విషయంలో వామపక్ష నేత నారాయణ తప్పుచేసాం.. లెంపలేసుకుంటున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రాజకీయాల్లో వేడి రగిల్చారనే చెప్పాలి. ఏ విషయం మీదనైనా ముక్కుసూటిగా మాట్లాడే నారాయణ తన ఉద్దేశాన్ని నేరుగానే ప్రకటించేసారు. ఈ విషయంలో జనసేన–పవన్‌ కళ్యాణ్‌లు మౌనమే తమ సమాధానంగా ఊరకుండిపోయారు. దీంతో ఎవరికి తోచిన విధంగా వారు కేప్షన్స్‌ పెట్టుకుని, కథలల్లేసుకుంటున్నారు.

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ తీరును గమనించిన వారెవరికైనా అభ్యంతరాలు అనేకం పుట్టుకొస్తాయంటున్నారు విశ్లేషకులు. తగినంత చరిష్మా ఉన్నప్పటికీ వాడాల్సిన టైమ్‌లో వాడకుండా, తన పార్టీ కోసం కాకుండా చేసిన అనేక వ్యూహాత్మక తప్పిదాల కారణంగా ఇప్పుడు జనసేన ఎదుర్కొంటున్న పరిస్థితి వచ్చిందన్నది వారి వివరణ. అయితే పవన్‌కు ఎటువంటి వ్యూహమైనా ఉండొచ్చు కానీ ఆయన్ను నమ్ముకుని పార్టీలోకెళ్ళిన వాళ్ళ రాజకీయ భవిష్యత్తేంటన్నదే ఇప్పుడు డోలాయమానంగా మారిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం బీజేపీ–జనసేల పొత్తు విషయంలో కూడా ఆయా పార్టీల మధ్య ప్రకటించినంత ఇంపుగా ఏమీ లేదన్న టాక్‌ విన్పిస్తోంది. ఎందుకంటే హైలెవల్‌ నాయకులు ప్రకటించేసి ఊరుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల కేడర్‌ను కలిపి సంయుక్త కార్యక్రమాలు చేపడుతున్న దాఖలాలేమీ కన్పించడం లేదు. దీనికి తోడు అమరావతి రాజధాని విషయంలో ఏప్రాంత ప్రజలకు దొరికేయకుండా బీజేపీ చాకచక్యంగా వ్యవహరించేందుకు నిర్ణయించుకుందని ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. అయితే బీజేపీతో స్నేహంలో ఉన్న పవన్‌ మాత్రం తాను అమరావతికే కట్టుబడి ఉన్నానని అఫిడవిట్‌ సమర్పించేసారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాలు అన్యాపదేశంగానే బైటపడ్డాయంటున్నారు.

రెండు మిత్ర పార్టీల నుంచి చెరో విధమైన అభిప్రాయం వ్యక్తం కావడం రాజకీయ వ్యూహంగాను భావించొచ్చు, అదే సమయంలో ఇరు పార్టీల మధ్య భావ వైరుధ్యంగాను అభిప్రాయపడొచ్చు. కానీ ఇక్కడ వ్యూహానికంటే వైరుధ్యాన్నే ఎక్కువ మంది చూస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా పవన్‌ అనుసరించిన వ్యూహాలు, ప్రస్తుతం వామపక్ష నేత నారాయణ చేసిన వ్యాఖ్యలను కలిపి చూస్తే వైరుధ్యమే కన్పించకమానదు. ఇప్పటిక్కూడా క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల నాయకులను సమన్వయం పరిచే సంయుక్త కార్యాచరణ ఏదీ చోటు చేసుకోకపోవడంపై పొత్తుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటికి తోడు తలోమాట.. చెరో దారీ అన్న రీతిలో కొనసాగితే ‘ఉన్నత స్థితి’ మాట మర్చిపోవాల్సి రావొచ్చు. ప్రజలందరికీ కాకపోయినా కనీసం రెండు పార్టీల కేడర్‌కైనా ఇలా భిన్నాభిప్రాయాల వ్యవహారంపై క్లారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం బీజేపీ–జనసేన పార్టీలకు ఎంతైనా ఉందంటున్నారు పరిశీలకులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి