iDreamPost

ప్రధాని మోడీ భారత పౌరుడే అనడానికి రుజువులున్నాయా?

ప్రధాని మోడీ భారత పౌరుడే అనడానికి రుజువులున్నాయా?

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు ఈ చట్టాన్ని ఆమోదించిన నాటి నుండి అట్టుడుకుతున్నాయి.

ఢిల్లీ,పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ మొదలైన రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎన్ఏఏ, ఎన్ఆర్సీ బిల్లును తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని కేరళ,మధ్య ప్రదేశ్,పశ్చిమ బెంగాల్,బీహార్,ఆంధ్ర ప్రదేశ్,మహారాష్ట్ర,జార్ఖండ్ రాష్ట్రాలు తేల్చి చెప్పాయి.

సాక్షాత్తు అస్సాం మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన సైదా అన్వరా తైమూర్ పేరు ఎన్ఆర్సీ జాబితాలో లేకపోవడం సంచలనం కలిగించింది.భారత దేశ ప్రథమ పౌరుడిగా పనిచేసిన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ బంధువులకు కూడా ఎన్ఆర్సీ జాబితాలో పేరు లేదు. ఇలా తవ్వుకుంటూ పోతే అనేక ఉన్నతపదవులు అధిరోహించిన కొందరికి,అలాగే భారత సైన్యంలో పనిచేసిన అధికారులకు కూడా ఎన్ఆర్సీ జాబితాలో పేర్లు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు.

అయితే తాజాగా కేరళలోని త్రిస్సూర్ జిల్లా చాలాకుడీకి చెందిన జోషి అనే ఆర్టీఐ కార్యకర్తకు భారత ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర భారత పౌరుడే అని రుజువు చేసే పత్రాలున్నాయా అన్న అనుమానం వచ్చింది. దాంతో ప్రధాని మోడీ భారత పౌరుడే అని రుజువులేంటీ? అయన దగ్గర భారత పౌరుడే అని రుజువు చేసే ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తూ ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసారు. ఆయన దరఖాస్తును ఢిల్లీలోని కేంద్ర ప్రజా సమాచార అధికారికి పంపామని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఈ వార్త మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం దేశంలో ఎన్ఏఏ, ఎన్ఆర్సీ ల గురించి అనేక ఆందోళనలు జరుగుతున్నాయని ప్రజా ప్రయోజనాల కోసమే ఇలా దరఖాస్తు చేసానని జోషి చెప్పుకొచ్చారు. జోషి చేసిన ఈ దరఖాస్తుకు ఎలాంటి సమాధానం వస్తుందో అని అనేకమంది ఎదురు చూస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి