iDreamPost

కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సక్సెస్‌ సీక్రెట్‌ ఏంటి..?

కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సక్సెస్‌ సీక్రెట్‌ ఏంటి..?

యువకుడు, సమస్యలు అర్ధం చేసుకుని పరిష్కరించే చురుకుదనం, విద్యావంతుడు, నియోజవర్గంలో తిరుగులేని ఆధిక్యం ప్రదర్శిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. అయితే ఆయన వర్గీయుల్లో మాత్రం జగ్గిరెడ్డికి తగినంత ప్రాధాన్యం లభించడం లేదన్న అసంతృప్తి మాత్రం నెలకొంది. తండ్రి, తాతల నుంచి రాజకీయ వారసత్వాన్ని పొందిన జగ్గిరెడ్డి కొత్తపేట నియోజకవర్గం ప్రజల్లో తిరుగులేని పట్టును సంపాదించుకున్నారు.

తండ్రి సోమసుందరెడ్డి వృద్ధాప్యం కారణంగా 2004లో ఎమ్మెల్యే సీటు పొందిన జగ్గిరెడ్డి దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి టైమ్‌లో గెలుపొందారు. అప్పట్లో కేవీ సత్యనారాయణరెడ్డితో చివరి వరకు పోటీపడి సీటు దక్కించుకోవడంలో సఫలమైన జగ్గిరెడ్డి, ఎమ్మెల్యేగా గెలుపొందడం ద్వారా తనకు సీటు కేటాయించడమే కరెక్టేనని నిరూపించుకున్నారు. 2,271 ఓట్ల స్వల్ప మెజార్టీతోనే గట్టెక్కినప్పటికీ.. గెలిచేసాం అని ఊరుకోకుండా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ తనదైన ముద్ర వేసారనే ఆయన అభిమానులు చెబుతారు. కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న కొత్తపేట నియోజకవర్గంలో ఇతర సామాజికవర్గాలను దగ్గర చేసుకోవడంతో పాటు, కాపు సామాజికవర్గం నుంచి వ్యతిరేకత ఎదురుకాకుండా వ్యూహాత్మకంగా జగ్గిరెడ్డి రాజకీయాలు నడిపిస్తున్నారనే చెప్పాలి.

2009లో ప్రజారాజ్యం పార్టీ ప్రభావం కారణంగా బండారు సత్యానందరావు చేతిలో 2,470 ఓట్ల తేడాతో ఓటమిపాలైనప్పటికీ నిరుత్సాహ పడకుండా నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూనే ఉన్నారు. ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ జనానికి నిత్యం అందుబాటులోనే ఉండేవారు. దీని ప్రతిఫలం 2014 ఎన్నికల్లో కన్పించింది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే జగ్గిరెడ్డికే కొత్తపేట ప్రజలు పట్టంగట్టారు. చుట్టుపక్కల నియోజకవర్గాల్లో టీడీపీఎమ్మెల్యేలు గెలుస్తున్నప్పటికీ.. పోటా పోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో 713 ఓట్లతో కొత్తపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు.

అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ప్రజలకు మరింతగా సేవలందించడంలో వెనకడుగు వేయాల్సి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో తనదైన మార్కు రాజకీయాలతో జగ్గిరెడ్డి జనం నుంచి దూరం కాలేదు. తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ సమావేశాల్లో టీడీపీ ప్రజా వ్యతిరేక ధోరణులను ఎప్పటికపుపడు ఎండగడుతూ జిల్లా వ్యాప్తంగా గుర్తింపు కూడా పొందారు. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యంతో నేరుగా చేసిన వాదనతో రాష్ట్ర వాప్తంగా జనం నోళ్ళలో జగ్గిరెడ్డి నానారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు టీడీపీ ప్రభుత్వంపై గొంతెత్తుతుండడం నియోకవర్గంలో పట్టు నిలిపింది. జగ్గిరెడ్డి కృషిని గుర్తించి సీయం వైఎస్‌ జగన్‌ 2019లో అవకాశం ఇచ్చారు. దీంతో మరోసారి బండారు సత్యానందరావుపై 4,038 ఓట్లతో విజయం సాధించారు.

2004, 2014, 2019లో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగ్గిరెడ్డి ఫుల్‌టైమ్‌ పొలిటీషియన్‌గా పేరుపొందారు. గెలిచినా.. ఓడినా నిరంతరం నియోజకవర్గ ప్రజలతో మమేకం అవుతూ తన విజయానికి బాటులు వేసుకుంటున్నారనే చెప్పాలి. కోవిడ్‌ సెకెండ్‌వేవ్‌లో ప్రజలకు విస్తృతమైన సేవలందించి వారి మనస్సుల్లో సుస్థితర స్థానాన్ని సంపాదించుకున్నారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. యువకుడు కావడంతో నిరంతరం జనంలోనే ఉంటూ కోవిడ్‌రోగులు ఎవరికి ఎప్పుడే అవసరం వచ్చినా వెంటనే స్పందించి, సాయం అందించారు. ఇందుకోసం పార్టీ కార్యాలయాన్నే కోవిడ్‌ కాల్‌సెంటర్‌గా మార్చేసి ఎంతో మంది నాయకులు స్ఫూర్తిగా నిలిచారు.

అన్ని విధాలా మంత్రి కావడానికి అర్హత ఉన్నప్పటికీ జిల్లాలో సామాజికవర్గ లెక్కల నేపథ్యంలో ఆ స్థానం జగ్గిరెడ్డి లభించడం లేదని ఆయన వర్గీయుల్లో అసంతృప్తి నెలకొని ఉంది. ఎప్పుడు ఈ విషయాన్ని గురించి ఆయన వద్ద ప్రస్తావించినా.. చిరునవ్వే ఆయన సమాధానంగా ఉంటుంది. భవిష్యత్తులో అయినా తమ ఆశలు నెరవేరాలని జగ్గిరెడ్డి అభిమానులు వేచి చూస్తున్నారు.

Also Read : దుర్గేష్‌ దారెటు..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి