iDreamPost

ఏలూరు ఘటనపై కలెక్టర్‌ నివేదిక

ఏలూరు ఘటనపై కలెక్టర్‌ నివేదిక

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గరవుతూ ఆస్పత్రిపాలవుతున్న వ్యవహారం తెలుగు రాష్ట్ల్రాలలో సంచలనం కలిగిస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న తరుణంలో మూర్చ, కళ్లు తిరగడం, నురగకక్కుకోవడం వంటి లక్షణాలతో కొత్తగా వెలుగులోకి వచ్చిన అంతుచిక్కని వ్యాధి అందరిలోనూ ఆందోళనను కలిగిస్తోంది. రెండు రోజులుగా ఏలూరు నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమైన వింత వ్యాధిపై ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ నివేదిక ఇచ్చారు.

ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించండంలేదని కలెక్టర్‌ తన నివేదికలో పేర్కొన్నారు. అయితే వ్యాధి తీవ్రత ఎక్కువగానే ఉందని వివరించారు. బాధితులకు మూర్చ ఒకసారే వస్తోందని పేర్కొన్నారు. మున్సిపల్‌ నీరు సరఫరా లేని ప్రాంతాలలోని ప్రజలు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. నిత్యం మినరల్‌ వాటర్‌ తాగే వారు కూడా ఈ వ్యాధి బారినపడ్డారని కలెక్టర్‌ పేర్కొన్నారు. నీటి శాంపిల్స్, బాధితుల రక్త నమూనాల నివేదికలు సాధారణంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇంకా కల్చర్‌ రిపోర్టు రావాల్సి ఉందని తెలిపారు. నీటి, రక్త నమూనాల విశ్లేషణ కోసం సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయాలజీ (సీసీఎంబీ)కి పంపామని కలెక్టర్‌ తెలిపారు. నగరంలో ఇంటింట సర్వే చేస్తున్నామని పేర్కొన్నారు.

కాగా, సీఎం వైఎస్‌ జగన్‌ ఈ రోజు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి