iDreamPost

అంతంత మాత్రపు ఆదాయం – అయినా ఆగని సంక్షేమం

అంతంత మాత్రపు ఆదాయం – అయినా ఆగని సంక్షేమం

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఓవైపు నిధుల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ఆదాయం అమాంతంగా పడిపోతోంది. అదే సమయంలో సంక్షేమం పొంగిపొర్లుతోంది. కొత్త పథకాలతో , వివిధ తరగతులకు నేరుగా ప్రయోజనం కల్పించే ప్రయత్నం జోరుగా సాగుతోంది. ఓవైపు ఆర్థిక కష్టాలు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు ఆగకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. విపక్షాలకు అంతుబట్టని విషయంగా మారింది.

ఇటీవల ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఎవరికి ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ ప్రతీ సమీక్షుడు ఓ విషయంలో జగన్ ని అభినందించక తప్పలేదు. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలులో ఏపీ ప్రభుత్వ దూకుడును అంతా కొనియాడారు. అదే సమయంలో మ్యానిఫెస్టో అమలు విషయంలో చిత్తశుద్ధిని ప్రశంసించారు. గతానికి భిన్నంగా అధికార అంతంలో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు క్రెడిట్ కోసం కొన్ని స్కీములు తీసుకురావడం కాకుండా, పాలన చేపట్టిన తొలి ఏడాదిలోనే 90శాతం హామీలు అమలు చేయడం అసామాన్యం అంటూ చెప్పుకొచ్చారు. ఆ విధంగా జగన్ అందరి మనసులు గెలుచుకున్నట్టేనని చెప్పవచ్చు. సంక్షేమం విషయంలో దేశంలోనే జగన్ పంథా ప్రత్యేకంగా కనిపిస్తోంది.

చెప్పాడంటే..చేస్తాడంతే అనే రీతిలో సాగుతున్న జగన్ పాలనలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారుతోంది. ఆదాయానికి పరిమితులు ఏర్పడుతున్నాయి. అసలే మాంధ్యం ముంచుకొస్తుందని భావిస్తున్న సమయంలో కరోనా కారణంగా ప్రపంచమే విలవిల్లాడుతోంది. అలాంటి సమయంలో ఆర్థిక వనరుల కొరత ఉన్న కొత్త రాష్ట్రంలో అనేక సమస్యలు తప్పవు. ముఖ్యంగా నెలకు కనీసంగా 5వేల కోట్లకు తగ్గకుండా రూ.6వేల వరకూ ఆదాయం వస్తుందని ఆర్థిక శాఖ అంచనాలు వేసింది. కానీ లాక్ డౌన్ కారణంగా అంచనాలు తలకిందులయ్యాయి. నాలుగో వంతుకే పరిమితం అయిపోయింది.

దాంతో చివరకు ఏప్రిల్‌లో రూ. 1,323 కోట్లు మా్త్రమే ఆదాయం రాగా మే నెలలో అది రూ. 1,360 కోట్లుగా ఉంది. దాంతో ఖజానికి ఇన్ కమింగ్ నామమాత్రంగా మారుతోంది. అదే సమయంలో ఏప్రిల్ , మే నెలల్లోనే జగన్ పలు పథకాలు అమలు చేశారు. రైతు భరోసా, విద్యాదీవెన, మత్స్యకారులకు నష్టపరిహారం సహా పలు పేర్లతో ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేశారు. కరోనా సహాయం పేరుతో వెయ్యి రూపాయల వంతున పరిహారం పంపిణీ జరిగింది.

జగన్ ప్రభుత్వం పథకాలు అమలు చేయడంతో పాటుగా వాటిలో పారదర్శకత ప్రధాన ఆకర్షణగా ఉంది. ఇప్పటి వరకూ ఏడాది సమయంలో పథకాల్లో అవినీతిపై ప్రతిపక్షాలు కనీసం ఒక్క ఆరోపణ కూడా చేయలేకపోయాయంటే ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. పార్టీలు, ప్రాంతాలు, కుల, మతాల ప్రమేయం లేకుండా అర్హులందరికీ పథకాలు చేర్చడంలోనూ జగన్ ప్రభుత్వ పనితీరు పలువురిని ఆకట్టుకుంటోంది. అదే సమయంలో కేంద్రం నుంచి సహకారం కూడా అంతంతమాత్రంగానే అన్నట్టుగా తయారయ్యింది. 2018-19లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా కేంద్రం నుంచి వచ్చిన వాటాతో పోలిస్తే 2019-20లో జగన్ ప్రభుత్వానికి దక్కిన ఆదాయంలో తగ్గుదల నమోదు కావడం విశేషం.

ఓవైపు కేంద్రం నుంచి తగినంత చేయూత లేకపోవడం, రాష్ట్రంలో ఆదాయం నిలిచిపోవడం సహా అనేక సమస్యలున్నప్పటికీ సామాన్యులకు అందించాల్సిన పథకాల విషయంలో వెనకుడు వేయకుండా సాగుతున్న తీరు జగన్ ప్రభుత్వం మీద ప్రజాభిమానాన్ని రెట్టింపు చేస్తోంది. ఓవైపు రాజకీయ, న్యాయపరమైన చిక్కులు ఎన్ని ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలకు ఎదురొడ్డుతూ, ప్రజలకు ఆసరాగా నిలుస్తున్న తీరు జగన్ ప్రత్యర్థులకు మింగుడుపడకపోగా, సామాన్యులకు మాత్రం ఊరటనిస్తుందనే చెప్పవచ్చు.

ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచేందుకు ప్రభుత్వం నేరుగా అందిస్తున్న సహాయం కారణంగా కలుగుతున్న ప్రయోజనం మొన్నటి అమ్మ ఒడి నగదు అందగానే ఊపందుకున్న మార్కెట్లు తేటతెల్లం చేశాయి. తద్వారా కేవలం లబ్దిదారుల కోసమే కాకుండా అన్ని వర్గాలకు మేలు కలిగేలా జగన్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్టు స్పష్టమవుతోం ది. ఆర్థిక ఒడిదుడుకులు కాస్త తగ్గితే ప్రభుత్వం మరింత ఉదారంగా వ్యవహరించేందుకు దోహదపడుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి