iDreamPost

ఇలాంటి ‘వినోదం’ కావాలీ – Nostalgia

ఇలాంటి  ‘వినోదం’  కావాలీ – Nostalgia

ఇప్పుడు కామెడీ పేరుతో వస్తున్న సినిమాలు చూసినా వెబ్ సిరీస్ ల పేరుతో కొందరు యువ దర్శకులు చేస్తున్న ప్రయోగాలు చూసినా ఎక్కడా ఆరోగ్యకరమైన హాస్యం కనిపించడం లేదు. బూతు ఉంటే తప్ప జనం ఆదరించరు అనే రీతిలో వాటిని ఖచ్చితంగా స్క్రిప్ట్ లో ఉండేలా రాసుకుంటున్నారు. నిజానికి జబర్దస్త్ లాంటి రియాలిటీ షోలు క్లిక్ అయ్యాక మాములు కామెడీకి జనం థియేటర్లో నవ్వడం లేదు. అయితే డబుల్ మీనింగ్ లో ఉండాలి లేదా త్రివిక్రమ్ స్టైల్ లో సుతిమెత్తగా ఉండాలి. అది అందరివల్లా కావడం లేదు.

ఉదాహరణకు 1996లో వచ్చిన వినోదం సినిమాలో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ గురించి ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఎక్కడ ఒక్క మాట తూలకుండా కేవలం మూగ సైగలతో ఇళ్ళలో వస్తువులు ఎత్తుకుపోయే చిలిపి దొంగగా ఏవిఎస్ తో కలిపి పూయించిన నవ్వులు ఓ రేంజ్ లో పేలాయి. కేవలం ఈ ఒక్క ట్రాక్ కోసమే రిపీట్ ఆడియన్స్ వచ్చేవారంటే నమ్మగలరా. కానీ ఇది నిజం. మంచి హెల్తీ ఎంటర్ టైన్మెంట్ కి వినోదంని దిక్సూచిగా చూపొచ్చు. ఆ టైంలో కేవలం కామెడీ సినిమాలతో స్టార్ హీరోలకు ధీటుగా వసూళ్లు రాబట్టే రేంజ్ కు చేరుకున్న ఎస్వి కృష్ణారెడ్డి ఇందులో కావాల్సినంత వినోదంతో పాటు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే అద్భుతమైన పాటలు కూడా ఇచ్చి టికెట్ కొన్న ప్రేక్షకుడికి ఫుల్ మీల్స్ లాంటి న్యాయం చేశారు.

శ్రీకాంత్ అతని స్నేహ బృందం చేసే తమాషాలతో పాటు కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్ ల ట్రాకులు ఓ రేంజ్ లో పేలాయి. ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారి వినోదం ప్రేక్షకులను చక్కిలిగింతలు పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు చూస్తేనేమో కొత్త రచయితలు కాసిన్ని నవ్వులకే కిందమీదా పడుతున్నారు. మరి అప్పట్లో ఎస్వి కృష్ణారెడ్డి, ఈవివి, రేలంగి నరసింహరావు, జంధ్యాల లాంటి మహామహులు పోటాపోటీగా జనాన్ని నవ్వించేవారు. ఇప్పుడు అంత వినోదాన్ని ఆశించడం అత్యాశేమో. అందులోనూ ఎస్వి కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు తక్కువ టైంలోనే సినిమాలు మానేయడం కూడా చాలా ప్రభావం చూపించింది. మరి ఈ పోకడను మార్చి స్వచ్చమైన వినోదాన్ని ఎవరు ఇస్తారో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి