iDreamPost

పోలవరం ప్రాజెక్ట్ కి కేసీఆర్ సానుకూల సంకేతాలు

పోలవరం ప్రాజెక్ట్ కి కేసీఆర్ సానుకూల సంకేతాలు

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో మార్గం సుగమం అవుతోంది. ప్రభుత్వానికి సానుకూల సంకేతాలు అందుతున్నాయి. తెలంగాణా ప్రభుత్వం సానుకూలంగా ఉండడంతో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏర్పడిన అడ్డంకులు తొలగిపో్యే అవకాశం ఏర్పడుతోంది. ఇప్పటికే దానికి సంబంధించిన కేసులను ఉపసంహరించుకునే దిశలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సంకేతాలు ఇచ్చేశారు. అదే సమయంలో ఒడిశాతో కూడా మాట్లాడేందుకు సన్నద్దమవుతున్న తరుణంలో ప్రాజెక్ట్ కి సంబంధించిన అనుమతుల విషయంలో అన్ని అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఏర్పడుతోంది.

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఇప్పటికే దశాబ్దంన్నర కాలంగా సాగుతోంది. గతంలో అనేక మంది ప్రయత్నాలు చేసినప్పటికీ చివరిగా వైఎస్ఆర్ హయంలో శంకస్థాపన జరిగిన తర్వాత ఈ ప్రాజెక్ట్ కి 2013లో ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం జాతీయ హోదా దక్కింది. దానికి అనుగుణంగా నిర్మాణం పూర్తి చేసేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే స్పిల్ వే నిర్మాణానికి సంబంధించిన పనులు దాదాపు 90శాతం పూర్తయ్యాయి. ఈ సీజన్ లో వరదల నాటికి అది పూర్తి చేసేందుకు కాంట్రాక్ట్ సంస్థ మేఘా ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. లాక్ డౌన్ కారణంగా కూలీల కొరత ఏర్పడినప్పటికీ బెంగాల్ , బీహార్ వంటి రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా వందల మంది కూలీలను తీసుకొచ్చి పనులు సాగిస్తున్నారు. ఆగష్ట్ నాటికి వరదలు వచ్చే అవకాశం ఉండడంతో పనులు వేగవంతం చేశారు.

స్పిల్ వే సిద్ధం కాగానే కాఫర్ డ్యామ్ పనులు పూర్తి చేసి మెయిన్ డ్యామ్ నిర్మాణంపై దృష్టి పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే దిశలో జగన్ చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఆయన కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకునేందుకు సిద్ధపడ్డారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు ఫలించి పోలవరం నిర్మాణానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కోర్టులలో తెలంగాణా ప్రభుత్వం వేసిన కేసులు ఉపసంహరించుకునే దిశలో కేసీఆర్ సిగ్నల్ ఇవ్వడంతో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి లైన్ క్లియర్ అవుతున్నట్టు చెప్పవచ్చు. వేగవంతంగా ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసే అవకాశం ఏర్పడుతోంది.

ఓవైపు నిర్వాసితుల అంశం పై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. దానికి అనుగుణగానే ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తూర్పు గోదావరి ఏజన్సీలో పర్యటిస్తున్నారు. అదే సమయంలో కేసీఆర్ తీసుకున్న సానుకూల నిర్ణయం మూలంగా పోలవరం ఆశలు వీలయినంత త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రానికి జీవధారగా చెప్పుకునే పోలవరం కోసం సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న వారికి ఇది పెద్ద ఊరట కల్పించే విషయంగా చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి