iDreamPost

అసోసియేషన్ ఎన్నికలు – మాటల దాడులు

అసోసియేషన్ ఎన్నికలు – మాటల దాడులు

మా అసోసియేషన్ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ప్రచార రాజకీయం వేగమందుకుంటోంది. ఒకపక్క ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్లు, న్యూస్ ఛానల్స్ ఇంటర్వ్యూలతో ప్రత్యర్థి వర్గం మీద గట్టి కౌంటర్లు ఇస్తుండగా మరోవైపు మంచు విష్ణు నేనేం తక్కువ తినలేదనే రీతిలో బదులు చెబుతున్నాడు. నిన్న నటి జీవిత రాజశేఖర్ ప్రత్యేకంగా మీడియాని పిలిచి మరీ నరేష్, రాజీవ్ కనకాల మీద ఓ రేంజ్ లో ఫైర్ అవ్వడం కొత్త చర్చకు దారి తీసింది. గతంలో జరిగిన అవకతవకలు, శవాలతో ఫోటోలు తీసుకోవడం గురించి నరేష్ చేసిన కామెంట్ల మీద విరుచుకుపడ్డారు. తమ ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని గట్టిగానే నిలదీయడం వీడియోలో వైరల్ అయ్యింది.

దీనికన్నా ముందు ప్రకాష్ రాజ్ కూడా ఓ మీటింగ్ పెట్టి తనతో పాటు శ్రీకాంత్ లాంటి వాళ్ళతో ఘాటుగా స్పీచులు ఇప్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరినీ వదిలేది లేదని, మంచు కావాలా మంచి కావాలా అంటూ మరోసారి స్లోగన్ ని బయటికి తీశారు. తనకన్నా తెలుగు బాగా మాట్లాడే సత్తా లేనివాళ్లు స్థానికత గురించి ఎత్తిచూపే అర్హత లేదని చురకలు వేశారు. ఎలక్షన్ కు కేవలం అయిదు రోజులు మాత్రమే చేతిలో ఉన్న నేపథ్యంలో రెండు వర్గాల మధ్య మాటల దాడులు పెరుగుతున్నాయి. నువ్వు తప్పు చేశావంటే నువ్వు తప్పు చేశావని ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం వాళ్ళకేమో కానీ న్యూస్ ఛానల్స్ కు మాత్రం మంచి మసాలా అయ్యింది.

ఎంత వద్దని ఇద్దరూ చెబుతున్నా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చిరంజీవి లాంటి ఇండస్ట్రీ పెద్దల పేర్లు బయటికి తెస్తూనే ఉన్నారు. ఏపీ ప్రభుత్వానికి ఈ వ్యవహారం పట్ల ఎలాంటి ఆసక్తి ఉత్సాహం లేదని మంత్రి పేర్ని నాని ప్రకటించినప్పటికీ పోలింగ్ అయ్యేదాకా ఏదో ఒక రూపంలో ఈ రచ్చ కొనసాగుతూనే ఉంటుంది. మొదట్లో ప్రకాష్ గెలుపు సులువు అనుకున్నా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టైట్ కాంపిటీషన్ తప్పేలా కనిపించడం లేదు. ఓడినా గెలిచినా ఒకేలా సేవ చేస్తామని చెబుతున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు ఒకవేళ నిజంగా ఓటమి చవి చూస్తే ఆ మాట మీద ఉంటారో లేదో చూడాలి

Also Read : సీక్వెల్ సినిమాలకు నెగటివ్ శాపం – బ్రేక్ చేసేదెవరో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి