iDreamPost

తుది దశకు యూపీ పోరు.. మూడు రోజుల్లో తేలనున్న పార్టీల భవితవ్యం

తుది దశకు యూపీ పోరు.. మూడు రోజుల్లో తేలనున్న పార్టీల భవితవ్యం

దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ రోజు చివరిదైన ఏడో దశ పోలింగ్‌ మొదలైంది. ఈ దశలో 53 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 613 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ దశలో ప్రధాని మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ, మళ్లీ అధికారంలోకి రావాలని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లు ఈ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీ కూడా తన శక్తియుక్తులను కూడగట్టి పోరాడింది. ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ ఒక్కరే యూపీ ఎన్నికల బాధ్యతలను తన భుజస్కంధాలపై మోశారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలు ఈ ఎన్నికల్లో కనిపించలేదు. మరో ప్రధాన పార్టీ అయిన బహుజన సమాజ్‌వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. కానీ ఆ పార్టీ ఎక్కడా ఎన్నికల ప్రచారం నిర్వహించలేదు. కారణాలు ఏమైనా ఈ ఎన్నికల్లో బీఎస్పీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మాయావతి పోటీ చేయలేదు. అదే విధంగా తన పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారమూ చేయలేదు. ఉన్నా లేనట్లుగా బీఎస్పీ ఈ ఎన్నికల్లో వ్యవహరించింది.

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు మొత్తం ఏడుదశల్లో జరిగాయి. జనవరి 14వ తేదీన ఉత్తరప్రదేశ్‌తోపాటు పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. యూపీలో ఏడుదశల్లో ఎన్నికలు జరగ్గా.. పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌లలో ఒకే దశలో పోలింగ్‌ పూర్తయింది. మణిపూర్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. అంచనాలు, సర్వేలు ఎలా ఉన్నా.. ఈ నెల 10వ తేదీన పార్టీల భవితవ్యం తేలిపోనుంది. అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడికానున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ ఫలితాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో.. ఆ రాష్ట్ర ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి