iDreamPost

Tatineni Rama Rao: స్వర్గానికేగిన యమగోల సృష్టికర్త

Tatineni Rama Rao: స్వర్గానికేగిన యమగోల సృష్టికర్త

సీనియర్ దర్శకులు తాతినేని రామారావు (84) అనారోగ్యంతో కన్నుమూశారు. నిన్న అర్థరాత్రి దాటాక చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కోలుకోలేక చివరి శ్వాస తీసుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో దిగ్గజం అనదగ్గ ప్రస్థానం ఆయనది. తెలుగు హిందీ భాషల్లో సుమారుగా డెబ్భైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో అధిక శాతం సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్లే. రీమేకులతో బాలీవుడ్ లోనూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా 80, 90 దశకంలో తాతినేని రామారావు అనే పేరు కమర్షియల్ ఎంటర్ టైనర్స్ లో మారుమ్రోగిపోయింది. ఎన్టీఆర్ తో మొదలుపెట్టి బాలకృష్ణ దాకా అందరితో పని చేసిన అనుభవం ఉంది.

రామారావు గారు కృష్ణా జిల్లా కపిలేష్వరపురంలో 1938లో జన్మించారు. 1966లో అక్కినేని నాగేశ్వర రావు ‘నవరాత్రి’ ఆయన మొదటి సినిమా. అందులో ఏఎన్ఆర్ తో తొమ్మిది పాత్రలు చేయించడం అప్పట్లో పెద్ద సంచలనం. డెబ్యూ చేయడానికి ముందు 1950ల ప్రాంతంలో సమీప బంధువైన టి ప్రకాష్ రావుతో పాటు కోటయ్య ప్రత్యగాత్మ వద్ద సహాయకుడిగా పని చేశారు. తొలిచిత్రమే సూపర్ హిట్ కావడంతో తాతినేనికి అవకాశాలు ఆగలేదు. రెండోది కొంచెం గ్యాప్ తీసుకున్నా మళ్ళీ ఏఎన్ఆర్ తోనే ‘బ్రహ్మచారి’గా మరో సక్సెస్ అందుకున్నారు. ఇందులో తమిళనాడు సీఎం జయలలిత హీరోయిన్. ఎంటర్ టైన్మెంట్ తాతినేని ప్రధాన బలం.

తర్వాత మంచి మిత్రులు, రైతు కుటుంబం లాంటి మంచి ఆణిముత్యాలు చేశారు. ‘జీవన తరంగాలు’తో కుటుంబ ప్రేక్షకులను కన్నీళ్లతో కాసులు కురిపించేలా చేశారు. ఇక ఎన్టీఆర్ తో చేసిన ‘యమగోల’ సెన్సేషన్ అంతా ఇంతా కాదు. దీన్నే 1979లో ‘లోక్ పర్లోక్’ గా హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్లో అడుగు పెట్టారు. శ్రీరామరక్ష, పచ్చని కాపురం, న్యాయానికి శిక్ష లాంటి మంచి హిట్లు అందుకున్నారు. ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్ లో ‘అనురాగదేవత’ సూపర్ మ్యూజికల్ హిట్. బాలకృష్ణతో తల్లితండ్రులు, రాజేంద్రప్రసాద్ తో గోల్మాల్ గోవిందం ఆయన ఆఖరిగా చేసిన తెలుగు సినిమాలు. గొప్ప ప్రస్థానం కలిగిన తాతినేని రామారావుగారు భౌతికంగా లేకపోవడం పరిశ్రమకు లోటే.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి