iDreamPost

వెంకీమామ టూర్‌

వెంకీమామ టూర్‌

వెంకీమామ ఊళ్లోకి ఎంట‌ర్ అయ్యాను. పెద్ద జుట్టు, ర‌క‌ర‌కాల రుద్రాక్ష‌మాల‌లు మెడ‌లో ధ‌రించి నాజ‌ర్ ఎదుర‌య్యాడు.
“జాత‌కాలు, జ్యోతిష్యాలంటూ వెంకీమామ‌కి , నాగ‌చైత‌న్య‌కి అన‌వ‌స‌ర క‌ష్టాలు తెచ్చింది మీరే క‌దా” అన్నాను.
“నేను భ‌విష్య‌త్ తెలిసిన వాన్ని” అన్నాడు నాజ‌ర్ గంభీర స్వ‌రంతో.
“తెలిసిన‌ప్పుడు, అరేయ్ బాబూ , నీ వ‌ల్ల మీ మామ ప్రాణాల‌కి ప్ర‌మాదం అని ఒక మాట చెబితే- చైత‌న్య హాయిగా రాశీఖ‌న్నాతో లండ‌న్ వెళ్లిపోయేవాడు క‌దా. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు ఆగ‌డం ఎందుకు” అన్నాను.
“చెబితే సినిమా అయిపోతుంది క‌దా”
“చెప్ప‌క‌పోవ‌డం వ‌ల్ల ప్రేక్ష‌కులు అయిపోయారు క‌దా. మీకు తోడుగా ఆ ముసులోడు చారుహాస‌న్ ఒక‌డు. భ‌య‌పెట్టి చంపాడు క‌దా. అస‌లు మీరు ఏ కాలం వారు సార్?” అని అడిగాను.
“మూర్కుడా?” అని అరిచాడు.
“మూర్కుడు కాబ‌ట్టే రూ.200 ఇచ్చి టికెట్ కొని చూశాను” అన్నాను.
నాజ‌ర్ కోపంగా వెళ్లిపోయాడు.
“ఆ ముసులోడికి మెంట‌ల్ అయ్యా” అని ఎమ్మెల్యే రావు ర‌మేష్ వ‌చ్చాడు.
“మీరేంటి ఎమ్మెల్యేగా గెలిచిపోయారా?” అని అడిగాను.
“నా అదృష్టం కొద్దీ ఈ ముస‌లి నాజ‌ర్ ఏదో జాతకం ఫిటింగ్ పెడితే చైత‌న్య‌కి ఎటు పోవాలో తెలియ‌క మిల్ట‌రీకి వెళ్లిపోయాడు. వాన్ని వెతుక్కుంటూ వెంక‌టేష్ వెళ్లాడు. అడ్డు లేక‌పోవ‌డంతో గెలిచిపోయాను. దీన్నేఇంగ్లీష్‌లో Turning point అంటారు”.
“బీరుల ఫ్యాక్ట‌రీ ఏమైంది? “
“ఇంకేం ఫ్యాక్ట‌రీ! జ‌గ‌న్ వ‌చ్చి మందుబాబుల‌కు సినిమా చూపిస్తున్నాడు. అందుకే చెంబుల ఫ్యాక్ట‌రీ పెడ‌దామ‌నుకుంటున్నా. దీన్నే ఇంగ్లీష్‌లో Fate అంటారు. అదే ఆ డైరెక్ట‌ర్ బాబీ, నేను మ‌రుగుదొడ్ల నిధుల్ని తినేశాన‌ని చూపించాడు క‌దా. థూ, దీన్నే ఇంగ్లీష్‌లో Worst Allegation అంటారు. పోల‌వ‌రం నిధులు తిన్నానంటే అర్థం ఉంది, కొల్లేరుని రొయ్య‌ల చెరువుగా మార్చానంటే అర్థ‌ముంది. థూ, మ‌రుగుదొడ్లు నిధులేంటిరా బాబూ, డైలాగ్ పేప‌ర్లు చ‌ద‌వ‌డం త‌ప్ప‌, న్యూస్ పేప‌ర్ చ‌ద‌వ‌మంటే ఒక్క‌డూ చ‌ద‌వ‌డు. వ‌దిలేయ‌కండి, ఎవ‌రైనా చూపించండి. దీన్నే ఇంగ్లీష్‌లో Ignorance అంటారు” అని రావు ర‌మేష్ వెళ్లిపోయాడు.
ఇంత‌లో మిల్ట‌రీనాయుడు (వెంక‌టేష్) బుల్లెట్ మీద వ‌చ్చాడు.
“సార్ , మీ మీద నంద‌న్‌నీలేక‌ని కేసు వేస్తానంటున్నాడు” అన్నాను.
“ఆయ‌నెవ‌రు?” అడిగాడు వెంక‌టేష్‌.
“ఆధార్‌కార్డు క‌నిపెట్టిన వ్య‌క్తి”
“నాకు ఆధార్‌కార్డుకు ఏంటి సంబంధం?”
“సంబంధం ఉంది. ఈ దేశంలో ప్ర‌తి ఒక్క‌రికీ ఆధార్‌కార్డుతో సంబంధం ఉంది. ఆధార్ లేకుండా చైత‌న్య‌ని ఆర్మీలో చేర్చుకోరు. దాని ఆధారంగా కంటోన్మెంట్ బోర్డులో ఎంక్వైరీ చేయ‌కుండా నేరుగా బార్డ‌ర్‌లోకి వెళ్లిపోవ‌డ‌మేనా?”
“అంటే ఎమోష‌న్ పండుతుంద‌ని”
“ఏంటి పండేది, పండ‌డానికి అదేమైనా కాశ్మీర్ యాపిలా, ఆర్మీ క్యాంప్‌. ఆ ఆర్మీ వాళ్ల‌కి తెలుగు సినిమాలు చూసి మైండ్ పోయింది కానీ, లేక‌పోతే మిమ్మ‌ల్ని కూచోపెట్టి మీ క‌థంతా చూపిస్తారా? మీకు, చైత‌న్య‌ల మ‌ధ్య క‌థ చెప్ప‌మంటే ప‌నిలో ప‌నిగా ప్లాష్ బ్యాక్‌లో ఇంకో ప్లాష్ బ్యాక్ చైత‌న్య ల‌వ్‌స్టోరీ, మీకు పాయిల్‌రాజ్‌పుత్‌కి మ‌ధ్య రెండ‌ర్థాల డైలాగ్‌లు ఇవ‌న్నీ చెబుతారా?”
“మామా అల్లుళ్ల రిలేష‌న్ అంటే అన్ని వినాలి మ‌రి” అని వెంక‌టేష్ వెళ్లిపోయాడు. చైత‌న్య క‌నిపించాడు. రాశీఖ‌న్నాతో షికారు వెళుతున్నాడు.
“చైత‌న్య‌బాబూ, ఆర్మీకి వెళ్లావ్‌, స‌రే వాళ్లేదో పెద్ద మ‌న‌సుతో స‌ర్జిక‌ల్ స్ర్టైక్‌కి పంపించావ్‌. ఆప‌రేష‌న్ ముగిసింది. హెలికాప్ట‌ర్ ఎక్క‌రా బాబూ అని బ‌తిమ‌లాడినా ఎక్క‌కుండా, మ‌ళ్లీ నిన్ను కాపాడ‌డానికి వెంక‌టేష్‌ని ర‌ప్పించావ్ క‌దా. ఇదంతా అవ‌స‌ర‌మా? “
“అల్లున్ని కాపాడ‌డానికి మామ వ‌స్తేనే సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయ్యేది”
రాశీఖ‌న్నా కెమెరాతో ఏదో షూట్ చేయ‌బోతే “అమ్మా నువ్వు తీసేదాన్ని డాక్యుమంట‌రీ అన‌రు, “యాక్‌”మెంట‌రీ అన్నాను”
పాయ‌ల్ వ‌చ్చి “నాకీ సినిమా అచ్చా న‌చ్చింది. బ‌హుత్ ఖుచ్” అని డ‌బ్బింగ్ హిందీ మాట్లాడింది.
చివ‌ర్నా ప్ర‌కాశ్‌రాజ్ క‌నిపించాడు. అత‌ని ష‌ర్ట్‌కు ఉన్న మెడ‌ల్స్ పీకి పారేశాను.
“నువ్వు బ్రిగేడియ‌ర్ కాదు, జ‌డ్ గ్రేడియ‌ర్‌. అస‌లా ఉద్యోగం ఇచ్చింది ఎవ‌రు నీకు. దారిన పోయే వానికి టెర్ర‌రిస్ట్ ముసుగేసి, ల‌ష్క‌ర్ తోయిబా ద‌గ్గ‌రికి తీసుకెళ్తావా. మ‌న ఆర్మీ గురించి జ‌నం ఏమ‌నుకుంటారు” అని నిల‌దీశాను.
“క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో ఇవ‌న్నీ ఎవ‌రూ అడ‌గ‌రు బాస్” అన్నాడు.
“దీన్నే ఇంగ్లీష్‌లో Madness అంటారు” అని రావు ర‌మేష్ వ‌చ్చాడు.
ఉలిక్కిప‌డి లేచాను. వెంకీమామ క‌ల‌లోకి కూడా వ‌స్తున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి