iDreamPost

Vamsanikokkadu : ఫ్యామిలీ ప్లస్ మాస్ కాంబినేషన్

Vamsanikokkadu : ఫ్యామిలీ ప్లస్ మాస్ కాంబినేషన్

1995. ఎన్టీఆర్ నటవారసుడిగా బాలకృష్ణ మంచి పీక్స్ ని చూస్తున్నారు. ఒకపక్క లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్ లాంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ తో మాస్ ని ఆకట్టుకుంటూనే ‘ఆదిత్య 369’ లాంటి ప్రయోగాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. అంతకు ముందు ఏడాది శంకర్ ప్రభుదేవా కాంబినేషన్ లో వచ్చిన ‘ప్రేమికుడు’ సౌత్ మొత్తాన్ని సంచలనంతో ఊపుతుంటే అదే రోజు రిలీజైన ‘బొబ్బిలి సింహం’తో మంచి విజయం అందుకోవడం బాలయ్యకే చెల్లింది. అయితే మధ్యలో ‘గాండీవం’ టైపు డిజాస్టర్లు ‘టాప్ హీరో’ లాంటి స్పీడ్ బ్రేకర్లు లేకపోలేదు. ఎన్ని ఎక్స్ పరిమెంట్లు చేసినా మాస్ ని నిర్లక్ష్యం చేయకూడదనేది నాన్న నుంచి నేర్చుకున్న సూత్రం.

అప్పుడు చేసిన మూవీనే ‘వంశానికొక్కడు’. దర్శకుడు శరత్ కు కుటుంబ కథా చిత్రాలు తీస్తారని మంచి పేరున్న సమయమది. సుమన్, రాజేంద్రప్రసాద్ లాంటి హీరోలతో తక్కువ బడ్జెట్ లో ఎక్కువ సక్సెస్ లు ఇచ్చిన డైరెక్టర్ గా నిర్మాతల్లో, ప్రేక్షకుల్లో సదాభిప్రాయం తెచ్చుకున్నారు. ఆ టైంలో పరుచూరి బ్రదర్స్ చెప్పిన కథ ఒకటి బాలయ్యకు బాగా నచ్చింది. ఆదిత్య 369 ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ కు మరో కమిట్ మెంట్ పెండింగ్ ఉంది కాబట్టి ఇది చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. శరత్ అయితే బాగా డీల్ చేస్తారని ఆ బాధ్యతను ఆయనకే అప్పగించారు. అంతపెద్ద స్టార్ హీరోని డీల్ చేయడం అంటే మాటలు కాదుగా.

రాజ్ తో విడిపోయాక సంగీత దర్శకుడు కోటి దూసుకెళ్తున్నారు. ఈ ప్రాజెక్టు ఆయన చేతికే వెళ్ళింది. అదిరిపోయే ఆల్బమ్ సిద్ధం చేశారు. విఎస్ఆర్ స్వామి ఛాయాగ్రహణం అందించారు. రమ్యకృష్ణ, ఆమని హీరోయిన్లుగా ఎంపికయ్యారు. జాలీగా జీవితం గడిపే యువకుడు తన తండ్రి దుర్మార్గం వల్ల అమాయకుడైన అబ్బాయి చావుకు కారణమవుతాడు. ప్రాయశ్చిత్తంగా వాళ్ళ ఇంటికే దత్తత వెళ్తాడు. తర్వాత స్వంత సంస్థ అన్యాయంపై తిరగబడతాడు. ఇది కథలో మెయిన్ పాయింట్. 1996 జనవరి 5న విడుదలైన ‘వంశానికొక్కడు’ సూపర్ హిట్ కొట్టింది. అదే రోజు రిలీజైన నాగార్జున ‘వజ్రం’ ఫ్లాప్ అయ్యింది. అయితే 12న వచ్చిన ‘పెళ్లి సందడి’ ఊహించని రీతిలో ఫ్యామిలీ ఆడియన్స్ ని లాగేసుకుని బాలయ్య మూవీ మీద ప్రభావం చూపించిన మాట వాస్తవం

Also Read : Happy Birthday Ram Charan : మెగా పవర్ స్టార్ కెరీర్ గ్రాఫ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి