iDreamPost

భారతీయ వైద్యురాలి సేవలకు అమెరికా ఫిదా..

భారతీయ వైద్యురాలి సేవలకు అమెరికా ఫిదా..

అమెరికాలో పనిచేస్తున్న భారతీయ వైద్యురాలికి అరుదైన గౌరవం దక్కింది. కరోనా బాధితులకు ఆమె చేస్తున్న సేవలకుగాను ఆమె నివసిస్తున్న ఇంటిముందు నుండి అధికారులు ప్రభుత్వ వాహనాలతో ప‌రేడ్‌ నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే అమెరికాలో కరోనా వైరస్ సృష్టించిన మరణ విలయం అంతా ఇంతా కాదు..ఇప్పటికే అమెరికాలో కోవిడ్ 19 కారణంగా సుమారు  7,98,742 మంది కరోనా వైరస్ బారిన పడగా, 42,604 మంది మృత్యువాత పడ్డారు. అమెరికాలో సంభవించిన మరణాల కారణంగా మృతదేహాలు ఖననం చేయడానికి స్మశాన వాటికల్లో స్థలం కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. కరోనా బాధితులను రక్షించడానికి డాక్టర్లు రేయింబవళ్లు నిద్రాహారాలు మానుకుని మరీ పని చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి కరోనా బారి నుండి రోగులను కాపాడడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్ల సేవలు అభినందనీయం.

కరోనా బారిన పడిన రోగుల ప్రాణాలను కాపాడడానికి ఎనలేని కృషి చేస్తున్న డాక్టర్ల సేవలను గుర్తించి వారికి అభినందనలు తెలపడం వల్ల వారు మరింత ఉత్సాహంగా సేవలు చేసే అవకాశం ఉంది. తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కరోనా విధుల్లో పాల్గొంటూ రోగులకు సేవలు చేస్తున్న భారతీయ వైద్యురాలికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కడం ఆనందం కలిగించే విషయం..

భార‌త్‌లోని మైసూర్‌కు చెందిన ఉమా మ‌ధుసూద‌న అనే వైద్యురాలు సౌత్ విన్స‌డ‌ర్ ఆస్ప‌త్రిలో ప‌నిచేస్తున్నారు. అమెరికాలో కరోనా వ్యాధి తీవ్రంగా ప్రబలడంతో కరోనా విధుల్లో పాల్గొని నిరంతరం రోగులకు సేవలను అందిస్తున్నారు. ఆమె తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా, విసుగు చెందకుండా విధుల్లో చూపిన సేవా నిరతిని ప్రశంసిస్తూ ఆమె ఇంటి ముందు నుండి ప్రభుత్వ వాహనాలతో పరేడ్ నిర్వహించారు. ప్రభుత్వ వాహనాలు హారన్ వేస్తూ పరేడ్ నిర్వహిస్తున్న సమయంలో చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నవారు బయటకి వచ్చి చప్పట్లు కొడుతూ ఉమా మధుసూదనని ప్రశంసించారు.

అమెరికాలో కాబట్టి వైద్యుల సేవలను గుర్తించి తమ దేశానికి చెందని వారిని కూడా ప్రశంసిస్తుంటే మనదేశంలో మాత్రం సహాయం చేయడానికి వచ్చిన వైద్యులపై కొందరు మాత్రం దాడులు చేస్తూ వైద్యుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్యులు చేస్తున్న కృషిని మరిచి లేనిపోని అనుమానాలు మనసులో పెట్టుకుని కొందరు అల్లరిమూకలు మతిస్థిమితం లేనివారిలా ప్రవర్తిస్తూ వైద్యులపై దాడులకు తెగబడుతున్నారు. ఇలా వైద్యులపై దాడులకు తెగబడే వారిని గుర్తించి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. ఏది ఏమైనా అమెరికాలో భారతీయ వైద్యురాలికి అరుదైన గౌరవం దక్కడం ఆనందించాల్సిన విషయం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి