iDreamPost

చైనా ల్యాబ్ పై అమెరికా నిఘా .. ఎక్కడికి దారితీస్తుందో ?

చైనా ల్యాబ్ పై అమెరికా నిఘా .. ఎక్కడికి దారితీస్తుందో ?

ప్రపంచం మొత్తాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ పుట్టినిల్లయిన చైనాలోని వూహాన్ ల్యాబ్ పై అమెరికా నిఘా మొదలుపెట్టింది. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది రోజులుగా మండిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. వైరస్ విషయాన్ని సకాలంలో చైనా ప్రపంచదేశాలకు తెలియచేయలేదన్నది ట్రంప్ వాదన. సరే ఈ వివాదం అనేక మలుపులు తిరిగి చివరకు వూహాన్ లోని వైరాలజీ ల్యాబ్ పై అగ్రరాజ్యం నిఘా పెట్టేంత వరకూ వెళ్ళిపోయింది పరిస్దితులు.

వూహాన్ లోని ల్యాబ్ లో అసలు ఎటువంటి పరీశోధనలు చేస్తున్నారు ? గబ్బిలాల నుండే వైరస్ సోకిందనేందుకు ఆధారాలేమిటి ? చైనా వాదనలో నిజమెంతుంది అనే విషయాలపై ఇప్పటికే అనేక అనుమానాలున్నాయి. ఈ విషయాలపై ఫాక్స్ న్యూస్ చానెల్ పరిశోధన జరిపి గబ్బిలాల వల్లే వైరస్ సోకిందనేందుకు ఆధారాలు లేవని తేల్చేసింది. అలాగే వైరస్ వ్యాప్తి చేసిందని చైనా చెబుతున్న గబ్బిలాలు వూహాన్ సిటిలో అసలు లేనే లేవని కూడా ఫాక్స్ ప్రకటించటంతో సంచలనం మొదలైంది.

చైనా చెబుతున్న గబ్బిలాలు వూహాన్ సిటికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయన్న విషయాన్ని కూడా ఫాక్స్ చానెల్ బయటపెట్టింది. 70 కిలోమీటర్ల దూరంలోని గబ్బిలాల నుండి వూహాన్ లో వైరస్ ఎలా సోకుతుందన్న చానెల్ ప్రశ్ననే ట్రంప్ కూడా బలంగా వినిపిస్తున్నారు. ఏదేమైనా చైనాలోని ఓ వైరాలజీ ల్యాబ్ లో జరిగే పరిశోధనలపై అగ్రరాజ్యం నిఘా పెట్టటం అన్నది మామూలు విషయం కాదు.

ఎందుకంటే అమెరికా చర్యలకు చైనా ప్రభుత్వం ఏమాత్రం అంగీకరించే అవకాశం లేదనే చెప్పాలి. దానికితోడు వైరాలజీ ల్యాబ్ కు గతంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మంజూరు చేసిన 3.7 మిలియన్ డాలర్ల గ్రాంట్ ను కూడా నిలిపేస్తున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటనపై చైనా ప్రభుత్వం సీరియస్ అయ్యింది. మరి ఈ తాజా వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి