iDreamPost

అండర్ – 19 ప్రపంచ కప్పు ఫైనల్లో భారత్ ను ఢీ కొట్టబోతున్న బంగ్లా

అండర్ – 19 ప్రపంచ కప్పు ఫైనల్లో భారత్ ను ఢీ కొట్టబోతున్న బంగ్లా

దక్షిణాఫ్రికాలో పొచెస్‌ట్రూమ్‌ వేదికపై అండర్‌-19 ప్రపంచకప్‌ రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది.ఆదివారం ప్రపంచ కప్ టైటిల్ కోసం జరిగే ఫైనల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ భారత్‌ యువ జట్టుతో బంగ్లా యువ జట్టు తలపడనుంది.

సెమీ ఫైనల్లో 212 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా ఓపెనర్లు త్వరగా అవుట్ అయినప్పటికీ మూడవ స్థానంలో బ్యాటింగ్ చేసిన మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌ (127 బంతుల్లో 100; 13×4) సరిగ్గా సెంచరీ సాధించి అవుటయ్యాడు.హసన్‌ మూడో వికెట్ కు తౌహిద్‌ హృదోయ్ (47 బంతుల్లో40;4×4)తో కలిసి 68 పరుగుల భాగస్వామ్యాన్ని,షహదత్‌ హుస్సేన్ (51 బంతుల్లో40 నాటౌట్‌; 4×4) సహకారముతో నాలుగో వికెట్ కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి జట్టును విజయపథంలో నడిపాడు.

అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.కివీస్‌ ఓపెనర్లు శుభారంభం ఇవ్వకపోవడంతో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్లు బెఖమ్‌ వీలర్‌(83 బంతుల్లో 75;5×4, 2×6),నికోలస్‌ లిడ్‌స్టోన్‌(74 బంతుల్లో 44;2×4) రాణించడంతో 200 పరుగుల మైలురాయిని దాటింది.బంగ్లా బౌలర్లలో షోరిఫుల్‌ ఇస్లామ్‌(3), షమిమ్‌ హుస్సేన్(2), హసన్‌ మురద్‌(2) వికెట్లు పడగొట్టి కివీస్‌ బ్యాట్స్‌మన్‌లను కట్టడి చేశారు. 

ఇప్పటివరకు భారత్ అండర్-19 వరల్డ్ కప్ లో ఆరు సార్లు ఫైనల్ మ్యాచ్ ఆడి నాలుగుసార్లు విజేతగా,రెండు సార్లు రన్నరప్ గా నిలిచింది. భారత ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్ ను దృష్టిలో పెట్టుకుంటే ఏడోసారి ఫైనల్లో ఆడుతున్న భారత్ ఐదోసారి ప్రపంచ కప్పును అందుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.ప్రస్తుత ప్రపంచ కప్పు టోర్నీ కలుపుకొని అండర్ -19 వరల్డ్ కప్ టోర్నీలు 13 జరిగినప్పటికీ భారతదేశంలో ఒక్క టోర్నీ కూడా నిర్వహించకపోవడం కొసమెరుపు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి