iDreamPost

అమిత్‌ షా రాహుల్‌ మధ్య ట్విటర్‌ వార్‌

అమిత్‌ షా రాహుల్‌ మధ్య ట్విటర్‌ వార్‌

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వార్ నడుస్తుంది. ఇండియా-చైనా సరిహద్దు గాల్వన్ లోయలో జరిగిన ఘటన నేపథ్యంలో వారిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా వాగ్వాదానికి దిగారు.

భారత భూభాగాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనాకు అప్పగించారంటూ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, ఎంపి రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఘాటుగా స్పందించారు. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొన్న వేళ రాహుల్‌ వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ రాజకీయాలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు అవసరమా అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్‌పై ట్విటర్‌ వేదికగా అమిత్‌ షా ఫైర్‌ అయ్యారు.

కాగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర చేసిన ప్రకటనపై రాహుల్‌ ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. చైనా దురాక్రమణకు ప్రధాని మోడీ లొంగిపోయారంటూ ధ్వజమెత్తారు. తాజా అంశంపై ఇరు నేతల మధ్య ట్విటర్‌ వేదికగా మాటల యుద్ధం సాగుతోంది. దీనికి తోడు ఇరు పార్టీల అభిమానులు, కార్యకర్తలు సైతం కామెంట్లు చేస్తూ ప్రతి విమర్శలకు దిగుతున్నారు.

ల‌ద్ధాఖ్‌లోని గాల్వ‌న్ లోయ ప్రాంతంపై స‌ర్వ అధికారాలు త‌మ‌కే చెందుతాయ‌న్న చైనా ప్ర‌క‌ట‌న‌పై కేంద్రం స్పందించాల‌ని శివ‌సేన ఉపాధ్య‌క్షురాలు, ఎంపి ప్రియాంక చ‌తుర్వేది డిమాండ్ చేశారు. ‘‘మ‌న భూభాగంలోకి ఎవ‌రూ రాలేద‌ని మోడీ దేశానికి హామీ ఇచ్చారు. కానీ గాల్వ‌న్ లోయ‌ త‌మ‌దిగా చైనా చెప్పుకుంటోంది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై ప్ర‌భుత్వం స్పందించాల్సిన అవ‌స‌రం ఉంది. మాకు కొన్ని అనుమానాలున్నాయి. గాల్వ‌న్‌ లోయను మనం విడిచిపెట్టామా లేదా అక్కడి నుంచి చైనా సైన్యాన్ని వెళ్లగొట్టారా?  దేశ ప్ర‌జ‌లంద‌రూ తెలుసుకోవాల‌నుకుంటున్నారు’’ అంటూ చ‌తుర్వేది ట్వీట్ చేశారు.

అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం ధ్వజమెత్తారు. భారత సరిహద్దుల్లోకి ఎవ్వరూ చొరబడలేదన్న మోడీ వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. ‘మోడీ వ్యాఖ్యలు ఇంతకముదు ఆర్మీ చీఫ్, రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులు చేసిన ప్రకటనలకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రధాని వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ కలవరపరిచాయి. మే 5,6న  చైనా బలగాలు మన భూభాగంలోకి ప్రవేశించకపోతే, మన సైనికులు ఎక్కడ గాయపడ్డారు, ఎందుకు అమరులయ్యారు’’ అని ప్రశ్నించారు. 

కాగా భారత భూభాగంలో ఎవరూ ప్రవేశించలేదని శుక్రవారం ప్రధానమంత్రి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ నెల 16న గాల్వన్‌ లోయలో చైనా-భారత్‌ బలగాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఇక  ఇదే విషయంపై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ కూడా ప్రధాని వ్యాఖ్యలపై ప్రశ్నలు సంధించారు. చైనా దురాక్రమణకు తలొగ్గిన ప్రధాన భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారని ఆరోపించారు. ఒకవేళ ఆ భూభాగం చైనా వారిది అయితే భారత జవాన్లు ఎందుకు మరణించారని ప్రధానిని ప్రశ్నించారు. దీనికి కేంద్ర హోం మంత్రి కౌంటర్ ఇచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి