iDreamPost

కమలం గూటికి క్యూ కట్టనున్న నేతలు

కమలం గూటికి క్యూ కట్టనున్న నేతలు

గ్రేటర్ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని కైవసం చేసుకున్న బీజేపీ మరింత బలం పుంజుకునే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అధికార పార్టీని ఢీకొనలేక నిస్తేజంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ క్యాడర్ కు, టీఆర్ఎస్ లో పదవులు దక్కక నిరాశలో ఉన్న నేతలకూ కాషాయ పార్టీ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. సమీప భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నేతలు సైతం తమ రాజకీయ భవిష్యత్తును బీజేపీలోనే వెతుక్కుంటున్నారు.

దుబ్బాక విజయం తరువాత దూకుడు పెంచిన కాషాయ పార్టీలో గ్రేటర్ ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలను సైతం కొల్లగొట్టి సత్తాచాటుకున్న బీజేపీ అధికార పార్టీని మేయర్ పీఠానికి చేరువకానివ్వలేదు. 48 కార్పోరేటర్ స్థానాలను కైవసం చేసుకొని సెకండ్ పొజిషన్ లో నిలబడిన బీజేపీ టీఆర్ఎస్ కంటే కూడా అత్యధిక ఓట్లను రాబట్టుకోగలిగింది. 30.79 శాతం ఓట్లను అధికార పార్టీ సొంతం చేసుకుంటే, 31.43శాతం ఓట్లను బీజేపీ సొంతం చేసుకుంది. సంఖ్య రీత్యా బీజేపీ మెజార్టీ సాధించలేకపోయినా ప్రజల మద్దతు తమకే ఉందనే వాదనను బలంగా వినిపిస్తోంది.

త్వరలో హైదరాబాద్‌-రంగారెడ్డి- ఉమ్మడి మహబూబ్‌నగర్‌; నల్గొండ-వరంగల్‌- ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్ ఎన్నికలకు సైతం సైరన్ మోగనుంది. ప్రస్థుతం టీఆర్ఎస్ గుప్పటిన ఉన్న ఈ రెండు కార్పోరేషన్లలో బీజేపీ పాగావేయాలనుకుంటోంది. ఇటీవల మృతి చెందిన నోముల నర్సింహ్మయ్య ప్రతినిథ్యం వహించిన నాగార్జున్ సాగర్ నియోజకవర్గంలోనూ ఉప ఎన్నిక జరగనుంది. వరుసగా జరుగనున్న ఈ ఎన్నికల్లో బీజేపీ అధికార టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలనుకుంటోంది. అందుకోసం ఇప్పటినుంచే వ్యూహ రచన చేస్తోంది. మరోవైపు… బీజేపీ దూకుడు ఇతర పార్టీల నేతలను ఆకర్షిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండడంతో పాటు, రాష్ట్రంలోనూ బలమైన శక్తిగా పరిణామం చెందుతుండడంతో ప్రత్యర్థి పార్టీ్ల్లో నైరాశ్యంలో ఉన్న నేతలంతా కమలం గూటికి చేరాలనుకుంటున్నారు.

రాష్ట్రంలో బీజేపీ రెండో స్థానానికి చేరుకోవడంతో ప్రధాన ప్రతిపక్షం నామమాత్రంగా మిగిలింది. వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ కు వైఫల్యాలు తప్పడం లేదు. దీంతో పార్టీ నేతల్ని నైరాశ్యం ఆవరించింది. బీజేపీ దూకుడు చూస్తుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కూడా కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా నిలిచే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ నేతల చూపు బీజేపీ వైపు మళ్లుతోంది. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత డీకే అరుణ కాషాయ కండువా కప్పుకొని బీజేలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ మేయర్ గా పనిచేసిన బండా కార్తీక సైతం బీజేపీ గూటికే చేరారు. మరోవైపు… టీఆర్ఎస్ నుంచి కూడా బీజేపీలోకి వలసలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. తాజాగా స్వామిగౌడ్ చేరిక అందుకో సంకేతంగా చెప్పుకోవచ్చు.

వరుస వైఫల్యాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం దాపురించింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సైతం రేపో మాపో కమలం గూటికి చేరుతారనే ఊహాగానాలు చెక్కర్లు చెక్కర్లు కొడుతున్నారు. గ్రేటర్ ఫలితాల నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్ బీజేపీకి అనుకూలంగా చేసిన ట్వీట్ ఆయన త్వరలో కాషాయ కండువా కప్పుకుంటారనే వాదనకు బలానిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ హోంమత్రి జానా రెడ్డి సైతం బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. త్వరలో జరగబోయే నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డిని బీజేపీ బరిలోకి దింపాలనుకుంటోంది. ఆ దిశలో ఇప్పటికే జానారెడ్డితో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ తరుపున పోటీ చేసినా గెలిచే అవకాశాలు లేకపోవడంతో జానారెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం వైపే మొగ్గుచూపారని తెలుస్తోంది. ఇక ఆయన ఢిల్లీ పెద్దల సమక్షంలో కండువా మార్చుకోవడమే మిగిలిందంటున్నారు. మొత్తానికి గ్రేటర్ ఫలితాలు బీజేపీ స్పీడ్ ను మరింత పెంచేలా కనిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి