iDreamPost

మంత్రిని చేస్తానని చెప్పి.. ఇప్పుడు కనీసం టికెట్‌ కూడా ఇవ్వలేదు.. రేవంత్‌పై ఆగ్రహం

  • Published Oct 28, 2023 | 3:48 PMUpdated Oct 28, 2023 | 3:48 PM

కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన రెండో విడత అభ్యర్థుల జాబితాపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మరీ ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మీద ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారు. ఆ వివరాలు.

కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన రెండో విడత అభ్యర్థుల జాబితాపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మరీ ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మీద ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారు. ఆ వివరాలు.

  • Published Oct 28, 2023 | 3:48 PMUpdated Oct 28, 2023 | 3:48 PM
మంత్రిని చేస్తానని చెప్పి.. ఇప్పుడు కనీసం టికెట్‌ కూడా ఇవ్వలేదు.. రేవంత్‌పై ఆగ్రహం

తెలంగాణలో రాజకీయ వాతావరణం హీటెక్కుతుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది పార్టీలన్ని స్పీడ్‌ పెంచాయి. అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూనే.. ప్రచార కార్యక్రమాలను కూడా ప్రారంభించాయి. ఎన్నికల్లో కారు పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్‌ తీవ్రంగా కృషి చేస్తుంది. ఇప్పటికే అభ్యర్థుల తొలి విడత జాబితా విడుదల చేసిన కాంగ్రెస్‌.. రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. 45 మందితో లిస్టును ప్రకటించింది.

ఈ జాబితా పాత, కొత్త నేతల కలయికగా ఉంది. అంతేకాక ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన దాదాపు 15 మందికి టికెట్లు కేటాయించారు. దీనిలో భాగంగానే గురువారం రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి.. శుక్రవారం ప్రకటించిన లిస్టులో మునుగోడు టికెట్‌ను కేటాయించారు. అంటే రాజగోపాల్‌ రెడ్డి పార్టీలో జాయిన్ అయిన 24 గంటల్లోపే కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. మునుగోడు టికెట్‌ నీకే అన్న హామీతోనే రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. అన్నట్లుగానే ఆయనకు టికెట్‌ ఇచ్చారు.

పాల్వాయి స్రవంతికి మొండిచేయి..

అయితే రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మారిన తర్వాత మునుగోడులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. అయితే మునుగోడు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రేవంత్‌ రెడ్డి.. రానున్న ఎన్నికల్లో మహిళలకు 15 స్థానాలు కేటాయిస్తామని.. అందులో నలుగురికి మంత్రి పదవులు ఇస్తామని చెప్పారు. ఆ నలుగురులో తన సోదరి పాల్వాయి స్రవంతి పేరు కూడా ఉంటుందని.. ఆమెకు కూడా మంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు. ఆమెను గెలిపించాలని అక్కడి ఓటర్లను కోరారు రేవంత్‌ రెడ్డి.

కానీ తీరా ఇప్పుడు చూస్తే.. మునుగోడు టికెట్‌ రాజగోపాల్‌రెడ్డికి కేటాయించారు. దీనిపై పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పాల్వాయి స్రవంతికి మంత్రి పదవి ఇస్తానన్న రేవంత్‌.. ఇప్పుడు కనీసం ఎమ్మెల్యే టికెట్‌ కూడా ఇవ్వలేదని.. ఆమెని నమ్మించి నట్టేట ముంచాడని విమర్శిస్తున్నారు. అంతేకాక గతంలో రేవంత్ మంత్రి పదవి ఆఫర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మునుగోడు టికెట్‌ను రాజగోపాల్ రెడ్డికి కేటాయించటంపై అసమ్మతి వ్యక్తమవుతుంది. మునుగోడు టికెట్‌ ఆశిస్తోన్న చలమల కృష్ణారెడ్డి శనివారం తన అనుచరులతో భేటీ అవుతున్నారు. వారితో చర్చించి తదుపరి కార్యచరణ ప్రకటిస్తానని తెలిపారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీకి ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. కృష్ణారెడ్డి బాటలోనే స్రవంతి కూడా ఉన్నట్లు సమాచారం. మరి ఈ అసంతృప్త నేతలను కాంగ్రెస్‌ అధిష్టానం ఎలా బుజ్జగిస్తుందో చూడాలి అంటున్నారు రాజకీయ పండితులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి