iDreamPost

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు బీజేపీ ఆశలపై నీళ్లు జల్లేశాయా

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు బీజేపీ ఆశలపై నీళ్లు జల్లేశాయా

తెలంగాణాలో బీజేపీ దూకుడుకి అనూహ్యంగా అడ్డుకట్ట పడినట్టు కనిపిస్తోంది. కేసీఆర్ రాజకీయ చాణుక్యం బీజేపీకి బ్రేకులు వేస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ బీజేపీ ఓటమి కమలదళంలో కొంత కలవరం పుట్టిస్తోంది. విద్యావంతులు, అందులోనూ అత్యధికంగా పట్టణ ప్రాంతీయులు ఓట్లేసిన చోట బీజేపీకి ఎదురుదెబ్బ తగిలినట్టుగా భావిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పూర్తిగా బలపడతామని ఆశిస్తే ప్రస్తుతం ఫలితాలు కొంత నిరాశపరిచినట్టుగా చెబుతున్నారు. వరుసగా దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఫలితాలతో జోష్ నిండిన సమయంలో రెండు చోట్లా ఓటమి కారణంగా రాబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు.

రెండు ఎమ్మెల్సీ సీట్లు గెలిచిన తర్వాత టీఆర్ఎస్ లోని చాలామంది నేతలు తమవైపు వస్తారని బీజేపీ ఆశించింది. తద్వారా తాము బలపడడమే కాకుండా, అధికార పార్టీని నైరాశ్యంలోకి నెట్టవచ్చని ఆశించారు. ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ అడుగు ముందుకేసి మండలి ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొడతామని కూడా ప్రకటించారు. తీరా ఫలితాలు చూస్తే బీజేపీకి మండలిలో ఉన్న ఒక్క సీటు కూడా కోల్పోవాల్సి వచ్చింది. శాసనమండలిలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం కోల్పోవడంతో బీజేపీ ఆశలు అడియశలయినట్టుగా కనిపిస్తోంది. ఫలితాల తర్వాత బీజేపీ శ్రేణుల్లో కనిపిస్తున్న నైరాశ్యం దానికి నిదర్శనంగా చెబుతున్నారు.

నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానంలో బీజేపీ అభ్యర్థి నాలుగో స్థానంలో నిలిచారు. నేరుగా పార్టీ రాష్ట్ర నేతలంతా పర్యటనలు చేసి, పెద్ద స్థాయిలో సోషల్ మీడియా ప్రచారంతో హోరెత్తించినా ఫలితం రాకపోవడంతో బీజేపీ దూకుడుకి పెద్ద అవరోధంగా మారుతోంది. కొత్త నేతల వలసలకు అడ్డుకట్ట పడినట్టేనని లెక్కలేస్తున్నారు. ముఖ్యంగా మండలి ఎన్నికల్లో కారు కుదేలయితే అనేకమంది పక్క చూపులు చూసే అవకాశం ఉండేది. కానీ అనూహ్యంగా పీవీ కూతురిని బరిలో దింపి బీజేపీ సిట్టింగ్ సీటు కొల్లగొట్టిన కేసీఆర్ వ్యూహం ఫలించడంతో టీఆర్ఎస్ లో సందిగ్ధం సర్ధుమణిగే పరిస్థితి వచ్చింది. దాంతో కేసీఆర్ వ్యూహాలకు ప్రజల్లో ఇంకా ఆదరణ ఉందనే వాదన మొదలయ్యింది. ఈ పరిస్థితుల్లో గోడ మీద ఉన్న నేతలు కూడా పునరాలోచన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇవన్నీ కలిసి బీజేపీ ఆశలపై నీల్లు జల్లుతుండగా, టీఆర్ఎస్ శ్రేణులను నిరాశ నుంచి గట్టెక్కించేందుకు దోహదపడేలా ఉన్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. వాటి ప్రభావంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కనిపిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ వ్యూహాత్మంగా అడుగులు వేస్తుండగా, బీజేపీ కొంత తడబడడం దానికి తార్కాణం అని చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి