iDreamPost

తావీద్‌ మహిమ.. బాబూ తావీద్‌ మహిమ..!

తావీద్‌ మహిమ.. బాబూ తావీద్‌ మహిమ..!

‘‘తావీద్‌ మహిమ.. బాబూ చూడడండి తావీద్‌ మహిమ.. అత్కా కోడళ్ళని కలిపేస్తుంది. మొగుడూ పెళ్ళాంలను కలిపేస్తుంది.. ఆకాశానికీ భూమికీ కూడా నిచ్చెనేసే శక్తినిచ్చేస్తుంది.. తావీద్‌ బాబూ.. తావీద్‌..’’ అంటూ అరుస్తున్నాడు మణి.

ఇంటి బయట అరుపులు విని చిరాగ్గా బైటకొస్తున్న కిట్టయ్య.. ఆ కేకలేస్తోంది మణిగాడేనని చూసి కరెంటు షాక్‌ కొట్టినట్టుగా అలాగే నిలబడిపోయాడు.

కిట్టయ్యని చూసి ఇంకా గొంతు పెంచి అరుస్తున్నాడు మణి.. తావీద్‌ బాబూ తావీద్‌.. అంటూ స్వరం పెంచేసాడు.

ఈ లోపు షాక్‌ నుంచి తేరుకున్న కిట్టయ్య.. ‘ఆపెసె.. నీ… బూతులొచ్చేస్తున్నాయ్‌రో.. ఇదేం పోయ్యేకాలంరా నీకు..’’ రాత్రి ఇంటికెళ్ళేటప్పుడు ఏదైనా తొక్కావా? గాలీ గీలా ఏమైనా సోకింది.. ఇదేం వేషం రా.. అంటూ కేకలేయడం మొదలెట్టాడు కిట్టయ్య..

బావా.. నువ్వలా కేకలెయ్యోద్దు.. కొత్తేపారం మొదలెడదా మనుకుంటున్నాను బావా.. అందుకే ప్రాక్టీస్‌ చేస్తున్నా అంటూ అసలు విషయం చెప్పాడు మణి.

ఇదేం వ్యాపారం అందంగా మా మాయ ఇచ్చిన షాపులో కాలుమీద కాలేసుక్కూర్చుని బ్రతక్క ఇదేం పాడుబుద్దిరా.. పరువు తక్కువ పనీ నువ్వూనూ అంటూ తన కొస్తున్న కోపాన్ని బలవంతంగా అణచుకుంటూ.. లోలోపలే తిట్లు అందుకున్నాడు కిట్టయ్య.

అందేంటి బావా.. అలా అంటావు.. రాజకీయ నాయకులు చేస్తే తప్పులేదు గానీ.. నేను చేస్తే నీకు తప్పొచ్చేసిందా.. అంటూ సాగదీసాడు మణి.

ఒరే నువ్వు చేస్తున్నదే తల తిక్క యవ్వారం అంటుంటే.. మళ్ళీ వాళ్ళు చేసారు? వీళ్ళు చేసారు అంటూ ఎక్కడెక్కడికో తిప్పి చుట్టబెడుతున్నావేంట్రా.. అన్నాడు తనకొస్తున్న ఆవేశాన్ని కొంచెం కంట్రోల్‌ చేసుకుంటూ..

కాదు బావా.. నిజమే.. హైదరాబాదు ఎన్నికల్లో చూడు.. కరెక్టుగా ఈ తాయత్తులు అమ్ముతామనే వాళ్ళకు మాదిరిగానే దాదాపు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రజలను వెర్రోళ్ళను చేసే ప్రయత్నాలు తీవ్రంగానే చేస్తున్నారు కదా బా.. అన్నాడు కిట్టయ్య.

బావా కొంచెం ఆవేశం తగ్గించుకుని నేను చెప్పిన యాంగిల్‌లో కొంచెం ఆలోచించు బావా.. అంటే దగ్గరకొచ్చి మరీ నెమ్మదిగా చెవులో చెప్పాడు మణి.

ఏం చేస్తున్నార్రా.. నువ్వే చెప్పు అంటూ లోపలికి వెళ్ళి చావిట్లోని వాలు కుర్చీలో కూలబడ్డాడు కిట్టయ్య..

మరేం లేదు బావా..
సర్జికల్‌ స్రై్టక్స్‌ అని బీజేపీ వాళ్ళు..
చైనా మీదకెళ్ళి చెయ్యి అని యంఐయం వాళ్ళు..
వాళ్ళంతా పిచ్చోళ్ళంటూ టీఆర్‌ఎస్‌ వాళ్ళు..
పై వాళ్ళంతా ఒకటేనని కాంగ్రెస్‌ వాళ్ళు..

ఇలా ఓటర్లకు ఎవరి తాయెత్తును వాళ్ళు అమ్ముకునేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు బావా. మనం ఎలాగూ ఎలఛన్లలో పోటీ చేయలేం. కనీసం తాయెత్తుల వ్యాపారమైనా పెట్టుకుందామని.. వాళ్ళకులా అరవడం ప్రాక్టీస్‌ చేస్తున్నాను బావా.. నువ్వేమో అపార్ధం చేసుకుని నన్ను అనవసరంగా తిట్టిపడేస్తున్నాం.. అంటూ నొచ్చుకోసాగాడు మణి.

ఓర్నాయనోయ్‌.. మణి.. పాపం గెలుపుకోసం ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే పనిలో తీవ్రంగా ప్రయత్నిస్తున్న వాళ్ళందర్ని నువ్వు తాయెత్తులు అమ్ముకునే వాళ్ళతో జమేసేసావా.. నీకో దణ్ణంరా బాబూ.. అంటూ లెంపలు వాయించుకుంటూ కిట్టయ్య అక్కడ్నుంచి జంప్‌ అయిపోయాడు.

బావా జారుకోవడంతో ఏం చేయాలో పాలుపోక.. అక్కా తాయెత్తు.. ఛీఛీ.. టీ పెట్టవే ఇందాకడ్నుంచి అరిచి అరిచి తల పట్టేసింది.. పదేపదే అదే మాట వచ్చేస్తోంది.. అంటూ వాళ్ళక్కకోసం వంటగదిలోకి పరిగెట్టాడు మణి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి