iDreamPost

వలస కూలీలను ఢీకొన్న రైలు- 16 మంది దుర్మరణం

వలస కూలీలను ఢీకొన్న రైలు- 16 మంది దుర్మరణం

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కర్మాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్‌ రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 16 మంది వలస కూలీలు మృతి చెందారు.ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా ఛత్తీస్ ఘడ్ మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న వలస కార్మికులుగా గుర్తించారు. చనిపోయిన వారిలో కొందరు మహిళలు చిన్నారులు కూడా ఉన్నారు. శుక్రవారం ఉదయం 5.15 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు.

కర్మాడ్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వారంతా రైల్వే ట్రాక్ పక్కనే కాలి నడకగా స్వస్థలాలకు వెళుతున్నట్లుగా తెలిసింది. వలస కూలీలు మధ్యప్రదేశ్‌ నుంచి చత్తీస్‌గఢ్‌ వెళ్తున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. జల్నా నుంచి భూస్వాల్‌ వరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి రైలులో మధ్యప్రదేశ్‌ వెళ్లాలని వారు భావించారు. అయితే దాదాపు 45 కి.మీ దూరం నడిచాక వారు రైల్వే ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పట్టాలపై నిద్రిస్తున్న వారిని రైలు వేగంగా ఢీకొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. ఆర్పీఎఫ్‌, రైల్వే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి బయల్దేరారు.

కాలినడకన వెళ్తూ పట్టాలపై నిద్రించిన వలస కూలీలు రైలు రాకను గమనించక పోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా మృతదేహాలు రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడివున్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. కాగ ఔరంగబాద్ ఘటనపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి