iDreamPost

ఢిల్లీ పెద్దల ప్రసన్నంలో పీసీసీ ఆశావహులు

ఢిల్లీ పెద్దల ప్రసన్నంలో పీసీసీ ఆశావహులు

కుదేలవుతున్న కాంగ్రెస్ కు కొత్త జవసత్వాలిచ్చేదెవరు? ఇప్పుడీ ప్రశ్న తెలంగాణలో అందరి మదినీ తొలుస్తోంది. వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష
పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో పార్టీ పగ్గాలు ఎవరు చేపడుతారా? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక కోసం గట్టి కసరత్తే చేసింది.
కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాగూర్ రాష్ట్రంలో పార్టీ పెద్దలందరితోనూ సంప్రదింపులు నిర్వహించారు. వేరు వేరుగా కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయాలను
సేకరించారు. పీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నవారు పదుల సంఖ్యలో ఉండడంతో అంతిమ నిర్ణయం అధిష్టానానికే వదిలేశారు మణిక్యం ఠాగూర్.

ఈ నేపథ్యంలో పీసీసీ
పదవిని ఆశిస్తున్న ఇద్దరు ఎంపీలు ఢిల్లీ బాట పట్టడం ఆసక్తిని రేకిస్తోంది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో పీసీసీ పదవిపై సీనియర్లంతా ఆశలు పెట్టుకున్నారు. రోజురోజుకూ రాష్ట్రంలో ఉనికి కోల్పోతున్న పార్టీకి తిరిగి పునర్వైభవం తెచ్చేందుకు
సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తోంది. కానీ… పలువురు సీనియర్ నేతలు మాత్రం పీసీసీ అధ్యక్ష పదవి తమకే ఇవ్వాలంటూ
పట్టుబడుతున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పీసీసీ పదవి కోసమే పార్టీకి రాజీనామా చేశారు. ఇక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చాలాకాలంగా
ఈ పదవిని దక్కించుకోవాలని చూస్తున్నారు. అటు రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డిలతో పాటు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వీహెచ్, రాజనర్సింహా ఇలా పలువురు నేతలు పీసీసీ పదవి కోసం పోటీ పడుతున్నారు.

ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకొని అసంతృప్తులకు తావులేకుండా పీసీసీ చీఫ్ ని ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉంది అధిష్టానం.

తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో ఉత్కంఠ కొనసాగుతుండగానే పీసీసీ రేసులో ఉన్న ఇద్దరు ఎంపీలు హస్తిన బాట పట్టారు. ఢిల్లీకి వెళ్లిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోనియాగాంధీని కలిశారు. తెలంగాణలో తాజా పరిస్థితులను వివరించడంతో పాటు, పీసీసీ బాధ్యతలు తనకే అప్పగించాలని సోనియాను కోరినట్లు తెలుస్తోంది.
మరోవైపు టీపీసీసీ చీఫ్ పదవికి పోటీపడుతున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీకి వెళ్లారు. డిఫెన్స్‌కు సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువురు ఎంపీలు ఒకే సారి అధిష్టానాన్ని కలుస్తుండడం ఆసక్తికరంగా మారింది.

తొలుత పీసీసీ పగ్గాలు రెవంత్ కే కట్టబెడతారనే ప్రచారం జోరుగా సాగింది. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ కు పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం పట్ల పలువురు సీనియర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రేవంత్ కు పీసీసీ పదవి ఇస్తే సీనియర్లు పార్టీ వీడే అవకాశమున్నట్లు ఇప్పటికే అధిష్టానానికి అర్థమైంది. ఈ నేపథ్యంలో కొత్త వారికి అవకాశం ఇచ్చే విషయంలో హైకమాండ్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో పీసీపీ పదవిని ఆశిస్తున్న ఇద్దరు ఎంపీలు ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడడం ఆసక్తినిరేకెత్తిస్తోంది. మరి అధిష్టానం నిర్ణయం ఎలా ఉండబోతుంది? తరువాత తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి కుదుపులుండబోతున్నాయో తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి