iDreamPost

మంచి రోజుల కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్

మంచి రోజుల కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్

థియేటర్లు తెరుచుకుని అయిదు వారాలు పూర్తయ్యాయి. టాలీవుడ్ లోనే చెప్పుకోదగ్గ స్థాయిలో రిలీజులు ఉంటున్న సంగతి తెలిసిందే. కానీ దీని పట్ల డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతల్లో ఇంకా అంత ఉత్సాహం కనిపించడం లేదు. సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఇదిరా టాలీవుడ్ సత్తా అని గర్వంగా చెప్పుకునే స్థాయిలో దేనికీ కలెక్షన్లు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఏ ఒక్క సినిమా అయినా కనీసం 15 కోట్ల షేర్ ని దాటగలిగితే అప్పుడు వచ్చే కిక్ వేరే ఉంటుంది. కానీ అలా జరగడం లేదు. లాక్ డౌన్ తర్వాత పెద్ద హిట్టుగా చెప్పుకున్న ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా 8 కోట్ల దగ్గర ఆగిపోయింది. దాని బిజినెస్ కి ఇది చాలా పెద్ద మొత్తమే కానీ ఈ జోష్ సరిపోదు.

తెలుగు రాష్ట్రాల్లో వీక్ డేస్ లో థియేటర్లు చాలా మటుకు సగం సీట్లను కూడా నింపుకోలేకపోతున్నాయి. వీకెండ్స్ పర్వాలేదు అనిపిస్తున్నా కూడా మునుపటి స్థాయిలో జనాల నుంచి స్పందన లేదని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. మెయింటెనెన్స్ ఖర్చులకు సరిపోయేంత మొత్తం వస్తే సరిపోదని, లాభాలు వెనకేసుకునేలా మంచి వసూళ్లు వస్తే అప్పుడు ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం వస్తుందని థియేటర్ల యజమానులు అభిప్రాయపడుతున్నారు. లవ్ స్టోరీ లాంటి క్రేజ్ ఉన్న సినిమాలు కూడా అదిగో ఇదిగో అంటూ పదే పదే వాయిదాలు వేసుకోవడం కూడా బాక్సాఫీస్ మీద ప్రభావం చూపిస్తున్నాయి.

రోజుకు నాలుగు లేదా మూడు షోలు వేయడం అంటే ఇప్పుడో పెద్ద ఛాలెంజ్ గా మారిపోయింది. కరెంట్ ఖర్చులు, సిబ్బంది జీతాలు, యుఎఫ్ఓ ఛార్జీలు, కట్టాల్సిన పన్నులు వగైరాలన్నీ చూసుకుంటూ పోతే ఒక్క స్క్రీన్ కు కనీసం రోజుకు ఇరవై వేల దాకా కలెక్షన్ రావాల్సి ఉంటుంది. కానీ అలా జరగడం లేదు. చెప్పుకోదగ్గ స్టార్ హీరో సినిమా ఏదీ పడకపోవడమే ఈ స్థితికి కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవేళ ఈ రోజు సీటిమార్, గల్లీ రౌడీ లాంటి మాస్ చిత్రాలు వచ్చినా కొంచెం బెటర్ గా ఉండేది కానీ 101 జిల్లాల అందగాడు, డియర్ మేఘ జనాన్ని పూర్తిస్థాయిలో థియేటర్ దాకా రప్పించలేకపోతున్నాయి. చూడాలి 10వ తేదీ నుంచి ఇందులో ఏదైనా మార్పు వస్తుందేమో

Also Read : TRP టార్గెట్ చేరుకున్న యంగ్ టైగర్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి