iDreamPost

జూమ్ అంటున్న టాలీవుడ్

జూమ్ అంటున్న టాలీవుడ్

ఇపుడున్న కరోనా పరిస్థితుల్లో కొత్తవాళ్లను ఎవరిని కలవలన్నా భయం వేస్తోంది. ఇక నిత్యం పదుల సంఖ్యలో అపరిచితులతో వ్యవహారాలు నడిపే సినిమా వాళ్ళ గురించి చెప్పేదేముంది. ముఖ్యంగా కొత్త కథలు వినాలన్నా దర్శకులతో ప్రాజెక్టులు కన్ఫర్మ్ చేయాలన్నా మీటింగులు తప్పనిసరి. అయితే ఇంట్లో లేదా ఆఫీసుల్లో ఈ తతంగం నడిచేది. కానీ ఇప్పుడలా కుదరదు. ఎంత అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకున్నా ఎవరు ఎక్కడెక్కడ తిరిగి మనల్ని కలుస్తున్నారో పసిగట్టడం అసాధ్యం. అందుకే టాలీవుడ్ నిర్మాతలు కొందరు జూమ్ మీటింగులు ప్లాన్ చేశారట. ఎవరైతే కొత్త కథలు వినిపించాలనుకుంటారో వాళ్లకు తమ ఐడి ఇచ్చి ఫలానా టైంలో లాగిన్ అవ్వమని సందేశం పంపుతున్నారు.

అదే సమయంలో తమ టీమ్ ని కూడా సెట్ చేసుకుని ఒకేసారి స్టోరీ డిస్కషన్ జరిగేలా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలిసింది. టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇదే తరహాలో గీతా ఆర్ట్స్ వ్యవహారాలతో పాటు ఆహాకు సంబంధించిన డీలింగ్స్ కూడా జూమ్ యాప్ ద్వారా చేస్తున్నట్టు వినికిడి. పెద్ద ప్రొడక్షన్ హౌసులను నడుపుతున్న పెద్దలు అధికశాతం దాదాపు ఐదారు పదుల వయసు దాటినవాళ్లే ఎక్కువగా ఉండటంతో ఇదే సేఫని భావిస్తున్నారు. నిజానికి ఇలా చేయడమే మంచి పద్ధతని చెప్పాలి. లేనిపోని రిస్కులకు పోకుండా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదే. అందులోనూ షూటింగులు అధికంగా జరిగే హైదరాబాద్ లో పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు కాబట్టి ఈ ఆలోచన ఆహ్వానించదగ్గది.

మరోవైపు షూటింగులు మొదలయ్యాక కూడా ప్రతీరోజుకు సెట్ కు వెళ్లకుండా లైవ్ వెబ్ కెమెరాల ద్వారా ఇంటి నుంచే పర్యవేక్షించేలా ఇంకొందరు ప్లాన్ చేసుకున్నారు. అంటే లొకేషన్ లో డైరెక్టర్ తో పాటు ముఖ్యమైన సభ్యులు మాత్రమే అందుబాటులో ఉంటారన్న మాట. ప్రొడ్యూసర్ చిన్న వయసు వారైతే క్రమం తప్పకుండా వస్తారు. అదే వృద్ధులైతే మాత్రం వాచ్ ఫ్రమ్ హోమ్ సూత్రం పాటిస్తారు. అయితే ఇవన్నీ తాత్కాలికమే. కరోనా తగ్గుముఖం పట్టి జీరో కేసులు వస్తే కనక మళ్లీ యథావిధిగా ఎప్పటిలాగే స్టూడియోలు, సెట్లు కళకళలాడతాయి. జూమ్, గూగుల్, టీమ్ లింక్ యాప్ ఏదైనా టెక్నాలజీ ఇప్పుడీ విపత్కాలంలో పెద్ద అండగా నిలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి