iDreamPost

అభయం ఇచ్చిన ‘లవ్ స్టోరీ’.. రిలాక్స్ అవుతున్న టాలీవుడ్!

అభయం ఇచ్చిన ‘లవ్ స్టోరీ’.. రిలాక్స్ అవుతున్న టాలీవుడ్!

ఎట్టకేలకు టాలీవుడ్ నుంచి విడుదలైన లవ్ స్టోరీ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది.. నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. అయితే విడుదలైన మొదటి రోజే ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చిపడ్డాయి.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు పరిశీలిస్తే సుమారు 16 కోట్ల రూపాయలు రాబట్టింది ఈ సినిమా. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇంత భారీగా కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమా ఇదే. అయితే బాలీవుడ్లో సైతం కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ ఈ సినిమా ఆ కలెక్షన్లు వాటన్నింటినీ దాటేసింది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో సినిమాలు విడుదల చేయవచ్చా లేదా అని భయపడుతున్న టాలీవుడ్ నిర్మాతలు అందరూ కాస్త ఊపిరి పీల్చు కుంటున్నారు.

అందరూ ఇప్పుడు వరుసగా రిలీజ్ డేట్లు ప్రకటించడం మొదలు పెట్టారు. అయితే అక్టోబర్ నెలలో దసరాకు ఏకంగా మూడు సినిమాలు రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. ముందుగా సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ ఒకటో తేదీన విడుదల కాబోతోంది. అలాగే అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా 8వ తారీకున విడుదల కాబోతుండగా అదే రోజు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన కొండపొలం సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అఖిల్ ఇప్పటికే దాదాపు మూడు సినిమాలు చేసినా ఏవీ వర్కౌట్ కాలేదు, దీంతో ఆయన ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు.

దసరాకు తెలుగు నుంచి మహాసముద్రం అలాగే వరుడు కావలెను సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక మరో పక్క వరుణ్ డాక్టర్ అనే డబ్బింగ్ సినిమా కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీన విడుదల చేస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ హీరోగా నటించిన మహాసముద్రం సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే నాగ శౌర్య హీరోగా నటిస్తున్న వరుడు కావలెను సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. లవ్ స్టోరీ ఇచ్చిన ధైర్యంతో పాటు తమ తమ సినిమాల కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఇప్పుడు తెలుగు నిర్మాతలు అందరూ రిలీజ్ డేట్ లు చూసుకుని ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ రోజు వరుడు కావలెను అనే సినిమా ప్రకటించగా మరో చిన్న సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఒకరకంగా టాలీవుడ్ మార్కెట్ నెమ్మదిగా పుంజుకుంటుందనే సంకేతాలు రావడంతో రాబోయే వారం రోజుల్లో మరిన్ని సినిమాల రిలీజ్ డేట్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read : అఖిల్ సినిమాకు పరీక్ష తప్పదా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి