iDreamPost

Surigadu Movie:నాన్నతనానికి నిలువెత్తు నిదర్శనం

Surigadu Telugu Movie: దాసరి నారాయణరావు తెరకెక్కించిన అద్భుతమైన సినిమాల్లో సూరిగాడు చిత్రం చాలా ప్రత్యేకమైనది. ఇందులో బిడ్డల అభ్యున్నతి కోసం తండ్రి పడే కష్టాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. దాసరి నారాయణరావు ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ఇది.

Surigadu Telugu Movie: దాసరి నారాయణరావు తెరకెక్కించిన అద్భుతమైన సినిమాల్లో సూరిగాడు చిత్రం చాలా ప్రత్యేకమైనది. ఇందులో బిడ్డల అభ్యున్నతి కోసం తండ్రి పడే కష్టాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. దాసరి నారాయణరావు ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ఇది.

Surigadu Movie:నాన్నతనానికి నిలువెత్తు నిదర్శనం

ఒక కుటుంబంలో అమ్మ ఎక్కువా నాన్న ఎక్కువా అంటే ముందొచ్చే పేరు తల్లిదే. అలా అని తండ్రి పాత్ర తక్కువ చేస్తే అంతకన్నా తప్పు మరొకటి ఉండదు. అయితే సినిమాల్లో ఎక్కువ అమ్మను ఆధారంగా చేసుకుని వచ్చాయి కానీ నడక నడత నేర్పిన నాన్న గురించి వచ్చినవి తక్కువే. అందులో ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన చిత్రం ‘సూరిగాడు’. 1992లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించడమే కాదు టైటిల్ రోల్ కూడా పోషించారు. ఆఫీసర్స్ క్లబ్ లో వాచ్ మెన్ గా పనిచేసే సూరికి ఒక్కడే కొడుకు. తనలా కాకూడదని ఉన్నత చదువుల కోసం కొడుకుని పెద్ద కాలేజీలో చేర్పిస్తాడు.

అయితే నాన్న గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడే అతను డబ్బున్న వాడిగా బిల్డప్ ఇచ్చుకుంటూ ధనవంతురాలైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయినా తల్లితండ్రులను పెళ్ళికి పిలవడు. కొన్ని పరిణామాల తర్వాత తల్లి వంటమనిషిగా తండ్రి వాచ్ మెన్ గా చేరినా నోరు విప్పడు. ఓసారి సూరి భార్యకు జబ్బు చేస్తోంది. 4 లక్షలు అవసరమవుతాయి. వాటి కోసం సూరి కోర్టుకెక్కి కొడుకు దగ్గర పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా పెట్టిన ఖర్చుని వసూలు చేసుకుని ఒంటరిగా భార్యను తీసుకుని చికిత్స కోసం విదేశాలకు వెళ్ళిపోతాడు. ఇదీ స్థూలంగా సూరిగాడు కథ.

కమర్షియల్ సినిమాల ఆధిపత్యం నడుస్తున్న టైంలో దాసరి వదిలిన ఈ సెంటిమెంట్ అస్త్రం ప్రేక్షకుల మనసులను నేరుగా తాకింది. డబ్బు మదంతో విర్రవీగే కొడుకులకు బుద్దొచ్చేలా సూరిగాడు పాత్ర ద్వారా చెప్పిన సందేశం ఎందరికో కనువిప్పు కలిగించింది. ఇది ఇంతగా పండడానికి కారణం దాసరి గారు దర్శకుడిగా కంటే నటుడిగా ఎప్పటికి మర్చిపోలేని అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇవ్వడం. భార్యగా సుజాతా, కొడుకుగా సురేష్, కోడలిగా యమున, వియ్యంకుడిగా గొల్లపూడి ఇలా ఎవరికి వారు తమ సహజమైన నటనతో సూరిగాడు సినిమాకు తమ వంతు బాధ్యతను చక్కగా నిర్వర్తించారు.

మ్యూజికల్ గానూ సూరిగాడు పాటలు మంచి హిట్టయ్యాయి. వాసూరావు చక్కని బాణీలు అందించారు. కథా సహకారం అందించిన శ్రీరాజ్ సంభాషణలు థియేటర్లలో చప్పట్లు కొట్టించుకున్నాయి. క్లైమాక్స్ లో వచ్చే కోర్టు సీన్లో దాసరి పలికే డైలాగులకు గుండె తడి కాని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అందుకే సూరిగాడు 100 రోజులు దిగ్విజయంగా ప్రదర్శింపబడి చిరంజీవి, వెంకటేష్ ముఖ్యఅతిధులుగా వేడుక కూడా జరిపుకుంది. ఈ సందర్భంగానే తన యూనిట్ కంతా రామానాయుడు గారు ఒక నెల జీతం బోనస్ గా ఇచ్చారు. అవును మరి. సూరిగాడు సాధించిన విజయం అలాంటిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి