iDreamPost

మాయావతి దారిలో మరో ఎమ్మెల్యే – బ్రతికుండగానే విగ్రహాలు

మాయావతి దారిలో మరో ఎమ్మెల్యే – బ్రతికుండగానే విగ్రహాలు

ప్రతి మనిషికీ తనను ప్రజలంతా గుర్తుంచుకోవాలని, తన గురించి గొప్పగా మాట్లాడుకోవాలని, ప్రజలందరిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆశ ఉంటుంది. రాజకీయనాయకులకైతే ఈ ఆశ మరీ ఎక్కువగా ఉంటుంది. కానీ కొందరు మాత్రమే చరిత్రలో గొప్ప నాయకులుగా మిగిలిపోతారు. ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. అలాంటి గొప్ప నాయకుల విగ్రహాలు మనం వీధుల్లో చూస్తూనే ఉంటాం.. కానీ ఒక ఎమ్మెల్యే మాత్రం తాను చనిపోతే ప్రజలు గుర్తుంచుకోవాలని తన విగ్రహాలను తానే ముందుగానే చెక్కించుకుని సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడీ వార్త రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సౌత్ 24 పర్గనాస్ జిల్లాలోని గోసాబా నియోజవర్గ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జయంత్‌ నాస్కర్‌(71) మూడేళ్ల క్రితం కోల్‌కతాలో పేరుగాంచిన శిల్పితో రెండు విగ్రహాలను తయారు చేయించుకున్నారు. తాజాగా పార్టీ సమావేశంలో ఈ విషయం బయటకు పొక్కింది. బ్రతికుండగానే తన విగ్రహాలను తానే చెక్కించుకున్న ఫోటోలు వైరల్ కావడంతో జయంత్ నాస్కర్ ఇచ్చిన వివరణ విని అవాక్కవడం ప్రజలవంతయ్యింది.

“లోకల్‌ లీడర్లే నన్ను హత్య చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నాకు జిల్లా ఎస్పీ ప్రవీణ్‌ త్రిపతి చెప్పారు. దీంతో నాకు ‘వై’ కేటగిరి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నాకు ప్రాణహాని ఉంది. ఏ క్షణంలోనైనా నేను హత్యకు గురికావొచ్చు. నేను చనిపోయిన తర్వాత ప్రజలు నన్ను మర్చిపోకూడదు. అందుకే విగ్రహాలు తయారు చేయించానని .. తనకు ప్రాణహాని ఉందని ఒకవేళ తాను హత్యకు గురైతే ప్రజలు తనను మర్చిపోకుండా గుర్తుంచుకునేందుకే ముందుగా విగ్రహాలు చెక్కించుకున్నానని వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే జయంత్ నాస్కర్..ఇదిలా ఉంటే జయంత్ నాస్కర్ కి స్థానిక రాజకీయ నాయకులనుండి ఎలాంటి ప్రాణహాని లేదని, పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొనడం గమనార్హం.

దీంతో సదరు నాయకుణ్ణి ప్రజలు గుర్తుంచుకోవాలంటే ప్రజాసేవ చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ప్రయత్నించాలి అప్పుడు ప్రజలే గుర్తుతెచ్చుకుని మరీ విగ్రహాలు పెడతారు అంతేకానీ, ముందుగానే తన విగ్రహాలు తానే చెక్కించుకోవడం ఏంటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

గతంలో మాయావతి కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత తన విగ్రహాలను ఏర్పాటు చేసుకుందన్న విమర్శలను మూటగట్టుకుంది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జయంత్ నాస్కర్ కూడా అదే దారిలో పయనించడంతో విమర్శల వర్షం కురుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి