iDreamPost

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోలింగ్‌ అనివార్యమా..?

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోలింగ్‌ అనివార్యమా..?

తిరుపతి ఎంపీ, వైసీపీ నేత బల్లి దుర్గాప్రసాద్‌ రావు ఇటీవల అకాల మరణం పొందారు. కరోనాకు చికిత్స తీసుకుని కోలుకుంటున్న తరుణంలో గుండెపోటు రావడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఎంపీ మరణంతో.. తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా..? లేక పోలింగ్‌ జరుగుతుందా..? అనేది ఆయా పార్టీల నిర్ణయంపై ఆధారపడి ఉంది.

విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ సాంప్రదాయాన్ని ముందుకు తెచ్చింది. ఎవరైనా ప్రజా ప్రతినిధి చనిపోతే అక్కడ తమ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలబెట్టకుండా ఏకగ్రీవం చేసే విధానాన్ని అవలంభించింది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే చనిపోతే.. అక్కడ ఉప ఎన్నికకు వైసీపీ దూరంగా ఉంది. మండలి బుద్ధ ప్రసాద్‌ టీడీపీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నంధ్యాలలో భూమా నాగిరెడ్డి వైసీపీ తరఫున గెలిచి.. టీడీపీలోకి వెళ్లిన తర్వాత గుండెపోటుతో మరణించారు. సాంకేతికపరంగా ఆ సీటు వైసీపీది కావడంతో అక్కడ వైసీపీ అభ్యర్థిని నిలబెట్టింది. టీడీపీ కూడా పోటీ చేసింది.

ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. మరి వైసీపీ పాటించిన సాంప్రదాయాన్ని టీడీపీ కూడా పాటించి.. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు దూరంగా ఉంటుందా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ఇక మిగతా పార్టీలైన సీపీఐ, సీపీఎం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌లలో.. బీజేపీ తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. నిన్న మంగళవారం జరిగిన పదాదికారులు, జిల్లా అధ్యక్షులు సమావేశంలో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిని పోటీలో దింపాలని నిర్ణయించారు.

బీజేపీ, జనసేన పోటీలో ఉంటామని ప్రకటించడంతో లోక్‌సభ ఉప ఎన్నికలో పోలింగ్‌ అనివార్యం అయ్యేటట్లే ఉంది. పోలింగ్‌ జరిగితే.. అధికార పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. టీడీపీ, బీజేపీ–జనసేన కూమిటి అభ్యర్థులు బరిలోఉంటే.. గడిచిన 16 నెలల్లో వైసీపీ పని తీరు ఎలా ఉందో కూడా ప్రజలు తమ ఓటు ద్వారా చెప్పేందుకు అవకాశం ఉంటుంది. తమ పరిస్థితి మెరుగైందా..? లేదా ఇంకా దిగజారిందా..? అనేది ప్రతిపక్ష పార్టీలకు తెలుసుకునే అవకాశం ఏర్పడుంది. ఆరు నెలల లోపు ఎన్నిక నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read Also ; అయ్యన్న తెలిసి మాట్లాడుతున్నారా..? తెలియక మాట్లాడుతున్నారా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి