iDreamPost

క్రేజీ హీరోకు ఖరీదైన పాఠాలు

క్రేజీ హీరోకు ఖరీదైన పాఠాలు

బాలీవుడ్ తర్వాత అత్యధికంగా సినిమాలు నిర్మించే టాలీవుడ్ లో ఏదైనా పెద్ద సక్సెస్ వస్తే దాన్ని నిలబెట్టుకోవడం కత్తి మీద సాము లాంటిది . హీరోకైనా దర్శకుడికైనా ఇదే వర్తిస్తుంది. కెరీర్ ప్లానింగ్, కథల ఎంపికలో ఏ చిన్న పొరపాటు చేసినా దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇది క్రేజీ హీరో విజయ్ దేవరకొండకు మెల్లగా అనుభవంలోకి వస్తోంది. సోలో హీరోగా పెళ్లి చూపులుతో మొదటి హిట్ కొట్టిన విజయ్ ఆ తర్వాత అర్జున్ రెడ్డి దెబ్బకు యూత్ కి ఒకరకంగా ఐకాన్ లా మారిపోయాడు. 

గీత గోవిందం ఏకంగా ఇండస్ట్రీ హిట్ సాధించడంతో అదంతా తనవల్లే అనుకున్నాడో ఏమో అప్పటి నుంచి కాస్తంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే తన మాటల్లో చేతల్లో కనిపించింది. ఆ తొందరలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మార్కెట్ లో ప్రభావం చూపిస్తున్నాయి. వరల్డ్ ఫేమస్ లవర్ భారీ నష్టాల దిశగా వెళ్తోంది. వీకెండ్ ను సైతం క్యాష్ చేసుకోలేక బ్యాడ్ టాక్ నుంచి సినిమాను కాపాడుకోలేక యూనిట్ సైతం ప్రమోషన్ ను ఆపేసింది. కనీసం అరవై శాతం నష్టాలు తప్పవని ట్రేడ్ టాక్

ఇక ఏడాది ముందు చేసిన డియర్ కామ్రేడ్ దీని కన్నా కాస్త నయం కాని అదీ ఫ్లాప్ లిస్టులోకే వెళ్లిపోయింది. మితిమీరిన పబ్లిసిటీ చేసినప్పటికీ అది సినిమాను కాపాడలేకపోయింది. అంతకు ముందు తన ఇమేజ్ ని పక్క రాష్ట్రాలకు కూడా తీసుకెళ్లాలని చేసిన నోటా చాప చుట్టడం ఎవరూ మర్చిపోలేదు. ఈ గ్యాప్ లో వచ్చిన టాక్సీ వాలా పర్వాలేదు అనిపించుకున్నా వసూళ్ళ పరంగా అది విజయ్ దేవరకొండ రేంజ్ సినిమా అయితే కాదు. 

సో ఇప్పుడు నిర్మాణంలో ఉన్న పూరి జగన్నాధ్ లైగర్(రిజిస్టర్ చేసిన టైటిల్) ఖచ్చితంగా పెద్ద హిట్టు కొడితే తప్ప బౌన్స్ బ్యాక్ అవ్వడం సులభం కాదు. కొన్ని నెలల క్రితం మొదలైన బైలింగ్వల్ సినిమా హీరో గురించి ఎలాంటి ఊసు లేదు. నిర్మాతలైన మైత్రి వారు ఏమి చెప్పడం లేదు. ప్లానింగ్ లో లోపం అయితే విజయ్ దేవరకొండ గ్రాఫ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇకనైనా మూసకు కట్టుబడకుండా ఉంటె మంచిది.   గడ్డాలు పెంచేసి చొక్కాలు లేకుండా అరుపులు కేకలతో అన్ని సినిమాలను నిలబెట్టలేమని గుర్తిస్తే మంచి కథలు రాకుండా పోవు. అది ఉన్నది అతని చేతిలోనే. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి