iDreamPost

రూ.10 లక్షలకే మహిమ గల నాణెం.. పొడిచినా ఏం కాదంటూ!

  • Published Aug 02, 2023 | 2:39 PMUpdated Aug 02, 2023 | 2:39 PM
  • Published Aug 02, 2023 | 2:39 PMUpdated Aug 02, 2023 | 2:39 PM
రూ.10 లక్షలకే మహిమ గల నాణెం.. పొడిచినా ఏం కాదంటూ!

రాకెట్‌లలో అంతరిక్షంలోకి దూసుకుపోతున్నాం.. విశ్వాంతరాల్లో దాగున్న రహస్యాలను సైతం శోధిస్తున్నాం. సాంకేతికంగా ఎంత అభివృద్ధి సాధించినా సరే.. కొన్ని విషయాల్లో మాత్రం మార్పు రావడం లేదు. మరీ ముఖ్యంగా మూఢనమ్మకాలపై జనాలకు ఇంకా సరిగా అవగాహన ఏర్పడలేదు. చేతబడులు, క్షుధ్ర పూజలు, రైస్‌ పుల్లింగ్‌ తరహాలో జరిగే మోసాల గురించి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నప్పటికి.. జనాలు మాత్రం ఆ ప్రలోభాల బారి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా ఈ తరహా ఘరానా మోసం ఒకటి వెలుగు చూసింది. మహిమ గల ఈ నాణెం మీ దగ్గర ఉంటే.. పొడిచినా ఏం కాదు అంటూ.. భారీగా డబ్బులు గుంజే ప్రయత్నం చేశారు. ఆ వివరాలు..

సూర్యపేటలో ఈ తరహా మోసం వెలుగు చూసింది. వరంగల్‌కు చెందని మహిళ ఒకరు.. మహిమ గల నాణెం అంటూ మోసాలకు పాల్పడుతుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్‌ జిల్లాకు చెందిన రామరాజు, సౌజన్య ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు సంతానం ఉన్నారు. రామరాజు పని చేసేవాడు కాదు. తన దగ్గర ఒక రాగి నాణెం ఉండేది. దానికి ఎన్నో శక్తులున్నాయని.. అది దగ్గర ఉంటే.. ఎలాంటి దుష్టశక్తి మన దరి చేరదని.. ఆఖరికి కత్తితో పొడిచినా ఏం కాదని నమ్మించి జనాలను మోసం చేసి వారి వద్ద నుంచి భారీగా డబ్బులు గుంజేవాడు. అయితే కొన్నాళ్ల క్రితం రామరాజు మృతి చెందాడు. దాంతో కుటుంబ పోషణ భారం సౌజన్య మీద పడింది.

భర్త దారిలోనే..

నలుగురు పిల్లలను పోషించడం కష్టం కావడంతో.. సౌజన్య కూడా భర్త దారినే ఎంచుకుంది. రామరాజుకున్న పాత పరిచయాలతో.. తమ దగ్గర ఉన్న రాగి నాణెం ద్వారా మళ్లీ మోసాలకు తెర తీసింది. ఈ క్రమంలో సౌజన్యకు మిర్యాలగూడకు చెందిన అజారుద్దీన్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి జనాలను మోసం చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో సూర్యపేటకు చెందిన ఓ వ్యక్తి వీరికి పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో అజారుద్దీన్‌ తమ దగ్గరు మహిమ గల రాగి నాణెం ఉందని.. అది దగ్గర ఉంటే అద్భుతాలు జరుగుతాయని.. కత్తితో పొడిచినా ఏం కాదని నమ్మబలికాడు. అంతేకాక ఈ కాయిన్‌ని నీలి రంగు నీటిలో వేస్తే తెల్లగా మారతాయని.. బాధితుడికి మ్యాజిక్‌ చేసి చూపించాడు. దాంతో వారు చెప్పింది నిజమే అని నమ్మి.. 10 లక్షల రూపాయలకు బేరం మాట్లాడుకున్నాడు బాధితుడు.

అనుమానం రావడంతో..

బాధితుడు ముందుగా 6.50 లక్షలు చెల్లించి నాణెం తీసుకున్నాడు. ఆ తర్వాత దాన్ని చెక్‌ చేశాడు. అయితే నిందితులు తనకు చెప్పిన విధంగా కాకుండా వేరే రకమైన ఫలితం వచ్చింది. దాంతో మోసపోయానని భావించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇక్కడే పోలీసులు చాకచ్యంగా వ్యవహరించి.. వల వేసి నిందితులను పట్టుకున్నారు. బాధితుడి ద్వారా నిందితులకు కాల్‌ చేయించారు పోలీసులు. నాణెం కోసం ముందుగా మాట్లాడుకున్న మొత్తం 10 లక్షల రూపాయలకు సంబంధించి ఇప్పుడు మరో 50 వేలు ఇస్తాను అని నిందితులను నమ్మించాడు. డబ్బులు పేరు చెప్పగానే ఏమాత్రం ఆలోచించకుండా.. వచ్చేశారు నిందితులు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుల వద్ద నుంచి సూది, దారం, కత్తెర, 50 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి