iDreamPost

NBK , Allu Arjun & Nani : రిస్క్ తీసుకున్నారు రిజల్ట్ అందుకున్నారు

NBK , Allu Arjun & Nani :  రిస్క్ తీసుకున్నారు  రిజల్ట్ అందుకున్నారు

కొత్త సంవత్సరం వచ్చింది కానీ బాక్సాఫీస్ మాత్రం ఇంకా డిసెంబర్ హ్యాంగోవర్ లోనే ఉంది. ఆ నెలలో విడుదలైన మూడు సినిమాల బ్లాక్ బస్టర్ రన్ ఇంకా కొనసాగుతూ ఉండటమే దానికి కారణం. పరిస్థితులకు ఎదురీది ముగ్గురు హీరోలు వాళ్ళ చిత్రాల దర్శక నిర్మాతలు తీసుకున్న నిర్ణయాలు గొప్ప ఫలితాలను అందిస్తున్నాయి. ముందుగా అఖండ సంగతి చూసుకుంటే 32వ రోజు కూడా చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడటం ఈ మధ్య కాలంలో ఒక్క దీని విషయంలోనే జరిగిందని చెప్పాలి. హైదరాబాద్ లాంటి నగరాల్లో సైతం సెకండ్ షోలు ఫ్యామిలీ ఆడియన్స్ తో నిండాయంటే జనానికి ఇది ఎంతగా కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఊహించనిది.

దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే సంక్రాంతికి కూడా భారీ వసూళ్లను తెస్తుందని అభిమానులు బల్లగుద్ది చెబుతున్నారు. కానీ డిస్నీ హాట్ స్టార్ పండగకు డిజిటల్ ప్రీమియర్ ప్లాన్ చేసుకుందని ఇన్ సైడ్ టాక్. నిర్మాత నుంచి ఇంకో రెండు వారాలు ఆగమని అభ్యర్థన వెళ్లినా సరే ఒప్పుకోలేదని వినికిడి. ఇక అడ్డంకులు అవాంతరాల మధ్యే వచ్చిన అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ పార్ట్ 1 ఊహించని స్థాయిలో పాన్ ఇండియా సూపర్ హిట్ అయిపోయింది. ముఖ్యంగా నార్త్ లో డెబ్భై కోట్ల కలెక్షన్లతో ఏకంగా కెజిఎఫ్ ని దాటేసింది. కొన్ని చోట్ల బాహుబలిని టార్గెట్ చేసినట్టు ట్రేడ్ నుంచి వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వంద కోట్ల మార్కుకి దగ్గరలో ఉందట.

ఇక రిస్క్ అనుకుని ధైర్యం చేసిన శ్యామ్ సింగ రాయ్ కూడా బ్రేక్ ఈవెన్ అందుకోవడం విశేషం. నిన్నా మొన్నా దీనికి స్ట్రాంగ్ రన్ కనిపించింది. నాని ఇమేజ్, కోల్కతా బ్యాక్ డ్రాప్, సాయిపల్లవి కృతి శెట్టిల జోడి ఇవన్నీ కుటుంబ ప్రేక్షకులను థియేటర్లను తీసుకొస్తున్నాయి. ఈ మూడు సినిమాలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బిజినెస్ ని ఎదురీది వచ్చినవే. అయినా కూడా ధైర్యం చేసినందుకు ఇంత స్థాయి కలెక్షన్లు దక్కించుకున్నాయి. ఒకవేళ ఆర్ఆర్ఆర్ డిసెంబర్ లోనే వచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. ఏమైనా రిస్క్ తీసుకుంటేనే రిజల్ట్ తీయగా ఉంటుందనే సత్యాన్ని ముగ్గురు హీరోలు ఋజువు చేశారు

Also Read : Tollywood Movies : ప్రేక్షకుడు ఇంత ఎంటర్ టైన్మెంట్ తట్టుకోగలడా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి