iDreamPost

ఇండియాలో ఈ రైళ్లలో ప్రయాణం ఆలస్యం అయితే మీ డబ్బు వాపస్

ఇండియాలో ఈ రైళ్లలో ప్రయాణం ఆలస్యం అయితే మీ డబ్బు వాపస్

ఇటీవలే ఇండియన్ రైల్వేస్ పబ్లిక్ ప్రయివేట్ (పిపిపి) భాగస్వామ్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన 8 రైళ్లు తమ ప్రయాణికులను సరైన సమయానికి గమ్యస్థానానికి చేర్చలేకపోతే, ప్రయాణికులు డబ్బులు వాపస్ పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ కొత్త విధానం ప్రకారం ముందు నిర్ధేశించిన సమయానికన్నా రైలు గంట ఆలస్యం అయితే 100 రూపాయలు, రెండు గంటలు, అంతకన్నా ఎక్కువ ఆలస్యం అయితే 250 రూపాయలను ప్రతి ప్రయాణికుడికి రీ ఫండ్ చేస్తారు. ప్రయాణికులకు డబ్బులను రి ఫండ్ చేసే బాధ్యతను ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) నిర్వహిస్తుంది.

ఇదేసమయంలో పబ్లిక్ ప్రయివేట్ (పిపిపి) భాగస్వామ్యంలో కొత్తగా ప్రవేశపెట్టనున్నఈ రైళ్లలో ప్రయాణించనున్న తమ ప్రయాణికులకు విమానయాన ప్రయాణం తరహా సౌకర్యాలు కల్పించనుంది. దీనిలో భాగంగా టికెట్స్ జారీచేయడం దగ్గరనుండి పార్సిల్ సర్వీస్, కేటరింగ్, హౌస్ కీపింగ్ మొదలైన సేవలన్నింటిని ప్రయివేట్ బాగస్వామ్యంలోనే నిర్వహించనున్నారు. కొత్తగా ప్రవేశపెట్టనున్న ఈ పబ్లిక్ ప్రయివేట్ (పిపిపి) భాగస్వామ్యంలోని రైళ్లలో ప్రయాణికులకు అనేక దేశాలకు చెందిన ఆహారంతో పాటు ఆప్రాంతంలో పేరుపొందిన స్థానిక వంటకాలను ప్రయాణికులకు అందించబోతున్నారు. అదేవిధంగా ప్రయాణికులకు ఆటోమేటెడ్ కూల్డ్రింక్ వెండింగ్ మిషన్ లు అందుబాటులో ఉంచనున్నారు. వీటితో పాటు విమాన ప్రయాణంలో ఉన్న విధంగా ప్రయాణికులు తమ లగేజ్ తీసుకెళ్లడానికి ట్రాలీలను కూడా అందుబాటులో ఉంచనున్నారు. అదేవిధంగా ప్రయాణికులకు ఏవైనా సేవలు పొందాలంటే ప్రత్యేక కాల్ బటన్స్ ఏర్పాటు చేస్తున్నారు.ఇప్పటివరకు ఇలాంటి సర్వీసులు ప్రస్తుతం రాజధాని వంటి ట్రైన్స్ లో ఫస్ట్ ఏసీ ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ప్రయాణికుల సౌకర్యార్ధం అనేక ప్రత్యేక సౌకర్యాలను కూడా కల్పించబోతున్నారు.

విమానయానం తరహాలో రైలు ప్రయాణంలో కూడా ఇలాంటి సౌకర్యాలు కల్పించడాన్ని ప్రయాణికులు స్వాగతిస్తున్నప్పటికీ టికెట్ ధరలు కూడా సమంజసంగా ఉండాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. ప్రయాణికులకు అందుబాటులో టికెట్ ధరలు లేకపోతె ప్రజలనుండి సరైన స్పందన లభించడం కష్టమేనని సీనియర్ రైల్వే అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఇండియన్ రైల్వే పబ్లిక్ ప్రయివేట్ భాగస్వామ్యంలో ప్రవేశపెట్టిన ఈ నూతన విధానం విజయవంతం అవుతుందా ?? ఈ తరహా సర్వీసులకు ప్రయాణికులనుండి మంచి స్పందన లభిస్తుందో లేదో చూడాలంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి