iDreamPost

థియేటర్ గేట్ కీపర్ స్టారయ్యాడు – Nostalgia

థియేటర్ గేట్ కీపర్ స్టారయ్యాడు – Nostalgia

సినిమా పరిశ్రమలోని కొందరు తారల వెనుక కథలు చాలా ఆసక్తికరంగానూ స్ఫూర్తి రగిలించే విధంగానూ ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. సాధారణంగా డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాననో లేదా ఇంకేదో వృత్తిలో స్థిరపడబోయి హీరో అయ్యాననో చెప్పడం చూశాం. కాని థియేటర్లో గుమ్మం దగ్గర టికెట్లు చింపి ప్రేక్షకులను లోపలికి పంపించే వ్యక్తి స్టార్ అవుతాడని అందులోనే అతని సినిమా ఏడాది ఆడుతుందని ఎవరైనా ఊహిస్తారా. ఇది ఆ కథే.

1970 ప్రాంతంలో తమిళనాడులోని మధురకు దగ్గరలో మేలూర్ అనే చిన్న గ్రామంలో ఓ టూరింగ్ టాకీస్ ఉండేది. అక్కడ గేటు కీపర్ గా ఉండేవాడు కుమరేశన్. చేసేది చిన్న ఉద్యోగమైనా హీరో కావాలనే లక్ష్యంతో శరీరం మీద శ్రద్ధ వహించేవాడు. హాల్ లోపల కేకలు విజిల్స్ వినిపించినప్పుడంతా పరిగెత్తుకుంటూ వెళ్లి తాను ఎంజిఆర్, శివాజీ గణేషన్ లా కావాలని కలలు కనేవాడు.

అలా పైసా పైసా సంపాదించిన డబ్బుతో ఓ మంచి రోజు చూసి మదరాసు వెళ్ళిపోయాడు. స్టూడియోలు, దర్శక నిర్మాతల ఇళ్ళు ఒకటా రెండా పిచ్చోడిలా అవకాశాల కోసం తిరిగాడు. ఆఖరికి 1977లో మొదటి సినిమా ఛాన్స్ వచ్చింది. రామరాజన్ గా పేరు మార్చుకున్నాడు. అక్కడి నుంచి కెరీర్ మెల్లగా ఊపందుకుంటూ చిన్న సినిమాల ఆఫర్లు రావడం ప్రారంభించాయి. చిన్న వేషాలతో మొదలుపెట్టి ఆపై దర్శకుడిగా ఎదిగి గుర్తింపు తెచ్చుకున్నాడు.

1989లో వచ్చిన కరగట్టగారన్ ఇతని జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. రజని కమల్ లాంటి హీరోల పోటీని తట్టుకుని ఈ సినిమా చెన్నై మదురైలో ఏడాది ఆడింది. తెలుగులో గరగట్ట గోపయ్యగా డబ్బింగ్ చేస్తే ఇక్కడా హిట్టయ్యింది. ఇతనికి మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్. వసూల్ రాజా అని పిలుచుకునేవారు అభిమానులు. బిసి సెంటర్స్ లో రూపాయికి మూడు రూపాయలు లాభం ఇచ్చేవి ఆ సినిమాలు. కాని తర్వాత మెల్లగా స్టార్ డం తగ్గిపోయి వరస పరాజయాలు పలకరించడంతో రాజకీయాల్లోకి వెళ్లి ఎంపి స్థాయి దాకా ఎదిగారు. 2012లో మీదై అనే సినిమా తర్వాత మళ్ళి తెరమీద కనిపించలేదు. ఇలా జీవితం ఎక్కడికి వెళ్తుందో అర్థం కాని ఒక స్టేజి నుంచి ఇంత గొప్ప స్థాయికి ఎదిగిన రామరాజన్ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి