iDreamPost

నదీ జలాల వివాదం: నేడు కృష్ణా బోర్డు…రేపు గోదావరి బోర్డు భేటీ

నదీ జలాల వివాదం: నేడు కృష్ణా బోర్డు…రేపు గోదావరి బోర్డు భేటీ

నదీ జలాల వివాదంపై సంబంధిత బోర్డులు సమావేశం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నదీ జలాల వివాదం రాష్ట్ర విభజన నుంచి జరుగుతుంది. వివిధ సందర్భాల్లో ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది. అయితే ప్రస్తుతం సంప్రదింపులు ద్వారా నదీ జలాల వివాదానికి తాత్కాలిక ముగింపు జరుగుతుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నదీ జలాల వివాదంపై గతంలోనే సమావేశమై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశమై నదీ జలాల వివాదాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించారు.

ఈ నేపథ్యంలో నేడు (గురువారం) కృష్ణానదీ యాజమాన్య బోర్డు 12వ సమావేశం బోర్డు నూతన ఛైర్మన్ పరమేశం అధ్యక్షతన హైదరాబాద్ జలసౌథలో జరగనుంది. ఈ సమావేశాలకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖల అధికారులను హాజరుకాల్సిందిగా కృష్ణాబోర్డు ఇప్పటికే సమాచారం అందించింది. ఈ సమావేశానికి తెలంగాణ నుండి నీటి పారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ పాల్గొంటారు.

ఆంధ్రప్రదేశ్ నుండి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డితో పాటు బోర్టు సభ్య కార్యదర్శి మువాంతాంగ్, ఇతర సభ్యులు, ఇంజనీర్లు పాల్గొనున్నారు.

రెండు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యాయి. అధికారులు, ఇంజనీర్లకు ముఖ్యమంత్రులు దిశానిర్ధేశం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విషయంలో వాదనలు బలంగా వినిపించాలని అధికారులు, ఇంజనీర్లను  తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి ఆధారాలు ఇవ్వాలని సూచించారు.

మరోవైపు గోదావరి నదీ యాజమాన్య బోర్డు తొమ్మిదో సమావేశం కూడా రేపు (శుక్రవారం) జరగనుంది. రెండు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదుల్లోని ప్రాజెక్టుల డిపిఆర్ లు, పెద్దవాగు ఆధునీకరణ, టెలిమెట్రీ ఏర్పాటు సహా ఇతర పాలనా పరమైన అంశాలను సమావేశ ఎజెండాలో పొందుపర్చారు. ఈ సమావేశాల తరువాతైనా నదీ జలాల వివాదానికి పరిష్కారం దొరుకుతుందేమో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి