iDreamPost

ప్రింట్ మీడియా సంక్షోభంలో పడిపోతోంది… కేంద్రమే ఆదుకోవాలి

ప్రింట్ మీడియా సంక్షోభంలో పడిపోతోంది…  కేంద్రమే ఆదుకోవాలి

కరోనా వైరస్ దెబ్బకు కుదేలైన ప్రింట్ మీడియాను కేంద్రప్రభుత్వమే ఆదుకోవాలంటూ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటి (ఐఎన్ఎస్) విజ్ఞప్తి చేసింది. కరోనా దెబ్బకు ప్రింట్ + ఎలక్ట్రానిక్ మీడియా పూర్తిగా కుదేలైన విషయం అందరికీ తెలిసిందే. మీడియా ప్రధాన ఆదాయ వనరైన ప్రకటనలు తగ్గిపోవంటతో మీడియా ఆదాయం దాదాపు పడిపోయినట్లే లెక్క. అందుకనే మీడియా యాజమాన్యాలు ఖర్చును తగ్గించుకోవటంలో భాగంగా స్టాఫ్ ను తగ్గించుకుంటున్నాయి.

ఇదే విషయాన్ని ఐఎన్ఎస్ కేంద్ర సమాచార ప్రసారాల శాఖ కు లేఖలో చెప్పింది. ఆదాయాలు పడిపోయి, ముడిసరుకుల ధరలు పెరిగిపోవటంతో పాటు విదేశాల నుండి తెప్పించుకుంటున్న న్యూస్ ప్రింట్ ను ట్యాక్స్ కూడా పెరిగిపోయిందని గోల పెట్టింది. అందుకే న్యూస్ ప్రింట్ పై ఉన్న 5 శాతం కస్టమ్స్ ట్యాక్స్, ముడిసరుకులపై ట్యాక్సులను ఎత్తేయాలని కోరింది. అలాగే యాడ్స్ తాలూకు బకాయిలను కూడా రాష్ట్రప్రభుత్వాల నుండి వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది.

అదే సమయంలో బివోసీ ప్రకటనల రేటును 50 శాతం, ప్రింట్ మీడియా బడ్జెట్ ను 100 శాతం పెంచాలని కూడా కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసింది. వైరస్ కారణంగా వ్యాపార సంస్దలు, పరిశ్రమలు తదితరాలు మూడపడిపోవటంతో మీడియాకు యాడ్స్ రావటం లేదని గుర్తుచేసింది. ప్రస్తుత సంక్షోభానికి చిన్న, మధ్యస్ధాయి పత్రికలు ఇప్పటికే మూత పడితే పెద్ద పత్రికలు కూడా సంక్షోభంలో పడిన విషయాన్ని వివరించింది.

ఒకవేళ పెద్ద పత్రికలు కూడా మూతపడిపోతే దేశంలో తయారయ్యే న్యూస్ ప్రింట్ పరిశ్రమలపైనే ప్రభావం పడుతుందని హెచ్చరించింది. మీడియా మీద ఆధారపడిన పరిశ్రమలు, ఉద్యోగులు సంక్షోభంలో పడకూడదంటే వెంటనే కేంద్రం మీడియా రంగాన్ని ఆదుకోవాలని ఐఎన్ఎస్ తన లేఖలో రిక్వెస్ట్ చేసింది. మరి కేంద్రప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి