iDreamPost

మన స్టార్ హీరోల తక్షణ కర్తవ్యం

మన స్టార్ హీరోల తక్షణ కర్తవ్యం

ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి హీరోలు ఏడాదికి పది నుంచి పదిహేను సినిమాలు విడుదల చేసిన ట్రాక్ రికార్డు ఉండేది. కనీసం నెలకో రెండు నెలలకో సినిమా వచ్చేలా పక్కా ప్లానింగ్ తో ఉండేవాళ్ళు. దానికి తోడు వీళ్ళ డెడికేషన్ కూడా అదే స్థాయిలో ఉండేది. పగలు రేయి తేడా లేకుండా షూటింగే ప్రపంచంలా భావించి దానికే జీవితాన్ని అంకితం చేసేవాళ్ళు. పర్సనల్ గా టైం చాలా తక్కువగా ఉండేది. కథ కొంచెం నచ్చినా చాలు ఎక్కువ బుర్ర చెడగొట్టుకోకుండా సెట్స్ మీదకు వెళ్ళేవాళ్ళు.

దర్శకులు సైతం ఇదే కమిట్మెంట్ తో వేగంగా సినిమాలు పూర్తి చేసేందుకు దోహదపడే వాళ్ళు. చిరంజీవి 150, బాలకృష్ణ 104, నాగార్జున 90+, వెంకటేష్ 70+ చేయడానికి ఇవే కారణాలు. దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, రాఘవేంద్ర రావు లాంటి డైరెక్టర్లు సెంచరీలు అందుకే దాటగలిగారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం ఊపిరి సలపనంత బిజీగా ఉండేవాళ్ళు. కాల్ షీట్స్ సర్దడం అంటే అదో పెద్ద సవాల్ గా ఉండేది. విడుదల తేది కోసం ధియేటర్లను లాక్ చేసుకోవడం కోసం విపరీతమైన పోటీ కనిపించేది. అయినా కూడా సర్దుబాట్లతో ఎలాగోలా అందరి సినిమాలు జనం ముందుకు వచ్చేవి. కాని ఇప్పుడు దీనికి పూర్తి విరుద్ధమైన పరిస్థితి నెలకొంది

మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఏడాదికి ఒకటి చేయడమే మహా కష్టమైపోతోంది. ఒక్క ఫ్లాప్ వచ్చిన కారణంగా అల్లు అర్జున్ ఏకంగా ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్నాడు. ఇక బాహుబలి మొదలుకుని ప్రభాస్ ప్రతి సినిమాకు మినిమమ్ రెండేళ్లు పడుతోంది. దానికి తోడు పాన్ ఇండియా బడ్జెట్ పేరుతో ఎక్కువ టైం తీసుకోవడం ప్రభావం చూపుతోంది. ఇక నితిన్ లాంటి మీడియం రేంజ్ హీరోలు కూడా రిస్క్ కు భయపడి గ్యాప్ తీసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తున్నా మార్కెట్ పరంగా ఇది ప్రోత్సహించే ట్రెండ్ కాదు.

ఒక్క నానినే సంవత్సరానికి రెండు లేదా మూడు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఏడాదిలో పన్నెండు నెలలు థియేటర్లు ఫీడింగ్ లో ఉండాలంటే మన స్టార్లు రెమ్యునరేషన్లు కాదు చేస్తున్న సినిమాల నెంబర్లు పెంచాలి. నెలకు ఒకటో రెండో పెద్ద సినిమా ఆడితే మిగిలిన రోజులను చిన్న సినిమాలు వాడుకుంటూ బాలన్స్ చేస్తాయి. ఆర్ఆర్ఆర్ లాంటి ప్రాజెక్టులు ఎలాగూ ఎక్కువ టైం డిమాండ్ చేస్తున్నాయి. కనీసం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకైనా గ్యాప్ తగ్గించి కౌంట్ పెంచే దిశగా హీరోలు ఆలోచిస్తే ఎక్కువ రోజులు థియేటర్లు జనంతో కళకళలాడుతూ కనిపిస్తాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి