iDreamPost

40 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడి.. మృత్యు ఒడికి చేరిన డ్రైవర్

40 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడి.. మృత్యు ఒడికి చేరిన డ్రైవర్

మనిషి జీవితం తామరాకుపైన నీటి బొట్టులాంటిది. ఎప్పుడు పుడతామో అంచనా వేయచ్చునేమో కానీ ఎప్పుడు చనిపోతామో చెప్పలేం. రెప్పపాటు జీవితంలో ఏదో చేసేయాలని తపన పడిపోతుంటాం. ఇప్పుడు అయితే పరిస్థితులు చాలా భిన్నంగా మారాయి. ఆహారపు శైలి, ఇతర అలవాట్ల వల్ల కరోనా అనంతరం మానవుడి జీవనంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. కారణం ఉపద్రవంలా వస్తున్న గుండెపోటు మరణాలు. ఇటీవల కాలంలో చిన్న వయస్సులోనే హార్ట్ స్ట్రోక్ కు గురై చనిపోతున్నారు. పెద్ద వాళ్లల్లో కూడా దీని బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని వ్యక్తులు గుండె పోటుతో చనిపోవడం వెనుక సరైన కారణాలను కూడా వైద్యులు చెప్పలేకపోతున్నారు.

తాజాగా ఓ స్కూల్ బస్సు నడుపుతున్న డ్రైవర్ ఛాతీలో నొప్పికి గురయ్యాడు. అదే సమయంలో తన చేతిలో 40 మంది చిన్నారుల ప్రాణం ఉందని గ్రహించి.. చాకచక్యంగా వ్యవహరించి.. వారిని రక్షించి.. అతడు తనువు చాలించాడు. ఈ ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. అద్దంకిలోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఏడుకొండలు.. మైలవరం, ఉప్పలపాడు, వెంపరాల గ్రామాల నుండి పిల్లల్ని స్కూల్ వ్యానులో ఎక్కించుకుని వస్తున్నాడు. బస్సు ఉప్పలపాడు దాటగానే.. ఏడుకొండలు గుండె పోటుకు గురయ్యాడు. వెంటనే బస్సులో ఉన్న పిల్లల్ని చూసి.. వాహనాన్ని పక్కగా నిలిపివేసి, సీటులోనే కుప్పకూలాడు. కాగా, స్థానికులు బస్సు ఆగడం చూసి.. వెళ్లి చూడగా.. అప్పటికే చనిపోయాడు. అధికారులు వచ్చి పరిశీలించి.. పిల్లల్ని మరో స్కూల్ వ్యానులో అద్దంకికి పంపించేశారు. బస్సులో 40 మంది విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని, అతడు వ్యవహరించిన తీరును చూసి అందరూ అభినందిస్తున్నారు. అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి