iDreamPost

రైతు ఆందోళనలపై తీవ్రవాదుల ముద్ర !

రైతు ఆందోళనలపై తీవ్రవాదుల ముద్ర !

నూతన వ్యసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన కేంద్రానికి తలనొప్పిగా మారింది. కేంద్ర ప్రభుత్వంగా తీసుకు వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు బహుళజాతి సంస్థలకే మేలు చేస్తాయని, వ్యవసాయ రంగంపై కంపెనీల పెత్తనం పెరుగుతుందని రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు మూడు నెలలుగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఛలో ఢిల్లీ కార్యక్రమంతో ఈ రైతు ఆందోళన దేశ వ్యాప్త ఉద్యమంగా మారింది. ఇప్పటికే పలుమార్లు రైతు సంఘాలతో చర్చించిన కేంద్రం ఎలాంటి సత్ఫలితాలనూ సాధించలేకపోయింది. మరోవైపు రైతు ఉద్యమానికి దేశ, విదేశాల నుంచి రోజు రోజుకూ మద్దతు పెరుగుతోంది.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు అన్ని వర్గాల నుంచీ మద్దతు లభిస్తోంది. డిసెంబర్ 8వ తేదీన రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ కు ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు, సంస్థలు సంఘీభావాన్ని ప్రకటించాయి. భారత్ బంద్ ను విజయవంతం చేయడానికి ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనడానికి ప్రతిపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం రైతులు 12 రోజులుగా ఢిల్లీ సరిహద్దులో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యక్షంగా రైతులను కలిసి వారికి మద్దతు ప్రకటించారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సైతం రైతుల కోసం గళం విప్పారు. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సైతం రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సైతం రైతులకు అండగా నిలుస్తామంటోంది.

వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు మేలు జరుగుతుందంటున్న బీజేపీ వాదనతో రైతులు ఏకీభవించడం లేదు. ఈ నేపథ్యంలో రైతులం ఆందోళనలపై పలువురు బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి రైతు ఆందోళనలో ఖలిస్తాన్ తీవ్రవాదులు ఉన్నారని ఆరోపించారు. బీజేపీకి అనధికార ప్రతినిధులుగా వ్యవహరించే సినీ నటి కంగనా రనౌత్ సైతం రైతులను విచ్ఛిన కారులు, దేశ ద్రోహులతో పోల్చింది. ఆందోళనలో పాల్గొంటున్న రైతులను అద్దె మనుషులుగా వ్యాఖ్యానించింది. పలువురు బీజేపీ నేతలు రైతుల ఉద్యమంలో పాల్గొంటున్న వారిలో సీఏఏని వ్యతిరేకించిన వాళ్లున్నారంటూ ఆరోపించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా పలువురు క్రీడాకారులు అవార్డులను వెనక్కి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అవార్డులు వెనక్కిఇవ్వడానికి రాష్ట్రపతి భవన్ కు బయలుదేరిన క్రీడాకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లండన్ లోనూ రైతులకు మద్దతుగా వేలాది మంది వీథుల్లోకి వచ్చిన నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు.

ఢిల్లీలో ఎన్ కౌంటర్

ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోన్న రైతు ఉద్యమం వెనక తీవ్రవాదులున్నారనే వాదనను అధికార పార్టీ ముందుకు తెస్తోంది. రాజధాని సరిహద్దుల్లో ఓవైపు రైతుల ఆందోళన కొనసాగుతుండగానే ఢిల్లీలోని షాకార్‌పూర్‌ ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ సందర్బంగా ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారిని పంజాబ్, కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్న పోలీసులు వారికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. కార్పోరేట్ కంపెనీల దోపిడీకి వ్యతిరేకంగా, వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన ఎన్ కౌంటర్ చర్చనీయాంశంగా మారింది.

రాజకీయ లబ్ధి కోసం?

రైతుల ఆందోళన పట్ల కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ పార్టీలు తమ ఉనికిని కాపాడుకునేందుకు రైతు ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుంటున్నాయని విమర్శించారు. సీఏఏ, షాహీన్ బాగ్ లాంటి అన్ని ఆందోళనల్లో ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి అవకాశవాద వైఖరినే అవలంభించాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల విషయంలో ధ్వంధ వైఖరి అవలంభిస్తోందన్నారు. మరోవైపు…. రైతు నేతల ఆందోళన వెనక రహస్య ఎజెండా ఉందని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. రైతు సంఘాలు ప్రతిపాధించిన డిమాండ్లలో బుద్ధిజీవులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలపై మోపిన కేసులను ఎత్తివేసి వారిని జైళ్ల నుంచి విడుదల చేయాలనే డిమాండ్ కూడా ఉందంటున్నాయి. జైళ్లలో ఉన్న అర్బన్ నక్సల్స్, సీఏఏ వ్యతిరేక ఆందోళనలో అరెస్టయిన విద్యార్థుల విడుదలకు రైతుల ఆందోళకు ఏంటి సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అటు తిరిగీ ఇటు తిరిగీ రైతు ఉద్యమంపై తీవ్రవాద ముద్ర వేసే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతున్నట్లు అర్థమవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి