iDreamPost

కాకినాడ చుట్టూ టీడీపీ “మడ”త రాజకీయాలు

కాకినాడ చుట్టూ టీడీపీ “మడ”త రాజకీయాలు

కాదేదీ కవికనర్హం అన్నారు గానీ చంద్రబాబు మాత్రం కాదేదీ రాజకీయాలకు అనర్హం అంటున్నారు. అందులోనూ కరోనా వేళ కూడా ఆయన ప్రయత్నాలకు హద్దూపద్దూ లేదు. అందుకోసం ఎంతకైనా తెగించేందుకు వెనకాడడం లేదు. తాజాగా టీడీపీ నేతల కన్ను కాకినాడ సమీపంలోని మడ అడవుల మీద మళ్లింది. పేదలకు ఇళ్లస్థలాలు కేటాయించడం సహించలేని విపక్షం మడత రాజకీయాలకు దిగింది.

టీడీపీ నేతల వ్యాఖ్యలు చూస్తే అంతా ముక్కున వేలేసుకోవాల్సి ఉంటుంది. మడ అడవులు నరికేస్తారా.. చెట్లు నరికేసి పర్యావరణం దెబ్బతీస్తారా.. అడవులను నాశనం చేస్తారా.. కాకినాడను సమస్యల్లోకి నెట్టేస్తారా..మత్స్యకారుల జీవనం దెబ్బతీస్తారా. ఇలా ఉన్నాయి వారి వాదనలు, వ్యాఖ్యలు. ఇందులో ఒక్కోటి చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మడ అడవులు నరికేస్తారా అనేది ప్రశ్న. అసలు ప్రస్తుతం కాకినాడ కార్పోరేషన్ పరిధిలోని పోర్ట్ భూముల్లో 101 ఎకరాలను పేదల ఇళ్లస్థలాలకు కేటాయించారు. కాకినాడ నగరానికి చెందిన 25వేల కుటుంబాలకు శాశ్వత నివాస యోగ్యం దక్కబోతోంది. ఆ క్రమంలో అడవులు నరికేస్తారా అనేది టీడీపీ ప్రశ్న అయితే దానికి జనసేన వంతపాడుతోంది. కానీ వాస్తవం ఏమంటే పోర్టు భూములకు, మడ అడవులకు సంబంధమే లేదు. అందులోనూ సుమారుగా ఏడెనిమిది కిలోమీటర్ల దూరం కూడా ఉంది.

ఇక అడవులు నరికేయడానికి మడ అడవులు అనేవి మామూలు అడవుల మాదిరి పెద్ద పెద్ద చెట్లుతో కూడుకున్నవి కాదు. నిత్యం బురదలో ఉండే చెట్లు. చివరకు కాండం ప్రాంతం తక్కువగా ఉండడంతో వేళ్ల ద్వారా గాలి పీల్చుకునే జీవించే వృక్షజాతులు అవి. అలాంటి చెట్లను నరకడం ఏంటి..అడవులు నాశనం చేయడం ఏంటి. అసలు టీడీపీ నేతలకు వాస్తవం పట్టదా అనే ప్రశ్న ఉదయించవచ్చు. కానీ వారికి వాస్తవం తెలిసినా వక్రీకరణలకు అలవాటు పడి, ఏ కొందరయినా విశ్వసిస్తారనే అతి విశ్వాసం కాబోలు అన్నట్టుగా ఉంది. దానికి కొనసాగింపుగా మిగిలిన ప్రశ్నలు పరిశీలిస్తే కాకినాడను సమస్యల్లోకి నెట్టేస్తున్నారట. అసలు కాకినాడలో ఖాళీ స్తలాలను పూర్తిగా ఆక్రమించేసేసి, నగరంలో పేదలకు నివసించేందుకు గజం భూమి కూడా మిగల్చని టీడీపీ నేతల వల్ల సమస్యలు వచ్చినట్టా..లేక పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే సమస్యలు వచ్చినట్టా అన్నది ఆలోచిస్తే అందరికీ అర్థం అవుతుంది. కానీ టీడీపీ నేతలు మాత్రం తగ్గడం లేదు.

మత్స్యకారుల జీవనం దెబ్బతీస్తున్నారట. నిజానికి ప్రస్తుతం అమలులో ఉన్న వేట విరామ సమయంలో ఇవ్వాల్సిన సహాయం కోసం కూడా నెలల తరబడి ఎదురుచూసేలా చేసి, వారి జీవితాలతో ఆడుకున్న చంద్రబాబు మాత్రం ఉద్దరించినట్టు, మత్స్యకారులు చివరకు గుజరాత్ లో చిక్కుకున్నా సకాలంలో స్పందించడం, వేట విరామ నష్టపరిహారం అందరికీ ఒకేసారి అందించడం ద్వారా జగన్ అన్యాయం చేస్తున్నట్టు టీడీపీ నేతల వ్యాఖ్యానం విస్మయకరం అనిపిస్తోంది. ఇక అన్నింటికీ మించి పర్యావరణం గురించి విపక్ష నేతల వ్యాఖ్యలయితే మరింత శృతిమించి సాగుతున్నాయి. కృష్ణా నదిలో పర్యావరణ నిబంధనలు పాతరేసినందుకు ప్రభుత్వమే 100 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా ఎన్జీటీ ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి ఏపీకి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుది. కానీ ఇప్పుడు సముద్ర తీర నగరంలో ప్రజలకు నివాసం కోసం మిగిలిన ఏకైక స్థలం కాకినాడ పోర్ట్ పరిధిలో ఉంటే, దానిని సేకరించి ప్రజలకు అందించడం మాత్రం పర్యావరణ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం విచిత్రం గాక ఇంకేమనాలి.

వాస్తవానికి అందరికీ ఇళ్ల కోసం జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం మహా యజ్ఞం విపక్ష నేత చంద్రబాబు కి రుచించడం లేదు. అడుగడుగునా దానికి అడ్డుపడే ప్రయత్నంలో ఉన్నారు. ఓ పెద్ద శాశ్వత సమస్యను పరిష్కరించడం ద్వారా రాజకీయంగా భవిష్యత్ లో జగన్ మరింత బలపడే ప్రమాదం ఉందని బాబు భయాందోళనలో ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే భూములు సేకరించడం, పేదలకు పంచేందుకు సిద్ధం చేయడం వంటి ప్రక్రియను సర్వివిధాలా చెడగొట్టేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి కొనసాగింపుగానే కాకినాడ నగరంలో ఉన్న భూములను, ఎక్కడో దూరంగా ఉన్న మడ అడవులకు మూడిపెట్టి, తన మార్క్ రాజకీయాలు చాటుకుంటున్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజలకు జరగాల్సిన న్యాయం నిలిచిపివేశారనే అపప్రద తప్ప, అంతకుమించిన ప్రయోజనం ఉండదనే విషయాన్ని బాబు గ్ర హించడం మంచిదేమో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి