800 ది మూవీ: మురళీధరన్ జీవితంలో ఇన్ని కష్టాలా?

శ్రీలంక దేశానికి క్రికెట్ లో ఎంతో గొప్ప పేరుంది. ఆ పేరులో ఒక క్రికెటర్ కు గొప్ప భాగస్వామ్యం ఉంది. అతను మరెవరో కాదు.. ముత్తయ్య మురళీధరన్. ముత్తయ్య మురళీధరన్ కు ఒక్క శ్రీలంకలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. నిజానికి క్రికెట్ ని అభిమానించే వాళ్లు మురళీధరన్ ని అభిమానించకుండా ఉండలేరేమో? అలాంటి ఒక లెజండరీ క్రికెటర్ జీవిత చరిత్రను ‘800 ది మూవీ’ పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. మరి.. ఆ ట్రైలర్ ఎలా ఉంది? ముత్తయ్య జీవితం గురించి కొత్తగా ఏం చెప్పబోతున్నారో చూద్దాం.

ఈ సినిమాని ‘ఎవరికీ తెలియని ముత్తయ్య మురళీధరన్’ అంటూ తెరకెక్కిస్తున్నారు. ట్రైలర్ ఆద్యంతం ఎంతో భావోద్వేగంగా సాగింది. అంటే ఒక గొప్ప క్రికెటర్ తన జీవితంలో ఇన్ని కష్టాలు పడ్డారా? అనే అనుమానం రాకమానదు. నమ్ముకున్న దేశంలోనే పరాయివాడిలా బతకడం అంటే ఎంత కష్టమో ఈ ట్రైలర్ లో చూడచ్చు. ముత్తయ్య మురళీధరన్ గా మాధుర్ మిట్టల్ ఎంతో బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో బాగా మెప్పించాడు. ఈ ట్రైలర్ లో ముత్తయ్య మురళీ ధరన్ బాల్యం నుంచి శ్రీలంక పౌరసత్వం కోసం పడిన కష్టాలు, క్రికెట్ లో ఎదుర్కొన్న అవమానాలు, సొంత దేశం వారి నుంచి వచ్చిన విమర్శలు ఇలా అన్నీ విషయాలను చూపించారు.

ముఖ్యంగా తన బౌలింగ్ యాక్షన్ పై విదేశీ క్రికెటర్లు చేసిన ఆరోపణలు, అతను చంక్ చేస్తున్నాడు అంటూ చెప్పిన నిజంగా ఈ సినిమా చూశాక ముత్తయ్య మురళీధరన్ జీవితం ఏంటి అనేది అందరికీ తెలుస్తుందేమో? ఈ ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది.. “ఒక తమిళవాడిని టీమ్ లో చేర్చుకోరు అంటున్నారు.. నన్ను నేను ఒక తమిళవాడిగానే నేను కోవడం లేదు నాన్నా.. నేను క్రికెటర్ ని” అని చెప్పిన డైలాగ్ లో క్రికెట్ అంటే మురళీధరన్ ఎంత ప్రాణమో అర్థం చేసుకోవచ్చు. ఒక్క టెస్టుల్లోనే మురళీధరన్ 800 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికీ ఆ రికార్డు దగ్గరికి కూడా ఎవరూ రాలేకపోయారు. అదే రికార్డు పేరుతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ముత్తయ్య మురళీధరన్ అసలు జీవితం ఏంటో క్రికెట్ ప్రపంచానికి తెలుస్తుంది అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రక్షకుల ముందుకు రాబోతోంది. మరి.. 800 ది మూవీ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments