వీడియో: మానస్- అర్జున్ గొడవ.. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ..!

బుల్లితెర అభిమానులకు సీరియల్స్ చేసే నటులు అంటే హీరో- హీరోయిన్లతో సమానం. నెలకు ఒకసారి థియేటర్ కి వెళ్లి చూసే సినిమా కంటే.. రోజూ టీవీలో కనిపించే నటులపైనే ఎక్కువ అభిమానం చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు సీరియల్స్ లో కుర్ర హీరోలు ఎక్కువ మందే ఉన్నారు. ప్రతి ఒక్కరు వారి వారి టాలెంట్ తో బాగా రాణిస్తున్నారు. అలాంటి వారిలో మానస్ నాగులపల్లి, అర్జున్ ముందు వరసలో ఉంటారు. వీళ్లు పలు సీరియల్స్ లో లీడ్ రోల్స్ ప్లే చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. పైగా వీళ్లు ఈవెంట్స్, షోలలో కూడా కనిపిస్తూ సందడి చేస్తుంటారు.

శ్రీదేవీ డ్రామా కంపెనీ వాళ్లు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఒక స్పెషల్ ఎపిసోడ్ షూట్ చేశారు. ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని కూడా విడుదల చేశారు. అందులో మానస్ నాగులపల్లి.. పవన్ కల్యాణ్ గెటప్ లో అలరించాడు. అతను పవన్ కల్యాణ్ ను దాదాపు 90 శాతం దించేశాడంటూ జడ్జ్ ఇంద్రజ కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు. మధ్యలో ఆది తన లవర్ ని కూడా పరిచయం చేశాడు. అయితే ఈ ఎపిసోడ్ థీమ్ ఆది తన ఫోన్ పోతే అక్కడి వాళ్లే తీసుంటారని.. తన ఫోన్ తిరిగి పొందాలి అనే కాన్సెప్ట్ తో తీశారు. అందులో భాగంగా అందరి ఫోన్లను ఒక టేబుల్ మీద పెట్టారు. మొదట రష్మీ ఫోన్ తీసుకుని తన బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పమని చెప్తాడు. ఆ తర్వాత అర్జున్ ఫోన్ వస్తుంది. అప్పుడు మానస్ “ఆ ఫోన్ ఓపెన్ చేస్తే చాలా ఉంటాయి” అంటూ కామెంట్ చేస్తాడు. మానస్ అన్న మాటకు అర్జున్ నవ్వుతూ “పెళ్లైనోడిని నా ఫోన్లో ఎందుకు ఉంటాయి. నీ ఫోన్లోనే చాలా ఉంటాయి” అంటూ రిప్లయ్ ఇస్తాడు.

అర్జున్ అలా అనడంతో మానస్ తన సహనాన్ని కోల్పోతాడు. ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేయద్దు అంటూ సీరియస్ అవుతాడు. అర్జున్ నువ్వు మిగిలిన షోస్ లో కూడా ఇలాంటి కామెంట్స్ చేయలేదా? అలా పంచులు వేయించుకోవడం ఇష్టం లేకపోతే అసలు షోలకు రావొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఈ గ్యాప్ లో మానస్ కూడా అర్జున్ మీదకు సీరియస్ గా వెళ్తాడు. పంచుల పేరుతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడద్దంటూ వార్నింగ్ ఇస్తాడు. ఇద్దరినీ విడదీసేందుకు మిగిలిన వాళ్లు చాలానే ప్రయత్నిస్తారు. మానస్ అయితే అర్జున్ ను తోసేస్తాడు. వీళ్ల గొడవే ఈ ప్రోమోకి హైలెట్ గా నిలిచింది. అయితే ఇలాంటి షోస్ లో ఇలాంటి గొడవలు జరిగినట్లు ప్రోమోలో చూపించడం ఆ తర్వాత తూచ్ అనడం చాలాసార్లే చూశారు. కానీ, ఈసారి గొడవ మాత్రం చాలా రియలిస్టిక్ గా ఉంది. అయితే ఇది నిజంగా నిజమో కాదో తెలియాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ వరకు ఆగాల్సిందే. మరి.. ఆ ప్రోమోపై మీరూ ఓ లుక్కేయండి.

Show comments