హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఏకంగా నెల రోజులపాటు పోలీస్ ఆంక్షలు..

Hyderabad 144 Section: హైదరాబాద్ వాసులకు పోలీస్ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఏకంగా నెల రోజుల పాటు ఆంక్షలు విధించింది. ఎప్పటి వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయంటే?

Hyderabad 144 Section: హైదరాబాద్ వాసులకు పోలీస్ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఏకంగా నెల రోజుల పాటు ఆంక్షలు విధించింది. ఎప్పటి వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయంటే?

హైదరాబాద్ లో ఇటీవల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దేవీ శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా నాంపల్లిలో ఏర్పాటు చేసిన దుర్గా దేవీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఇది మరువక ముందే సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని ఓ వర్గం వ్యక్తి ధ్వంసం చేశాడు. దీంతో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. నగర ప్రజల నిరసనలతో ఆ ప్రాంతమంతా అట్టుడికిపోయింది. దీనికి తోడు గత కొన్నిరోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని నిరసనలు చేపట్టారు.

ఈ క్రమంలో తెలంగాణ సెక్రటేరియట్ ముందు పోలీస్ కుటుంబాలు ఆందోళన చేపట్టారు. భార్యలు ధర్నా చేస్తే వారి భర్తలను సస్పెండ్ చేశారు. దీంతో అసలు నగరంలో ఏం జరుగుతుందో తెలియక నగరవాసులు అయోమయానికి గురవుతున్నారు. ఎప్పుడు ఏ సమస్య తలెత్తుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. విమర్శలు, ప్రతివిమర్శలతో యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నది. ఈనేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఈ ఆంక్షలు ఉండనున్నట్టు తెలిపారు.

ఏకంగా నెల రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో ఎటువంటి సమావేశాలు, ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, ఆందోళనకు అనుమతి లేదని చెప్పారు. పోలీసుల ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ఆ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా సహకరించాలని కోరారు. మరోవైపు బీఆర్ఎస్ నేత బంధువు ఫాం హౌస్ లో విదేశీ మద్యం పట్టుబడడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ లీడర్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం అందిందని, ఈ నేపథ్యంలో ఆంక్షలు విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అక్టోబర్ 28 నుంచి నవంబర్‌ 28 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 163 కింద ఆంక్షలు విధించినట్లు పోలీసులు వెల్లడించారు.

Show comments