Yashasvi Jaiswal: ఇంట్లో నుంచి పారిపోయి.. టీమిండియాకు హీరో అయ్యాడు! ది జైస్వాల్‌ స్టోరీ

యశస్వి జైస్వాల్‌.. ప్రస్తుతం భారత క్రికెట్‌ వర్గాల్లో మారుమోగిపోతున్న పేరు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో డబుల్‌ సెంచరీతో ఇండియాను ఆదుకున్న ఈ యువ ఓపెనర్‌.. జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఎందరికో స్ఫూర్తినిచ్చే అతని గతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

యశస్వి జైస్వాల్‌.. ప్రస్తుతం భారత క్రికెట్‌ వర్గాల్లో మారుమోగిపోతున్న పేరు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో డబుల్‌ సెంచరీతో ఇండియాను ఆదుకున్న ఈ యువ ఓపెనర్‌.. జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఎందరికో స్ఫూర్తినిచ్చే అతని గతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

చిన్నతనంలో ఇంట్లో నుంచి పారిపోయిన పిల్లలు.. ఎక్కువగా చెడు మార్గాలనే ఎంచుకుంటారు. కానీ, బలమైన సంకల్పం, సాధించాలనే గట్టి పట్టుదల ఉంటే.. యశస్వి జైస్వాల్‌లా దేశం గర్వించే ఆటగాళ్లు కూడా అవుతారు. ప్రస్తుతం జైస్వాల్‌ పేరు ఇండియన్‌ క్రికెట్‌లో మారుమోగిపోతుంది. విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లు విఫలమైనా.. జైస్వాల్‌ ఒక్కడే డబుల్‌ సెంచరీతో చెలరేగి హీరోగా మారాడు. నిండు చంద్రుడు ఒకవైపు.. చుక్కలు ఒకవైపు అన్నట్లు.. జట్టు మొత్తం ఒకవైపు తానొక్కడే ఒక వైపు అన్నట్లుగా.. 209 పరుగులతో అదరగొట్టాడు. ఇప్పుడు రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో సెంచరీతో చెలరేగాడు. ఇలా ప్రస్తుతం ఇండియాన్‌ క్రికెట్‌లో టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా మారిపోయాడు. అయితే.. జైస్వాల్‌ ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. అతని స్టోరీ వింటే కళ్ల వెంట నీళ్లు రావడం పక్కా..

ఉత్తరప్రదేశ్‌లో పుట్టిన జైస్వాల్‌కు క్రికెట్‌ అంటే పిచ్చిప్రేమ. ఎప్పటికైనా గొప్ప క్రికెటర్‌ అవ్వాలని చిన్నతనం నుంచే కలలు కన్నాడు. అయితే.. క్రికెటర్‌ అవ్వాలంటే.. ఇక్కడ ఉంటే కాదని, ముంబై వెళ్లాల్సిందే అంటూ అతని స్నేహితులు చెప్పిన మాటలు జైస్వాల్‌ మనసులో నాటుకుపోయాయి. దాంతో.. ఇంట్లోని ఎవరికి చెప్పకుండా ముంబై పారిపోయాడు జైస్వాల్‌. అక్కడి నుంచి జైస్వాల్‌ జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. ఎక్కడుండాలో తెలియదు, చేతిలో డబ్బులేదు.. కానీ క్రికెట్‌ ఆడాలి. ఈ ఒక్క ఆలోచనే జైస్వాల్‌ను అనేక కష్టాలు భరించే శక్తిని ఇచ్చింది. ముంబై వచ్చిన కొన్ని రోజులకు ఇంటికి ఫోన్‌ చేసి, క్రికెటర్‌ అవ్వడం కోసం వచ్చానని, ఇక్కడంతా బాగానే ఉందని అబద్ధం చెప్పేవాడు. ఆకలి కడుపుతో ఉంటూనే.. ఇప్పుడే తిన్నానంటూ తల్లితో చెప్పేవాడు.

క్రికెట్‌ ప్రాక్టీస్‌తో పాటు.. పొట్టకూటి కోసం డెయిరీ ఉత్పత్తులు విక్రయించే షాపులో రాత్రి పూట పనిచేసే వాడు. ముంబైలోని ప్రపంచ ప్రఖ్యాత అజాద్ మైదానంలో రోజంతా క్రికెట్ ప్రాక్టీస్ చేసి.. అలసిపోయి పనిపై దృష్టిపెట్టలేకపోవడంతో ఆ డెయిరీ షాపు యజమాని జైస్వాల్‌ను పనిలో నుంచి తీసేశాడు. ‘కనీసం ఈ రాత్రికి నన్ను ఇక్కడ పడుకోనివ్వండి’ అంటూ జైస్వాల్‌ అతన్ని వేడుకున్నాడు. గుండెల్ని పిండేసే ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి జైస్వాల్‌ జీవితంలో. అయితే.. ఆ మరుసటి రోజు తన కోచ్‌కు ఫోన్‌ చేసి.. జరిగిన విషయం చెప్పడంతో ఆయన తన ఇంటికి పిలిపించుకున్నారు. అక్కడే ఓ రెండు మూడు నెలలు ఉన్నాడు జైస్వాల్‌. ఆ తర్వాత క్రికెట్ క్లబ్‌లో గ్రౌండ్‌మెన్‌తో కలిసి ఉండే అవకాశం వచ్చింది.

తమతో పాటు టెంట్‌లో ఉండాలంటే స్కోర్‌ వేయాలి అని వారు కండీషన్‌ పెట్టారు. ఇక్కడే ఉంటే పొద్దున్నే లేచి ప్రాక్టీస్ చేసుకుంటూ.. స్కోర్ వేయడం, అంపైరింగ్ చేయడం అంతా క్రికెట్‌తోనే ముడిపడి ఉండటంతో పాటు కొంత డబ్బు కూడా వస్తుందని జైస్వాల్‌ సరేనని వారితో ఉండిపోయాడు. అయితే.. తన సంపాదన పెంచుకోవడం కోసం పండుగల సమయంలో జైస్వాల్‌ వీధుల్లో తినుబండారాలు అమ్మేవాడు. కానీ, క్రికెటర్‌గా ఎదగాలంటే.. దృఢమైన శరీరం కావాలి. దాని కోసం మంచి తిండి తినాలి. కానీ, జైస్వాల్‌కు ప్రొటీన్స్‌ ఉన్న ఆహారం కొని తినేంత స్థోమత లేదు. దాంతో.. అన్నం, పిండి, బంగాళదుంపలే తినేవాడు.. వారానికి ఒక్క రోజు మాత్రం చికెన్ తినేవాడు. అలా చికెన్‌ తీనేందుకు ఆదివారం కోసం ఎదురు చూసేవాడు.

కొన్ని సార్లు రాత్రి పూట భోజనం లేక.. పస్తులు పడుకునేవాడు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో అమ్మ గుర్తొచ్చి జైస్వాల్‌ చాలా సార్లు ఒక్కడే కూర్చోని ఏడ్చేవాడు. 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తల్లిని గట్టిగా వాటేసుకోవాలని ఎన్నో సార్లు అనిపించినా.. భావోద్వేగాలు బలహీనతలుగా మారుతాయని ఆ ఆలోచనలను మానుకునేవాడు. తాను పడుతున్న కష్టాల గురించి ఇంట్లో వాళ్లకి చెప్పేవాడు కాదు. అలా చెబితే వాళ్లు తిరిగి వచ్చేయమంటారనే భయం ఉండేది. తిండికోసం ఇన్ని తిప్పలు పడుతున్నా.. ఒక్కసారి గ్రౌండ్‌లో బ్యాట్‌ పట్టుకుని దిగితే అన్ని మర్చిపోయేవాడు.. అజాద్ మైదాన్‌లో తన కంటే పెద్దవాళ్లు, సీనియర్లు బౌలింగ్ చేస్తుంటే చాలా ఈజీగా ఆడేవాడు జైస్వాల్‌. అలా అద్భుతంగా ఆడుతున్న జైస్వాల్‌.. జ్వాలా సింగ్ అనే కోచ్‌ కంట్లో పడ్డాడు. అప్పటి నుంచి జైస్వాల్‌ లైఫ్‌ కాస్త మెరుగుపడింది.

అతని కోచింగ్‌లోనే ఆరితేరిన జేస్వాల్‌.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. దేశవాళి క్రికెట్‌లో సత్తా చాటాడు. అండర్-19 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా, దేశవాళీ వన్డే క్రికెట్‌లో 71 పరుగుల సగటు ఉండడంతో ఐపీఎల్‌లో జైస్వాల్‌కు మంచి ధరపలికింది. రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున బరిలోకి దిగిన జైస్వాల్‌.. అగ్రెసివ్‌ ఓపెనర్‌గా పేరుతెచ్చుకున్నాడు. టీమిండియాలోకి అరంగేట్రం చేసి అదరగొడుతున్నాడు. ఆడిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లోనే సెంచరీ చేసి.. రోహిత్‌కు జోడీ అయిపోయాడు. ఇప్పుడు తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో జట్టు మొత్తం విఫలమైన చోట.. అద్భుత బ్యాటింగ్‌తో డబుల్‌ సెంచరీతో టీమిండియాకు ఫ్యూచర్‌ స్టార్‌గా అవతరించాడు. మరి ఇంట్లో నుంచి పారిపోయి.. నేడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న జైస్వాల్‌ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments