నేపాల్‌తో మ్యాచ్‌కు వర్ష గండం! మ్యాచ్‌ రద్దయితే భారత్‌కు డేంజరా?

ఆసియా కప్‌ 2023లో భాగంగా ఈ రోజు(సోమవారం) శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయి క్రికెట్‌ స్టేడియంలో భారత్‌-నేపాల్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌ మధ్యలోనే ఆగిపోయి.. వర్షం కారణంగా పూర్తిగా రద్దయిపోయింది. దీంతో క్రికెట్‌ అభిమానులు తీవ్ర నిరాశచెందారు. అయితే.. ఇప్పుడు నేపాల్‌తో జరగాల్సిన మ్యాచ్‌ కూడా వర్ష గండం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం అక్కడ వర్షం వచ్చే అవకాశాలు 90 శాతం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే.. మ్యాచ్‌ ప్రారంభం అయ్యే సరికి.. ఆ పర్సంటేజ్‌ కాస్త తగ్గనుంది.

వరుణుడు కరుణిస్తే.. మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ సజావుగా సాగే అవకాశం ఉంది. కానీ, సాయంత్రం అయ్యేసరికి కచ్చితంగా వర్షం వస్తుందని అంటున్నారు. దీంతో ఈ మ్యాచ్‌ కూడా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లా ఒక ఇన్నింగ్స్‌ మాత్రమే జరిగే ఛాన్స్‌ ఉంది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ తీసుకున్న విషయం తెలిసిందే. రోహిత్‌, కోహ్లీ, గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ విఫలమైనా.. ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా అద్భుతంగా ఆడి టీమిండియాను ఆదుకున్నారు. వారిద్దరి పోరాటంతో టీమిండియా 266 పరుగులు చేసింది. కానీ, టీమిండియా ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత జోరు వాన ఎంతకూ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేసి చెరో పాయింట్‌ ఇచ్చారు.

అయితే.. ఇప్పుడు నేపాల్‌తో జరిగే మ్యాచ్‌ సైతం రద్దు అయితే.. మళ్లీ టీమిండియాకు ఒక్క పాయింట్‌ మాత్రమే వస్తుంది. మరి టీమిండియా సూపర్‌ 4కు చేరుతుందా? లేక ఆసియా కప్ నుంచి ఇంటికి వచ్చేస్తుందా? అనే అనుమానులు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. నేపాల్‌తో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయినా.. టీమిండియా సూపర్‌4కు చేరుతుంది. ఎందుకంటే.. గ్రూప్‌ ఏలో ఇండియాతో పాటు పాకిస్థాన్‌, నేపాల్‌ ఉన్న విషయం తెలిసిందే. ఆసియా కప్‌ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్‌, నేపాల్‌పై విజయం సాధించింది. ఆ తర్వాత భారత్‌తో జరిగిన మ్యాచ్‌ రద్దు కావడంతో పాక్‌ ఖాతాలో మొత్తం 3 పాయింట్ల ఉన్నాయి. భారత్‌ ఖాతాలో ఒక పాయింట్‌ మాత్రమే ఉంది. ఇప్పుడు నేపాల్‌తో మ్యాచ్‌ రద్దు అయితే.. రెండు జట్లకు చెరో పాయింట్‌ ఇస్తారు.

అలా భారత్‌ ఖాతాలో రెండు, నేపాల్‌ ఖాతాలో ఒక్క పాయింట్‌ మాత్రమే ఉంటుంది. 3 పాయింట్లతో పాక్‌ తొలి స్థానంలో, 2 పాయింట్లతో భారత్‌ రెండో స్థానంలో నిలిచి సూపర్‌ ఫోర్‌కు చేరుతాయి. ఒక్క పాయింట్‌తో చివరి స్థానంలో నిలిచిన నేపాల్‌ ఇంటి బాటపడుతుంది. ఒకే వేళ మ్యాచ్‌ జరిగి.. టీమిండియా, నేపాల్‌పై విజయం సాధిస్తే.. మూడు పాయింట్లతో సూపర్‌ 4కు చేరుతోంది. అలా కాకుండా నేపాల్‌, భారత్‌పై విజయం సాధించి సంచలనం సృష్టిస్తే.. పాక్‌తో పాటు నేపాల్‌ సూపర్‌ 4కు చేరుతుంది, టీమిండియా ఇంటిబాట పడుతుంది. మ్యాచ్‌ జరిగి టీమిండియా ఓడితే తప్పా.. ఆసియా కప్‌ నుంచి టీమిండియా వెనుదిరగదు. నేపాల్‌ చేతిలో టీమిండియా ఓడిపోవడం జరగడం అంత తేలిక కాదు కనుక.. ఆసియా కప్‌ 2023లో టీమిండియా సూపర్‌ 4కు చేరడం ఇక లాంఛనమే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సిక్సులతో హడలెత్తించిన హల్క్‌! కొడితే ఇలా కొట్టాలి.. సెంచరీ!

Show comments